‘‘బాపూ రమణా’’
(ద్విశతి)
అక్కిరాజు సుందరకృష్ణ,
పేజీలు: 48+52,
ప్రతులకు:
ప్రముఖ పుస్తక కేంద్రాలలో
ప్రజలకు నీతి బోధ చేసే శతకములు తెలుగునాట విస్తృత ప్రచారంలో వున్నాయి. నీతి బోధనే కాకుండా భక్తి, శృంగార, వైరాగ్యాలను తెలిపేందుకు శతక ప్రక్రియను చేపట్టినవారు ఎందరో వున్నారు. అధిక్షేపానికి శతక ప్రక్రియ అనుకూలంగా వుండటంచే ఎందరో కవులు తమ ఆగ్రహాన్ని, నిరసనను వ్యంగ్యంగా తెలియజేయడానికి రకరకాల మకుటాలతో శతకాలను రాయడం మొదలుపెట్టారు. కేవలం హాస్యానికని ఉద్దేశించి వ్యంగ్య రీతిలో అధిక్షేప శతకాలు రాయడం ఇప్పుడు మామూలైపోయింది. ఆ కోవలో వచ్చిన మరో శతక సంపుటియే ‘‘బాపూ రమణా.’’
బాపూ రమణల పట్ల అత్యంత గౌరవాభిమానాలు కలిగివున్న అక్కిరాజు సుందర రామకృష్ణ వారిని సంభోదిస్తూ ‘బాపూ రమణా’ మ కుటంతో రాసిన కంద పద్యాల సం పుటి ఇది. బాపూ రమణలు స్నేహానికి మారుపేర్లు. కామా, డాష్‌లతో వారి పేర్లను విడదీయడం కూడా పాపమని భావించే కవి ‘‘ఇద్దరిని కలిపి మిమ్ముల/ నొద్దిక నొకరే యడన్న యూహన్ తమితో/ ముద్దుగా వ్రాసితి నిలి-మీ/ మీరలు/ గనుకను సినిమాలగూర్చి కాస్సేపు కబు/ర్లను వినిపించెద..’’నని సినిమా రంగం గురించి, వాటి పోకడల గురించి, వర్తమాన కాలంలోని సినిమాల పతనావస్థను గురించి వివరించారు. అవార్డులు ఆశించని ఆ జంటను ‘‘గొట్టంగాళ్ళిచ్చెడి, అ/ పట్టాలును బిరుదులున్న పత్రాల్ (సి) గిత్రాల్/ కట్టా వ్యర్ధములు- ఎ/ప్పట్టున చూచినను మీకు’’అని ఓదారుస్తారు. అవార్డులకోసం- బిరుదులకోసం పాకులాడు వారిని, అనర్హులు అవార్డులను కొట్టేయడం పట్ల కవి తన ఆగ్రహాన్ని వెలిబుచ్చుతారు. సమాజంలో వస్తున్న మార్పులు, ప్రజలలో పెరుగుతున్న సుఖ లాలసత ధోరణులను తీవ్రంగా నిరసిస్తారు. నచ్చిన కవులను ప్రశంసల్లో ముంచెత్తారు. సాహిత్య సమావేశాలను, కుకవులను ముఖ్యంగా ‘నానీ’ల్లాంటి సాహిత్య ప్రక్రియలను ‘‘జానాబెత్తెడు’’ గాళ్ళును/ ‘నానీ’లను పేరుబెట్టి నానా లొల్లిన్/ పూనిక సలుపుచు మరి మా/ ప్రాణాల్ తెగ తోడుచుండ్రి’’అంటూ తీవ్రంగా విమర్శించడం వీరికే చెల్లింది. ఆంధ్రదేశమిపుడు ‘అవినీతికి అగ్రగామి’యనీ, ‘‘పద్యప్రియులైన ఆంధ్రులు మద్యప్రియులైరి నేడు’’ ‘‘తలకొక రాష్టమ్రు వలయును, తెలుగుల దౌర్భాగ్యమేమొ తెలియక పోయెన్’’ అని బాధపడతారు. తిరుపతి వెంకటేశ్వరస్వామిని కూడా అధిక్షేపించిన రచయిత తన వృద్ధాప్య సమస్యల పట్ల వాపోవడాన్ని కూడా పద్య రూపంలో తెలియజేసిన విధానం బాగుంది. ‘సరదాగ ప్రాస కోసము/ మరి మరి యత్నించి యిట్లు మక్కువ మీరన్/ ఇరికించితి నిటు పదముల/ బరువును తెగ మోపి నేను’’అంటూ తన ప్రయత్నం గురించి చెప్పి, ‘తప్పైన నను క్షమించుడి’అని వేడుకుంటున్నారు. ‘బాపూ రమణా’ మకుటంతో ప్రారంభించిన ఈ శతకాన్ని వారికి, వారి కృషికి మాత్రమే పరిమితమైతే బాగుండేది. అలా కాకుండా ఇతరేతర విషయాలకు కూడా అదే మకుటంతో రాయడం ఎబ్బెట్టుగా వుంది. సర్వాంతర్యామియైన భగవంతునికి అన్ని విషయాలను నివేదించుకోవడంలో వున్న సౌలభ్యం వ్యక్తులమీద ఉండదు కదా! ఈ పుస్తకంలో సగ భాగాన్ని శతకానికే కేటాయించగా, మిగతా సగ భాగం ‘కవి ప్రశంస’లాంటి ముందుమాటలకు కేటాయించడం ఆశ్చర్యం. ‘బాపూ రమణా’ అంటూ రాసిన ఈ శతకానికి బాపూ వేసిన బొమ్మ చాలా బాగుంది. ఇంకా నయం, వారితో ముందుమాట రాయించలేదు.
ప్రజలకు నీతి బోధ చేసే శతకములు తెలుగునాట
english title:
nirasana
Date:
Saturday, June 22, 2013