సరీగ్గా 338 సంవత్సరాల క్రితం.. అంటే 1675లో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశినాడు సహ్యాద్రి పర్వతశ్రేణులలో ఉన్న రాయగఢ్‌లో ఛత్రపతిగా పట్ట్భాషిక్తుడైనాడు శివాజీ మహారాజు. సువిశాల భారతదేశంలోని సమస్త నదీనదాల నుండి తెచ్చిన పవిత్ర జలాలతో హైందవీ స్వరాజ్య పరిపాలకుని అభిషిక్తుడ్ని చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పరిపాలన చేస్తున్న రాజులు, సుల్తానులు కానుకలు సమర్పించుకున్నారు.
మామూలుగా ఎవరో ఒక రాజు పట్ట్భాషిక్తుడైతే అందులో అట్టహాసం ఉండవచ్చును గాని విశేషమేముంటుంది? కాని శివాజీ పట్ట్భాషేకంలో అన్నీ విశేషాలే. శివాజీ పుట్టుకతో రాజవంశంలో పుట్టినవాడు కాదు. రాజ్యం వారసత్వంగా సంక్రమించిందీ కాదు. ఈ దేశం పరాయి పరిపాలకుల పద ఘట్టనలో నలిగిపోతుంటే, స్వధర్మం, విగ్రహాలు, విధ్వంసకుల వికృత చర్యలకు రూపుమాసిపోతూ ఉంటే, నడి వీధుల్లో గోమాతలు నిత్యం హత్య చేయబడుతుంటే, ఈ దారుణ కృత్యాలకు అడ్డుకట్టవేయడానికి ప్రతినబూనిన సామాన్య మానవుడు శివాజీ. ఆయన తండ్రి బహమనీ సుల్తానులవద్ద కొలువున్న చిన్న సర్దారు. కాబట్టి చిన్ననాడే ఆయుధ విద్యలను అభ్యసించాడే గాని, అక్షరాలను నేర్వలేదు. అయినా తల్లి జీజీబాయి చెప్పిన రామాయణ, భారత ఇతిహాసాల కథల ద్వారా శివాజీకి లభించింది కాలక్షేపం కాదు, కార్యాచరణకు ముందుకు దూకించే ప్రేరణ. అందుకే తోటి బాలురతో సైన్యాన్ని సమకూర్చుకొని తోరణ దుర్గ విజయంతో హైందవ స్వరాజ్య స్థాపనకు విజయ తోరణాన్ని కట్టాడు శివాజీ.
తురుష్కుల దండయాత్రకు పూర్వం ఎంతో వైభవోపేతంగా వున్న భారతదేశం కపట యుద్ధాన్ని ఎరుగదు. సమాన స్థాయి వారితోనే యుద్ధం. పగటిపూట మాత్రమే యుద్ధం. గ్రామాలలోని సామాన్య ప్రజానీకం మీద యుద్ధంయొక్క దుష్ప్రభావం పడేది కాదు. తురుష్కుల దండయాత్రపై నియమాలకు విరుద్ధంగా నడిచింది. శత్రువు ఏమరపాటుగా ఉన్నపుడు దొంగదెబ్బ తీయటంలోనే వారి నేర్పు గోచరవౌతుంది. ఓడిపోయినప్పుడల్లా కాళ్ళావేళ్ళాపడి శరణు పొంది, ఒక చిన్న అవకాశం దొరికితే చాలు ఇక్కడి రాజులను క్రూరంగా చంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటం, అంతటితో ఆగకుండా గ్రామాలపైబడి దోచుకోవటం, దేవాలయాలను ధ్వంసంచేయటం, స్ర్తి బాల వృద్ధులచే విచక్షణ కూడా లేకుండా మారణ హోమం సాగించటం తురుష్కుల దండయాత్రలలో సర్వసామాన్య విషయాలు.
శివాజీకి ముందు దేశరక్షణకై పూనుకొన్నవారు దేశరక్షణలో తమ ప్రాణాలను బలిదానం చేయటంలోనే ధన్యత ఉందని భావిస్తూ శత్రువుకు వెన్నుచూపకుండ వీరోచితంగా ధర్మయుద్ధం చేస్తూ మరణిస్తూ ఉండగా- జన్మధన్యత చాలదు, సాఫల్యం కూడా కావాలి. అంటే విజయాలు సాధించాలి. అందుకై ముల్లునుముల్లుతో తీయాలి అని భావించి గెరిల్లా యుద్ధంలో మొగలాయిలకు, బహమనీ సుల్తానులకు వారి భాషలోనే సమాధానం చెప్పిన రాజనీతి చతురుడు శివాజీ. అయితే అలాంటి సమయంలో కూడా స్ర్తిల పట్ల, బాలల పట్ల, ప్రార్థనా స్థలాల పట్ల, పవిత్ర గ్రంథాల పట్ల కించిత్తుగూడ అన్యాయం గాని, అక్రమం గాని జరుగకుండా శ్రద్ధవహించి హైందవీయుల ధర్మపరిపాలనకు నిదర్శనంగా నిలిచినవాడు శివాజీ. మరి అటువంటి వ్యక్తిని, ఆయన పట్ట్భాషిక్తుడైన స్ఫూర్తిప్రద ఘట్టాన్ని స్మరించుకొని ఆ వెలుగులో మన కర్తవ్యాన్ని రూపొందించుకోవటం మన కర్తవ్యం.
సబ్ ఫీచర్
english title:
sub feature
Date:
Friday, June 21, 2013