అంతరిక్షంలో అద్భుతాలు-
ఐదు విజ్ఞానశాస్త్ర రూపకాలు- డా.వి.వి.వెంకటరమణ,
పుటలు: 94; వెల: రూ.100/-, ప్రతులకు: కె.వెంకటలక్ష్మి, 201, ఆర్.కె.యునైటెడ్ రెసిడెన్సీ, సలీంనగర్ కాలనీ, న్యూమలక్‌పేట, హైదరాబాదు- 500036, ఫోను: 24540574.
విషయాలు తెలుసుకోడానికి ఎంత శ్రమపడాలో, తెలుసుకున్న విషయాలు ఇతరులకు తెలియచేయడానికి అనేక రెట్లు శ్రమపడాలి. సామాన్య విషయాలను గురించి రాయడం ఒక ఎత్తు అయితే, క్లిష్టమయిన సాంకేతిక అంశాలు, వైజ్ఞానిక వివరాలు గురించి రాయడానికి విషయ పరిజ్ఞానమొకటే చాలదు. సామాన్యులకి అర్థమయ్యే సులభమైన పద్ధతిలో చెప్పగలిగిన నేర్పు, ఓర్పు ఉండి తీరాలి. ఈ రెండూ ఉన్న డా.వి.వి. వెంకటరమణ రాసిన అంతరిక్షంలో అద్భుతాలు (ఐదు విజ్ఞానశాస్త్ర రూపకాలు) పుస్తకం పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ రూపకాలన్నీ కూడా ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి. పిల్లల మాసపత్రిక ‘చెకుముకి’లో కూడా ప్రచురింపబడ్డాయి.
ఈ పుస్తకంలో అయిదు రూపకాలున్నాయి. ‘ఈతరం విజేత- సైన్సు’ రూపకంలో మానవ జీవితంతో పెనవేసుకుపోయిన విజ్ఞానశాస్త్ర అంశాలను వివరిస్తుంది. చంద్రుడి గురించిన వివరాలు, ఆ గ్రహంమీద మానవుడు పాదం మోపడానికి తోడైన పరిశోధనల వివరాలున్నాయి. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, యూరీగగారిన్, అపోలో 1 ప్రమాదం, కమాండ్ మాడ్యూల్ లూనార్ మాడ్యూల్, చంద్రుడి మీద షికారుచేసిన లూనార్ రోవర్-1 తదితర వివరాలున్నాయి.
రెండవ రూపకం ‘నవతరానికి కమ్యూనికేషన్స్’లో ఆధునిక సమాచార సాంకేతిక విప్లవం తీరుతెన్నుల గురించిన ప్రస్తావనలున్నాయి. రష్యా ప్రయోగించిన స్పుత్నిక్ 1, జియోసెంట్రిక్ కక్ష్య, జియోసింక్రనస్ కక్ష్య, ఆర్యభట ఉపగ్రహం, ఇన్‌సాట్ ప్రాజెక్ట్, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, జగదీశ్ చంద్రబోసు పరిశోధనలు తదితర వివరాలున్నాయి. 1906లో జరిగిన తొలి రేడియో ప్రసారం అందించిన రెనాల్డ్ ఫెస్సిండస్, లీడె ఫారెస్ట్‌ల ప్రస్తావన కూడా ఉంది. జి.పి.ఎస్. ఇంటర్నెట్, విడియో చాట్, శాటిలైట్ నెట్‌వర్క్, లోకల్ ఏరియా నెట్‌వర్క్, వైడ్ ఏరియా నెట్‌వర్క్, బ్రాడ్‌బ్యాండ్‌ల పరిచయం కూడా ఉంది.
తదుపరి రూపకం ‘అంతరిక్షంలో అద్భుతాలు’లో అమెరికాలోని కేప్‌కెనె్నడీ అంతరిక్ష కేంద్రం వివరాలు చోటుచేసుకున్నాయి. స్పేస్‌షటిల్ ప్రయోగించడం చూడడంకోసం టిక్కెట్లు కొనుక్కోవచ్చునన్న వివరణ ఆసక్తికరంగా ఉంది. సోవియట్ రష్యా స్థాపించిన శాల్యూట్, మిర్ అంతరిక్ష కేంద్రాలని గురించి కూడా తెలుసుకోవచ్చు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యూరోప్, రష్యా, జపాన్, కెనడా, అమెరికా దేశాల భాగస్వామ్యంతో ఏర్పడడం నిజమైన ‘అంతరిక్షంలో అద్భుతం’ అనడం అతిశయోక్తికానేరదు.
నాలుగవ రూపకం ‘ఈతరం విజేత సైన్స్’ రూపకం, అనేక రంగాలలో సాధించిన విజయాలను భావితరాలకు పరిచయం చేసింది. ప్లాస్టిక్‌నుంచి మూల కణాలదాకా, డి.ఎన్.ఏ నించి ఓపెన్‌హార్ట్ సర్జరీదాకా, కాన్సర్ నించి నానోటెక్నాలజీ, జీవోత్పత్తి విషయాలు సరళమైన భాషలో చెప్పడం జరిగింది.
ఆఖరిదైన ‘విజ్ఞానశాస్త్రంలో భారతదేశ ప్రగతి’ రూపకం, విజ్ఞానశాస్త్రంలో పరిశోధనలు చేసి ప్రగతిని సాధించాలంటే, విదేశాలకు వెడితేనే సాధ్యమనే దురభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం చేసింది. రేడియో తరంగాల గురించి అన్ని దేశాలకన్నాముందు భారతదేశంలో విజయవంతమైన ప్రయోగాలు జరిగాయి. మూలకణాల ద్వారా అవయవాలను రూపొందించడం, మిస్సైల్ రంగంలో స్వయం సమృద్ధి, సాగర గర్భ పరిశోధనలు, డి.ఎన్.ఏ. పరిశోధనలు ఔషధీయ మొక్కలు, శాటిలైట్లు, సూపర్ కంప్యూటర్ తదితర రంగాలలో సాధించిన ప్రగతి చదువరులకు అవగతమవుతుంది.
విజ్ఞానశాస్త్రంలో రోజూ అనేక కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. రచయిత ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని తాజా అంశాల్ని కూడా వివరించడం ముదావహం. ఏం చెప్పామన్న దానికన్నా, ఎలా చెప్పామన్నది ముఖ్యం. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు, భారతదేశంలో పరిశోధన చేయాలని వచ్చిన విదేశీ విద్యార్థి, అతని గురువు, ఇతర విద్యార్థుల మధ్య జరిగిన సంభాషణ, రైలుప్రయాణంలో సహ ప్రయాణికుడైన ప్రొఫెసర్‌తో సంభాషణ, స్వదేశీ విదేశీ గురువులు వారి శిష్యుల సంభాషణల ద్వారా అవగాహన పెంచే ప్రయత్నం జరిగింది. ఆకాశవాణి శ్రోతలకోసం రాసిన రూపకాలు చదవడం అంతే సాఫీగా సాగనప్పటికీ, పోటీ పరీక్షలకి సిద్ధపడుతున్న విద్యార్థులకి ఈ పుస్తకం కరదీపికగా ఉపయోగపడుతుంది.
విషయాలు తెలుసుకోడానికి ఎంత శ్రమపడాలో
english title:
wonders of space
Date:
Saturday, June 22, 2013