వరంగల్, జూన్ 19: ఎస్సీ వర్గీకరణ సాధన, వికలాంగుల, వృద్ధాప్య, వితంతువుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు నెలలో భారీ ఎత్తున రాజకీయ పోరాటాలు నిర్వహిస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రకటించారు. ఈ వర్గాల సమస్యగా పరిష్కారం విషయంలో అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల జిల్లా విస్తృతస్థాయి సదస్సు బుధవారం ఇక్కడ జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ పాలకవర్గాలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఎస్సీ వర్గీకరణ, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ పెంపు, తెల్ల రేషన్‌కార్డులపై ప్రజలకు అందించే బియ్యం కోటా పెంపు విషయంలో ఆందోళనలు ఉధృతం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ సమస్యల పరిష్కారంకోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పలుమార్లు విజ్ఞాపనలు చేసినా మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని కొనసాగిస్తే మెడలు వంచి అయినా సమస్యలు పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంకోసం ఆగస్టు 6,7వ తేదీలలో ఎం ఎం ఎస్ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని, ఆగస్టు 12న ఎం ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 13న ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని, సెప్టెంబర్ 17న మరో విశ్వరూప మహాసభను నిర్వహిస్తామని ప్రకటించారు. వృద్ధులు, వితంతువుల పెన్షన్ పెంచాలనే డిమాండ్‌తో జూలై ఒకటి నుండి 30వ తేదీవరకు అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు, తహశీల్దార్ కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలు జరపాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జూలై 31న కలెక్టరేట్‌ల, తహశీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని జరపాలని తెలిపారు. వికలాంగుల పెన్షన్‌లను పెంచాలనే డిమాండ్‌తో జూన్ 15నుండి 30వరకు జిల్లా కేంద్రాలలో పోరుయాత్రలు నిర్వహిస్తున్నామని, జూలై 1వ తేదీన కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. జూలై 22నుండి ఆగస్టు 27వరకు వికలాంగుల తిరుగుబాటు యాత్ర జరుగుతుందని తెలిపారు. తెల్లరేషన్ కార్డులపై ఒక్కొక్క లబ్దిదారునికి 15కిలోల చొప్పున బియ్యం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 18 నుంచి రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో ఆకలికేకల పోరు రథయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. ఎమ్మార్పీ ఎస్ జిల్లా అధ్యక్షుడు పుట్ట రవిమాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దక్షణాది రాష్ట్రాల అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ, ఎమ్మార్పీ ఎస్ నాయకులు మంద కుమార్‌మాదిగ, లక్ష్మణ్, వేల్పుల వీరన్న, బొడ్డు దయాకర్, వేల్పుల సూరి, బైరపాక జయాకర్‌మాదిగ, బరిగెల సునిత, హన్మంతరావు, బొర్ర బిక్షపతి, ఆరెపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు.
మావారికి సాయం చేయండి సారూ..
మంగపేట, జూన్ 19: దైవదర్శనానికి ఉత్తరకాశీకి వెళ్లి కేదారినాథ్ సమీపంలో వరదలలో చిక్కుకుని గత నాలుగురోజులుగా అన్నపానీయాలు లేకుండా అవస్థలు పడుతున్న వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన యాత్రికులకు సహాయం చేయాలని స్థానిక డిప్యూటీ తహశీల్దార్ ద్వారా కలెక్టర్, ఉన్నతాధికారులకు వారి బంధువులు విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న యాత్రికుల బంధువులు డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేసి తమ బంధువులకు సరైన సదుపాయాలు లేకుండా కేదారినాథ్ వరకు చేరుకుని బయటకు రాలేక చిక్కుకుపోయినట్లు తెలిపారు. వారికి సహాయం చేయవలసిందిగా డిప్యూటీ తహశీల్దార్ ద్వారా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా మంగళవారం సాయంత్రం వరకు కేదారినాథ్ వరకు చేరుకున్న తమకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుండి ఏ రకమైన సహాయ సహకారాలు అందలేదని, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు అక్కడికి వచ్చిన అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ తమను ఆదుకోవడం లేదని బుధవారం ఉదయం ఫోన్ ద్వారా తమకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. పత్రికలలో, టివి చానళ్లలో వస్తున్నట్లుగా సహాయకచర్యలు ఏ మాత్రం తమ దరికి చేరలేదని, అన్నపానీయాలు లేక అల్లాడుతున్న తమకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోవడం లేదని తెలిపినట్లు వారు పేర్కొన్నారు. తమ సెల్‌ఫోన్‌లో చివరి ఫోన్ కాల్ ఇదేనని కమలాపురం గ్రామానికి చెందిన అల్లాడి మధుసూదన్ మాట్లాడుతూ బుధవారం రాత్రి వరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం చేయకుంటే తమకు చావే శరణ్యంగా ఉన్నట్లుగా తెలిసినట్లు వారికి బంధువులు పుల్లంశెట్టి వెంకాయమ్మ సోదరులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో కరెంట్ ద్వారా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా కలవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ వారిని రక్షించేందుకు ప్రయత్నం చేయాలని, వరదలలో చిక్కుకున్న కమలాపురం గ్రామానికి చెందిన బాధిత బంధువులు కోరారు.
ఘనంగా రాహుల్ జన్మదినం
బాలసముద్రం, జూన్ 19: యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తనయుడు, కాంగ్రెస్‌పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ 42వ జన్మదిన వేడుకలు హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్‌భవన్‌లో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ జన్మదిన వేడుకల్లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ కేక్‌కట్ చేసి జన్మదిన వేడులకను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తరహాలోనే దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ రాహుల్‌గాంధీ దేశానికి మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మ కలలు రాహుల్‌గాంధీతోనే సాధ్యమవుతాయని అన్నారు. కార్యక్రమంలో ఫిలింసెన్సార్ బోర్డు సభ్యుడు సురేష్, జక్కుల రవీందర్‌యాదవ్, తాడిషెట్టి మధు, సతీ, కృష్ణ, శ్యాం, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి..
మూలధన పథకం రుణాలు
వరంగల్, జూన్ 19: వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి వెంచర్ మూలధన సహాయ పథకాన్ని కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్నట్లు సన్నకారు రైతుల వ్యవసాయ అనుబంధ వ్యాపార సహకార సంఘం (ఎస్‌ఎఫ్‌ఎసి) ప్రాజెక్ట్ అధికారి చంద్రప్రకాశ్ తెలిపారు. వెంచర్ మూలధన పథకంపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రప్రకాశ్ మాట్లాడుతూ వ్యవసాయరంగ అభివృద్ధికి లబ్ధిదారులు బ్యాంకుల చుట్టు తిరిగి రుణాలు అందకపోవడంతో పథకాలను మధ్యలో నిలిపివేయవలసి వస్తోందని అన్నారు. దీనికోసం రాష్ట్రప్రభుత్వం వెంచర్ మూలధన సహాయ పథకం ద్వారా శీతల గిడ్డంగులు, ఉద్యానవనాలు, పూలతోటల పెంపకం తదితర వ్యవసాయ అనుబంధ వ్యాపార సంస్థలకు వడ్డీలేని రుణాలను అందజేస్తోందని తెలిపారు. ఈ పథకం విజయవంతానికి దేశవ్యాప్తంగా 21 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. వినూత్నమయిన ప్రాజెక్టులకు తప్పనిసరిగా ఈ పథకం ద్వారా రుణాలు ఇస్తామని అన్నారు. నూతనంగా ప్రాజెక్ట్ నెలకొల్పితే ఎఫ్‌ఇఎసి సిబ్బంది సందర్శించి సాంకేతిక సహాయం అందజేయడంతోపాటు పూర్తిస్థాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారికి 50వేల రూపాయలు అందజేస్తారని చెప్పారు. అత్యధికంగా 75లక్షల రూపాయల వరకు రుణాలు మూలధన పథకం కింద అందజేస్తారని అన్నారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ఈ పథకం విజయవంతంగా అమలవుతోందని, అదేవిధంగా మన రాష్ట్రంలో అమలు చేయడానికి రైతులకు, బ్యాంకర్లకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వర్‌రావు, ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అక్బర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ దత్, బ్యాంకర్లు పాల్గొన్నారు.
పిల్లల చదువులపై పోలీసు సిబ్బంది..
శ్రద్ధ చూపాలి
వరంగల్, జూన్ 19: విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిడులు ఉన్నా తమ పిల్లల ఉన్నత చదువుల విషయంలో పోలీసు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని వరంగల్ రూరల్, అర్బన్ ఎస్పీలు పాలరాజు, వెంకటేశ్వర్‌రావు సూచించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన పోలీసు సిబ్బంది పిల్లలను బుధవారం రూరల్, అర్బన్ ఎస్పీలు కాకతీయ యూనివర్సిటీ సెనెట్‌హాల్‌లో జరిగిన ‘మా ఆణిముత్యాలు’ కార్యక్రమంలో వరంగల్ రూరల్, అర్బన్ ఎస్పీలు అభినందించి జ్ఞాపికలు అందజేశారు. పోలీసు సిబ్బంది తమ కుటుంబసభ్యులతో హాజరైన ఈ కార్యక్రమంలో 99మంది పదవ తరగతి విద్యార్థులకు, 28మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎస్పీలు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ పాలరాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువును ఇష్టంతో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని, పోలీసు సిబ్బంది పిల్లలు తమ తల్లిదండ్రులు విధినిర్వహణలో పడే కష్టాన్ని గుర్తించి చదువు పట్ల శ్రద్ధ కనబరచాలని తెలిపారు. సుమారు 800మంది పోలీసు సిబ్బంది పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, మరో 400మంది ఐటి రంగంలో రాణిస్తున్నారని చెప్పారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ గతంలో పోలీసు సిబ్బంది పిల్లలు చదువులో వెనుకబడి ఉండేవారని, ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులలో వచ్చిన మార్పుతో తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిచేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. కానిస్టేబుళ్ల పిల్లలు దేశంలో ఐఎఎస్, ఐపిఎస్‌లుగా విధులు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుని పోలీసు సిబ్బంది తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్, రూరల్ అదనపు ఎస్పీలు బి.ఉమామహేశ్వర్, కె.శ్రీకాంత్, ఎఆర్ కమాండెంట్ ప్రభాకర్, హన్మకొండ డిఎస్పీ శరత్‌బాబు పాల్గొన్నారు.
అభివృద్ధి బాటలో ఇనగాల
పలు స్వచ్చంధ కార్యక్రమాలతో అభివృద్ధి
ఆత్మకూరు, జూన్ 19: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఇనగాల ట్రస్ట్ పలు స్వచ్చంధ కార్యక్రమాలను చేపట్టి ఆత్మకూరు మండలంలోని వివిధ గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతోంది. ముఖ్యంగా ఇనగాల ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనగాల వెంకట్‌రాంరెడ్డి మండలకేంద్రంలో ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణంకోసం అవసరమయ్యే స్థలాన్ని తన తండ్రి అమరేందర్‌రెడ్డి జ్ఞాపకార్థం విరాళంగా ఇచ్చారు. వేదపాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తూ రెండు ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండలకేంద్రంలో ఏడు చేతిపంపులు వేసి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిరుపేదలకు ప్రభుత్వపరంగా సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల స్థలాల మంజూరుకు కృషి చేస్తున్నారు. మండలంలోని పెంచికలపేట గ్రామంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి 50వేల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను బాలిక కుటుంబసభ్యులకు అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. నిరుద్యోగ యువకులకు ఉపాధి మార్గాలు చూపుతూ పలువురికి ఆదర్శంగా ఇనుగాల ట్రస్ట్ నిలిచింది. సొంత డబ్బులతో చేతిపంపులతోపాటు అంతర్గత రోడ్ల మరమ్మత్తులకు బ్రాహ్మణపెల్లి కల్లుమండువ నుండి రేవూరి తిరుపతిరెడ్డి వ్యవసాయ బావి వరకు రెండుకిలోమీటర్ల మేర జెసిబి, ఎనిమిది ట్రాక్టర్ల సహాయంతో రోడ్డు మరమ్మత్తు పనులను బుధవారం ట్రస్ట్ సభ్యులు రేవూరి జైపాల్‌రెడ్డి, పొగాకుల గౌతమ్ ప్రారంభించారు. అలాగే మండలంలోని తిరుమలగిరి బీటిరోడ్డు నుండి పూజారి రాము వ్యవసాయ భూమి వరకు కిలోమీటర్ వరకు రోడ్డును, తిరుమలగిరి నుండి గుడెప్పాడ్ మార్కెట్ వరకు మూడుకిలోమీటర్ల రోడ్డు, ఆత్మకూరు జాతీయ రహదారి నుండి పొగాకుల అయిలయ్య వ్యవసాయభూమి వరకు కిలోమీటర్ వరకు, తిరుమలగిరి బీటిరోడ్డు నుండి కనె్నబోయిన అయిలయ్య వ్యవసాయ భూమి వరకు 11కాలువలు, ఒక రోడ్‌డ్యామ్ నిర్మాణం చేపట్టి రోడ్ల మరమ్మత్తులు చేపట్టినట్లు వెంకట్‌రాంరెడ్డి తెలిపారు. వర్షాకాలం అనంతరం అంతర్గత రోడ్ల నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ఎస్సీ వర్గీకరణ సాధన, వికలాంగుల, వృద్ధాప్య, వితంతువుల సమస్యల
english title:
sc
Date:
Thursday, June 20, 2013