అఫ్గానిస్తాన్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. గత పనె్నండేళ్లుగా సాగుతున్న తాలిబన్ వివాదం ఆసక్తికర పరిణామాలనే ఆవిష్కరిస్తోంది. అమెరికా జంట సౌధాలను కూల్చిన 9/11 అనంతరం అల్‌ఖైదా, తాలిబన్లను తరిమికొట్టాలన్న లక్ష్యంతో అమెరికా మొదలెట్టిన యుద్ధం ఇప్పటి వరకూ ఓ కొలిక్కి రాలేదు. అల్‌ఖైదా అధినేత లాడెన్ హతుడైనప్పటికీ ఆ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇంకా అనేక దేశాల్లో బీభత్సాన్ని సృష్టిస్తూనే ఉంది. ముఖ్యంగా అల్‌ఖైదాకు అండదండలందించిన ఒకప్పటి తాలిబన్లు నెమ్మదిగా అఫ్గాన్‌లోనే పుంజుకుంటున్నారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపన జరగాలంటే తాలిబన్లతోనే చర్చలు జరపాలన్న వాదన నేపథ్యంలో అమెరికా ఇందుకు సిద్ధ పడటం అనేక కోణాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నదే. గత పనె్నండేళ్ల అఫ్గాన్ యుద్ధంలో తాము తాలిబన్లతో చర్చలు జరపడం అన్నది కొత్త మలుపేనంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించడం..అసలు అగ్రరాజ్య వ్యూహమేమిటన్న దానిపై అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంత కాలం పోరాడిన తాలిబన్లతోనే అమెరికా చర్చలకు దిగడం ఆన్నది కర్జాయ్ సర్కార్‌కు మింగుడు పడటం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చర్చలు జరగడానికి వీల్లేదన్న తీవ్రత ఆయన మాటల్లోనూ, తీసుకున్న నిర్ణయంలోనూ కనిపిస్తోంది. ఎప్పుడైతే తాలిబన్లతో చర్చల యోచన తెరపైకి వచ్చిందో అమెరికాతో భద్రతా చర్చల్ని కొనసాగించేది లేదంటూ కర్జాయ్ తెగేసి చెప్పేశారు. అంతే కాదు, ఖతర్‌లో నిర్మించ తలపెట్టిన తాలిబన్ కార్యాలయం పట్ల కూడా ఆయ న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం..అఫ్గాన్-అమెరికాల మధ్య సయోధ్య స్థానే వివాదం చోటుచేసుకుంటోందని చెప్పడానికి నిదర్శనం. వచ్చే ఏడాది అఫ్గాన్ నుంచి నాటో దళాలు నిష్క్రమించాల్సి ఉంది. ఆ తర్వాత కూడా దేశ శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అమెరికా తన దళాలను కొనసాగించాలంటే..అఫ్గాన్‌తో జరుపుతున్న చర్చలు ఫలప్రదం కావాల్సిందే. అయితే.. మధ్యలో తలెత్తిన తాలిబన్ వ్యవహారం ఈ ప్రక్రియను ఏ మలుపుతిప్పుతుందో అంతుబట్టడం లేదు. అసలు తాలిబన్లతో చర్చల సాఫల్యతకు ఆస్కారం ఉందా లేదా అన్న విషయాన్ని నిర్థారించుకోకుండానే అమెరికా ఆ ప్రతిపాదన చేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
తాలిబన్లతో చర్చలకు అమెరికా ఎంత ఉత్సాహాన్ని చూపించిందో వారి నుంచి అంతే స్థాయిలో విఘాతక చర్యలు మొదలయ్యాయి. తాలిబన్లు జరిపిన దాడిలో నలుగురు అమెరికా సైనికులు మరణించిన నేపథ్యంలో అనంతర పరిణామాలు ఎలా ఉంటాయన్నదానిపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. అమెరికాతో శాంతి, భద్రతా చర్చల్ని నిలిపివేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కర్జాయ్ ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. తమతో ఓ పక్క శాంతి చర్చలు జరుపుతూనే తాలిబన్లతో మంతనాలు సాగిస్తామన్న సంకేతాలను ఒబామా ప్రభుత్వం వ్యక్తం చేయడం గందరగోళాన్ని సృష్టిస్తోందన్న కర్జాయ్ వాదన సరైనదే. ముఖ్యంగా అమెరికా మాటలకు, చేతలకు పొంతన లేదని చెప్పడం ద్వారా భవిష్యత్‌లో ఇరు దేశాల సంబంధాలపైనే అనుమానాలు రేకెత్తించింది. ముఖ్యంగా ఎమిరేట్స్‌లో ఏర్పాటు చేసిన తాలిబన్ కార్యాలయానికి ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్’అని పేరు పెట్టడాన్ని కర్జాయ్ ప్రభుత్వం తీవ్రంగానే నిరసిస్తోంది. 1996 నుంచి అఫ్గాన్‌ను పాలించిన తాలిబన్ ప్రభుత్వం ఇదే పేరుతో విదేశాల్లోని కార్యాలయాలను కొనసాగించింది. అయితే, 2001లో అమెరికా దాడి అనంతరం పతనమైన నేపథ్యంలో తాలిబన్ ఉద్యమ పీఠమే కదిలిపోయింది. అసలు తాలిబన్ ప్రభుత్వమే లేనప్పుడు కతర్‌లోని దాని కార్యాలయానికి ఇలాంటి పేరు పెట్టడమేమిటన్న అఫ్గాన్ వాదన ఎంతైనా సమంజసం. ఈ విషయంలో కర్జాయ్ అభిప్రాయం ఏమిటో అమెరికాకు తెలిసినప్పుడు అలాంటి పేరుతో తాలిబన్ల కార్యాలయం ఏర్పాటును అనుమతించడం ఏమిటన్న ప్రశ్న సహజంగా తలెత్తేదే! దీనితో పాటు గతంలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా అమెరికా-అఫ్గాన్ సంబంధాల్లో అపశ్రుతులకు కారణమయ్యాయి. తాలిబన్లతో నేరుగా అమెరికా చర్చించడమంటే అఫ్గాన్‌లో తమ ప్రభుత్వ ఉనికిని విస్మరించడమేనన్నది కర్జాయ్ వాదన. మరో పక్క ఈ వారంలోనే తాలిబన్లతో చర్చలకు తాము సిద్ధమవుతున్నామని అమెరికా గట్టిగా చెప్పడం పరిస్థితిని మరింత సంక్షుభితంగా మార్చింది.
అఫ్గాన్ శాంతికి సంబంధించి ఎలాంటి చర్చలు జరిపినా అవి దేశ రాజధాని కాబూల్ కేంద్రంగానే జరగాలి తప్ప కతర్ నుంచి మొదలు కాకూడదన్న కర్జాయ్ వాదన దేశ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిందే. తన సొంత ఉనికి కోసం కర్జాయ్ ఎంతగా తాపత్రయ పడుతున్నా..అమెరికా దళాల మద్దతు లేనిదే ఒక్క రోజు కూడా మనుగడ సాగించలేరన్నది ఎంతైనా నిజం. తాజాగా బలాన్ని సంతరించుకున్న తాలిబన్లు ఇప్పటికే రోజువారీ దాడులతో ప్రభుత్వ ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. మరో పక్క అమెరికాతో చర్చలకు మార్గాన్ని సుగమం చేసుకుంటూనే..కర్జాయ్ ప్రభుత్వంతో కూడా తాము శాంతి చర్చలకు సిద్ధమని తాలిబన్లు ప్రకటించడం కొత్త మలుపు. ఇదే లక్ష్యంతో తాము కతర్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పడం కర్జాయ్ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెట్టే ప్రయత్నమే. తాలిబన్లతో అమెరికా చర్చలు జరిపినా, కర్జాయ్‌తో ఈ మాజీ పాలకులు మంతనాలకు దిగినా వాటి అంతిమ లక్ష్యం ఏమిటన్నది అంతుబట్టకుండా ఉంది. ముఖ్యంగా అఫ్గాన్ కొత్త రాజ్యాంగానికి నిబద్ధమై పని చేయడానికి తాలిబన్లు సిద్ధంగా ఉన్నారా అన్నది అంతుబట్టడం లేదు. ఒక వేళ అఫ్గాన్‌లో మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా మారే అవకాశం లభిస్తే దాన్ని తాలిబన్లు ఎంతగా సద్వినియోగం చేసుకుంటారన్నదానిపైనే తదుపరి ఫలితాలు, పరిణామాలు ఆధారపడి ఉంటాయి. అఫ్గాన్‌ను కేంద్రంగా చేసుకుని ఇతర దేశాల భద్రతకు ముప్పు కలిగించే రీతిలో వ్యవహరించేది లేదంటూ తాలిబన్లు అమెరికాకు ఇచ్చిన హామీయే వారితో చర్చలకు ఆస్కారం ఇచ్చిందని భావించవచ్చు. అంతే కాదు, ఇంతకాలం అల్‌ఖైదాతో సన్నిహితంగా మెసిలిన తాలిబన్లు ఇక నుంచి ఆ ఉగ్రవాద సంస్థను పక్కన పెట్టేందుకూ వెనుకాడరన్న సంకేతాలను తాజా పరిణామాలు అందిస్తున్నాయి. ఇందుకు తాలిబన్లు తగిన నమ్మకాన్ని కలిగించే పక్షంలో ఇప్పటి వరకూ నిర్బంధించిన తాలిబన్ ఖైదీలను గ్వాటనామో నుంచి విడుదల చేయడానికీ అమెరికా వెనుకాడక పోవచ్చు. 2011లో మొదలైన శాంతి ప్రక్రియకు ఖైదీల విడుదల డిమాండే గండికొట్టింది. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన నవాజ్ షరీఫ్ ప్రభుత్వ పాత్ర అత్యంత కీలకం కాబోతోంది. చర్చల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే కొద్దీ పాకిస్తాన్ పాత్ర ప్రాధాన్యత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే..అఫ్గాన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా వాటి ప్రభావం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భారత్‌పై అనివార్యంగానే ఉంటుంది. మొత్తం మీద తాలిబన్లతో అమెరికా చర్చల యోచన ఆ దేశ భవితవ్యాన్ని ఎలాంటి మలుపుతిప్పుతుందన్నది అందరి దృష్టిని ఆకర్షించే పరిణామం.
సంపాదకీయం
english title:
kotha malupu
Date:
Friday, June 21, 2013