అమెరికా సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఉద్యోగి ఎడ్‌వర్డ్ స్నోడెన్ ఈమధ్య ఒక సంచలానత్మక రహస్యాన్ని బయటపెట్టాడు. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే అతిపెద్ద నిఘా సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఎ)...పౌర స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా కార్యకాలాపాలు నిర్వహించే విధానం నిజంగా భయం గొల్పుతున్నదని.. నిజంగా ఇది రాజ్యం పౌర స్వేచ్ఛను అడ్డుకోవడమేనన్నది ఆయన వెల్లడించిన విషయంలోని సారాంశం! అన్ని రంగాల్లోకి తన నిఘానేత్రాలను విస్తరింపజేసిన ఎన్‌ఎస్‌ఎ, వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను, టెక్స్ట్‌మెసేజ్‌లు, సెర్చ్ ఇంజెన్‌ల నిర్మాణ క్రమాన్ని, బ్యాంక్ రికార్డులు, ఈ-మెయిల్స్, ఇంటర్నెట్‌లో విదేశీయులు, అమెరికన్లు మాట్లాడుకునే మాటలను ట్యాప్ చేస్తున్నది. నిజంగా ఇది ప్రఖ్యాత రచయిత ఓర్‌విల్లన్ తన రచనల్లో భయంకలిగించే రీతిలో వివరించిన రీతిని తలపుకు తెస్తున్నదంటే అతిశయోక్తి కాదు.
నెప్టానా కటారియా అనే మొక్క నుంచి వెలువడే ఒకరకమైన వాసన పిల్లులను ఆకర్షించినట్టుగా, ఎన్‌ఎస్‌ఎ కబంద హస్తాల గురించి స్నోడెన్ వెల్లడించిన అంశాలు, ప్రస్తుత అధికార వ్యవస్థను వ్యతిరేకించే సిద్ధాంతాలను అనుసరించే వారిని ఆకర్షించాయి. అమెరికాలో పనిచేస్తున్న వామ -పక్షాల కార్యకర్తలు, రైట్-వింగ్ సంప్రదాయవాదులు, సామాజిక-ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం కలుగజేసుకోకూడదని వాదించే లిబరిటేరియన్ల చేతికి స్నోడెన్ ఒక ఆయుధాన్నిచ్చినట్టయింది. ‘దేశీయ సమాజం, అంతర్జాతీయ సమాజం’పై అమెరికా ప్రభుత్వం చూపుతున్న ఆధిపత్యంపై స్నోడెన్ చూపిన దృష్టాంతం..ఎలక్ట్రానిక్ రంగంలో తాను సాధించిన ఆధిపత్యాన్ని అడ్డుపెట్టుకొని ప్రపంచ దేశాల్లోకి మరింత విస్తారంగా చొచ్చుకొని వెళ్ళే హక్కు అగ్రరాజ్యానికి ఎవరిచ్చారన్న ప్రశ్నను రేకెత్తిస్తున్నది. అంతే కాదు అమెరికా విపరీత చొరవ కారణంగా, వివిధ దేశాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి కూడా!
తన డిజిటల్ నిఘా వ్యవస్థ ద్వారా, పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించిన దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉన్నదంటూ, ఎన్‌ఎస్‌ఎ బహిర్గతం చేయడంతో మన దేశం ఒక్కసారిగా నివ్వెరపోయింది. స్నోడెన్ తన హెచ్చరిక ద్వారా..ప్రజాస్వామ్య దేశాల్లో అత్యంత ప్రభావశీలంగా ఉన్న విలువలు- పత్రికా స్వాతంత్య్రం నుంచి ప్రైవేటు లావాదేవీలను రహస్యంగా నిర్వహించుకునే హక్కు వరకు- ఒక్కసారిగా ప్రమాదంలో పడిపోయాయన్న సత్యాన్ని ఆవిష్కరించాడు. అయితే సాధార ప్రజలను నియంత్రించడానికి ఉపయోగపడే ‘‘ఈ సమాచార సామ్రాజ్యంలో’’ అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థల పాత్ర ఏమిటనేది ఇంతవరకు అర్థంకాని విషయం. స్నోడెన్ బట్టబయలు చేసిన ఎన్‌ఎస్‌ఎ ‘పట్టకం’ ద్వారా కొనసాగుతున్న కార్యకలాపాల నిర్వహణలో.. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, దేశంలోని అగ్రగామి ఐటి సంస్థలైన మైక్రోసాఫ్ట్, యాహూ, గూగుల్, యాపిల్, ఫేస్‌బుక్, స్కైప్ వంటి వాటి సహకారం తప్పనిసరిగా ఉంటుందనేది అక్షర సత్యం. వీటి సహాయం లేకుండా ఎన్‌ఎస్‌ఎ ఎట్టి పరిస్థితుల్లో ఇంతటి విస్తృతమైన కార్యానికి పూనుకోవడం దుస్సాధ్యం!
ఈ సాంకేతిక సంస్థలు కావాలనే అమెరికా ప్రభుత్వంతో కుమ్మక్కై, తమ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ సమాచార వ్యవస్థలను, ప్రభుత్వానికి అందించడమే కాకుండా, ఎప్పటికప్పుడు అవసరమైన సేవలు కూడా అందిస్తున్నాయి. అంతేకాదు వాటి సర్వర్లను ప్రభుత్వానికి అందుబాటులో ఉంచాయి కూడ! మరి ‘పెద్దన్న’ మన ఇళ్ళలో మాట్లాడుకునే ప్రతి పదాన్ని తెలుసుకొని దాన్ని పరిశీలించేంతటి స్థాయి డేటాను కలిగివుండాలన్న ఉత్సాహాన్ని చూపుతున్నట్లయితే, అప్పుడు ఈ కుట్రలో సహ భాగస్వామిగా నిలిచేది అమెరికాలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే! ఐటి సేవలందిస్తున్న కార్పొరేషన్లకు ఇప్పటి వరకు ‘పట్టకం’ అనే పదాన్ని వినివుండవు. కానీ స్నోడెన్ వెల్లడించిన ప్రకారం, అమెరికాలోని ప్రైవేటు రంగం, ఈ అపరిమిత సమాచారాన్ని అందించడంలో మాత్రం ప్రభుత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నదనేది సుస్పష్టం.
ఈ దొంగచాటుగా సమాచారాన్ని సేకరించే ఈ పథకంలో, రెండోస్థాయి ప్రైవేటు కార్పొరేట్ రంగం కూడా ఉన్నది. నిజం చెప్పాలంటే స్నోడెన్ ‘బూజ్ అల్లెన్ హామిల్టన్’ అనే అటువంటి సంస్థలో పనిచేస్తున్నారు. అత్యంత సంక్లిష్టమైన అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించి ఈ సంస్థ అతిపెద్ద కాంట్రాక్టరు. అమెరికా ఇంటెలిజెన్స్ బడ్జెట్‌లో 70శాతం వరకు..రాజకీయంగా సన్నిహిత సంబంధాలున్న ప్రైవేటు కాంట్రాక్టు కంపెనీలైన..బూజ్, పలంటీర్ టెక్నాలజీస్ ఇన్‌కార్పొరేషన్, సైన్స్ అప్లికేషన్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ వంటి వాటి యజమానుల జేబుల్లోకే వెళుతుంది. స్నోడెన్‌కు అత్యంత గుప్తమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉన్నదంటే...దీని భావమేంటి? ఆయన పనిచేసే కంపెనీ వంటి సంస్థలకు ప్రధాన వినియోగదారుడు, అమెరికా ప్రభుత్వం! అందువల్ల ఈ కంపెనీలు సాధారణ అమెరికన్లు లేదా విదేశీయుల జీవితాలకు చెరుపు చేసే అవకాశాలే ఎక్కువ! అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సేకరించే సమాచారం వల్ల.. ఏవిధమైన నేర చరిత లేనివారిని, ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేని అమాయకులను తీవ్రమైన వేధింపులకు గురిచేయడం లేదా బెదిరించడం లేదా ఉగ్రవాదులుగా ముద్రవేయడం వంటివి జరిగే అవకాశాలే ఎక్కువ.
ప్రజలను అణచివేసేందుకోసం దుష్ట రికార్డులు నిర్వహిస్తూ వస్తున్నదన్న అపప్రధ ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వంపైనే ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయి నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటైన హైబ్రిడ్ వ్యవస్థ నేడు అమెరికాలో కొనసాగుతుండటం సరికొత్త పరిణామం. అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఈవిధంగా ఏకమొత్తంగా ప్రైవేటీకరణ దిశగా పయనింపజేయడానికి అంతటి అత్యుత్సాహమెందుకో అర్థం కాదు. పరిశోధనాత్మక జర్నలిస్టు టిమ్ షోరోక్ తాను రాసిన ‘‘స్పైస్ ఫర్ హైర్ : ది సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఔట్ సోర్సింగ్’’ అనే పుస్తకంలో ఈవిధంగా తన వాదనను వినిపించారు, ‘‘ ప్రస్తుతం ఉగ్రవాద వ్యతిరేక పోరుకు అర్థవివరణ ఇచ్చే అతిముఖ్యమైన పదబంధం ..‘ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం’. ఇక్కడ భాగస్వామ్యం అనే సానుకూల పదాన్ని బహుళజాతి సంస్థలు ప్రయోగించడంలో ప్రయోజనాలు అనే అంతరార్ధం ఇమిడి ఉంది!’’ ప్రొఫెసర్ ఛాల్మర్స్ ఈవిధంగా వివరించారు..‘‘నిఘా సమాచారాన్ని సేకరించి విశే్లషించడాన్ని ప్రైవేటీకరించడం అనే అంశంపై అమెరికాలో కనిపిస్తున్న తడబాటు వల్ల, విదేశీ గూఢచారులు అమెరికా రహస్యాలను సేకరించే అవకాశాలను మరింతగా పెంచుతున్నాయి.’’
స్నోడెన్ ప్రస్తుతం చైనాలో తలదాచుకుంటున్నాడు. దీనిపై చైనా ప్రభుత్వ ఆధీనంలోని ‘గ్లోబల్ టైమ్స్’ వ్యాఖ్యానిస్తూ, అమెరికా కంప్యూటర్ల హ్యాకింగ్, సైబర్ వార్‌ఫేర్‌కు సంబంధించిన నిర్దిష్ట సమాచారాన్ని స్నోడెన్ నుంచి రాబట్టవచ్చునని పేర్కొంది. అయితే ‘ప్రతి నిఘా’ వ్యూహాన్ని ఇప్పటికే చైనా అనుసరిస్తున్నదన్నది బహిరంగ రహస్యం. ముఖ్యంగా యుఎస్ ప్రైవేటు భద్రతా సంస్థల్లో ‘మోల్స్’ను నెలకొల్పడం ద్వారా చైనా దీన్ని అమలు పరస్తుండవచ్చు. అమెరికా జాతీయ భద్రతా కార్యకలాపాలన్నింటిని ఏకమొత్తంగా ప్రైవేటీకరించడంలో ఉత్పన్నమయ్యే మరో సమస్య ఏమంటే.. ఏవిధమైన భాగస్వామ్యం లేని వారికి లేదా అమెరికా ప్రజలకు ప్రైవేటు సంస్థలు జవాబుదారీగా ఉండవు. ఇదే సమయంలో ప్రపంచ ప్రజల మధ్య కొనసాగే సమాచార లావాదేవీలన్నీ, రహస్యంగా వినడం వల్ల..వారు తీవ్రంగా మోసపోవడం జరుగుతుంది.
నయా-సరళీకృత అమెరికాలో, నేడు ప్రభుత్వం చేస్తున్న అతిని, కార్పొరేట్ సంస్థల నేరాలను వేలెత్తి చూపేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఒబామా.. ‘ఈ-మెయిల్ తనిఖీల’పై సంప్రదాయ వాదులు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ, విదేశాలకు చెందిన ప్రజల ఈ-మెయిల్స్‌ను తనిఖీ చేసే అమెరికా ఇన్‌కార్పొరేషన్ అపరిమిత అధికార పరిధిని ప్రశ్నించే సాహసం చేయకండి..అంటూ వ్యంగ్యాత్మక విమర్శలు చేస్తున్నారు. ఇక అమెరికాలోని ప్రైవేటు సెక్యూరిటీ కాంట్రాక్టర్లకు యుఎస్ కాంగ్రెస్‌లోని రెండు పార్టీల వారి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అంతేకాదు తమతో అత్యంత స్నేహంగా ఉండే స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రయోజనం కల్పించే స్థానిక ప్రాజెక్టులకోసం ప్రభుత్వం నిధులు సమకూర్చేలా చేయగలుగుతున్నాయి. ఒక పిశాచం మాదిరిగా ప్రభుత్వం పౌరుల రోజువారీ జీవితాల్లోకి అక్రమంగా ప్రవేశించడం ఇంకా ఎంతోకాలం కొనసాగకపోవచ్చు. ఎందుకంటే గత మూడు దశాబ్దాలుగా అధికారాన్ని క్రమంగా ప్రైవేటీకరిస్తూ వస్తున్న ప్రభుత్వం అందుకు జవాబుదారీగా ఉండటం లేదు. వీకీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ‘‘సైఫర్‌పంక్స్ : ఫ్రీడమ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ది ఇంటర్నెట్’’ అనే పుస్తకంలో.. ‘‘ఈ సరికొత్త డిజిటల్ నియంతృత్వం అంటే..కేవలం రాజ్యం నిఘా వ్యవస్థ, లాభాలే ఊపిరిగా పనిచేసే కార్పొరేట్ సంస్థలు వీలీనమైపోవడం మాత్రమే,’’ అని వ్యాఖ్యానించారు. అసాంజే..స్నోడెన్‌ను ఒక హీరోగా గొప్పగా పొగడటమే కాదు ఇంటర్నెట్ పుణ్యమాని ‘మన పక్క కిందనే సైనికుడు నిఘావేసి మనం మాట్లాడుకునే మాటలను వినే పరిస్థితి దాపురించింది,’ అంటూ విమర్శించారు. అయితే ఇక్కడ గూఢచారిగా వ్యవహరించే వారు సిఐఎకు చెందిన సివిల్ సర్వెంటు లేదా ఎంఐ6 కూడ కాదు..కానీ ఒక ప్రైవేటు సంస్థలో పనిచేసే ఐటి వృత్తి నిపుణడు మాత్రమే. చైనాకు చెంది సైబర్ సైన్యంలో ఇప్పటికీ పురాతన ప్రభుత్వ బ్యూరోక్రసీకి చెందినవారు మాత్రమే పనిచేస్తున్నారు. కానీ మన ప్రైవసీలోకి చొరబడే పాశ్చాత్య చొరబాటు దార్లు మాత్రం కార్పొరేట్ పోరాట యోధులు!
‘బలహీనులకు ప్రైవసీ, బలవంతులకు పారదర్శకత’ అనే సిద్ధాంతాన్ని అసాంజే చెబుతుంటారు. కానీ ఈవిధంగా ప్రభుత్వ- ప్రైవేటు సమిశ్రీత నిఘా వ్యవస్థ కొనసాగినంతకాలం దాన్ని సాధించడం సాధ్యంకాదు!
ఫీచర్
english title:
feature
Date:
Friday, June 21, 2013