జగన్ అక్రమ ఆస్తుల కేసు ఎ2 ముద్దాయి విజయసాయిరెడ్డికి తిరుమలలో అనవసర మర్యాదలు దక్కడంపై వ్రాయవలసి వచ్చినప్పుడు ముందుగా చైర్మన్ రాజుగారు మరియు కార్యనిర్వహణాధికారి సుబ్రహ్మణ్యం గారలవైపు చూపుడు వేలు పోతుంది. పూర్వజన్మ సుకృతం కారణంగా వారికి స్వామి సేవాభాగ్యం కల్గిందని భావించాలి మొదట. అపచారం జరుగుతున్నపుడు నివారించే ప్రయ త్నం చేయడం, కుదరనపుడు తప్పుకోవడం వంటివి స్వామి ధ్యానంలో ఈపాటికి వచ్చిన వుండాలి వారికి. తితిదే విషయంలో శ్రీ ఎన్టీఆర్ నెలకొల్పిన సత్ప్రమాణామాలు అనితర సాధ్యం. వైఎస్‌ఆర్ కాలంలో తితిదేలో ప్రారంభమైన ప్రమాణాల పతనం ఆయన కాలంచేసినా అట్లాగే ఉండడం దురదృష్టకరం. చివరగా- మీడియాకు చేసే ప్రార్థన ప్రముఖుల రాకపోకలు వ్రాయకుడీ! చూపకుడీ! సామాన్యులం తట్టుకోలేకున్నాం.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, వరంగల్
భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి
హిందూ మతం నేడు విదేశీ కబంధ హస్తాలలో ఉంది. భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం చేతగాని తనంలా తీసుకుని కొన్ని మిషనరీ సంస్థలు మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నాయి. ఇదో పెద్ద కమిషన్ వ్యాపారంగా తయారైంది. హిందూ దేవాలయాల దగ్గర, ప్రధాన కూడళ్ళలో మత మార్పిడి గాళ్ళు నిల్చుని వచ్చీపోయే వారిని నసపెడుతూ ప్రలోభాలకి గురిచేస్తూ మతం మార్చుకోమని సలహాలిస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. భారతీయ సంస్కృతి అంతా హిందూ మతంపై ఆధారపడి ఉంది. హిందూ మతం చాలా విస్తారమైనది. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు వేదాంగములతో విస్తరించి ఉన్నది. అలాంటి మతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ హిందువు ప్రధాన కర్తవ్యం. ప్రలోభాలకి, డబ్బుకి అమ్ముడుపోకుండా భారతీయ సంస్కృతిని కాపాడాలి. మత మార్పిడులను పూర్తిగా నిషేధించాలి. మత మార్పిడి గాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- ఆర్.శంకరరావు, దొండపర్తి
ధరాభారంతో జనం సతమతం
రాష్ట్ర చరిత్రలో స్వాతంత్య్రం సిద్ధించిన నాటినుండి నిత్యావసర సరుకుల ధరలు ఇంత ఎక్కువగా పెరిగి సామాన్య ప్రజానీకం బ్రతుకులు ఛిన్నాభిన్నం అయిన సంఘటనలు లేవేమో? బియ్యం, నూనె, పప్పులు, కూరగాయలు.. ఇలా నిత్యావసర సరుకుల ధరలు రాకెట్ స్పీడుతో పెరిగిపోతుంటే వాటిని నియంత్రించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. రైతుల నుండి తక్కువ ధరలో కొనుగోలుచేసి, అక్రమ నిల్వలకు పాల్పడుతూ రేట్లు పెంచుకుంటూ దళారులు, వ్యాపారస్తులు కోట్లు గడిస్తుంటే, చట్టాలను అమలుచేసి ధరలకు కళ్లెం వేయాల్సిన అధికారులు, పాలకులు చోద్యం చూస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజానీకం పాలిట వరప్రసాదిని ప్రజాపంపిణీ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేసారు. ప్రజలకు, రైతులకు ఏ లోటూ రాకుండా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం దులిపేసుకోవడం దారుణం. ప్రజల ఓట్లతో అధికార పీఠం అధిష్టించి, ప్రజల పన్నులతో సకల సౌకర్యాలు అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
- సి.సాయిమనస్విత, విజయవాడ
అవగాహన అవసరం!
ప్రజాస్వామ్య విధానంపై ఓటరు విజ్ఞత ధర్మరక్షణ ఆధారపడి వుంటుంది. తాను అడ్డదారిన నడిస్తే జాతి పురోగతి పతనం అవుతుంది. ఈ సమాజంలో ప్రతి ఓటరు నీతి మార్గాన నడుస్తుంటే ఏ దుష్టశక్తులు ఏమీ చేయలేవు. సమాజ సమగ్రతకు మనం దృఢ సంకల్పంతో మంచిగా కర్తవ్యం పాటించాలి. పౌర జీవనంలో సమాజ సమస్యల ప్రస్తావన ప్రజాస్వామ్యంలో లేకపోవడం దురదృష్టం! ఎన్నికలు కేవలం రాజకీయ వ్యవహారంగా తలంచే ఉపకరణం కాదు! ఓటరు అత్యంత బుద్ధివికాసంలో దేశశ్రేయస్సుకొరకు ఓటు వినియోగించాలి. రాజకీయాల నైతిక విలువలు ప్రతి పౌరుడు అర్ధంచేసుకోవాలి! అప్పుడే మార్పు వస్తుంది! ఓటరు మహశయులారా ప్రాథమిక హక్కుల విలువ గుర్తుయెరిగి విషపూరితమైన మార్గాలు అవలభించకుండా సక్రమైన పద్ధతియందు ఎన్నిక కార్యాచరణ యందు అందరు మమేకం కావాలి!
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
లొసుగుల చట్టం
కసబ్‌కు కోర్టు ఉరిశిక్ష వేసింది. రాష్టప్రతి వ్యతిరేకించిన క్షమాభిక్షపై రివ్యూ పిటిషన్ వేయడానికి కసబ్‌కు అవకాశం యివ్వక ప్రభుత్వం తప్పుచేసిందని ఓ లా ప్రొఫెసర్ ఓ ఆంగ్ల పత్రికలో పెద్ద వ్యాసం రాసారు. చట్టంలో యిలాంటి లొసుగులు అనేకం ఉండబట్టే నేరస్తులు తప్పించుకు తిరుగుతున్నారు. న్యాయమూర్తులు నిస్సహాయులవుతున్నారు. ‘‘ద జడ్జ్ జడ్జస్ ఎకార్డింగ్ టు లా, బట్ హి కెనాట్ జడ్జి ద లా’’.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఉత్తరాయణం
english title:
letters to the editor
Date:
Friday, June 21, 2013