పవిత్ర - సాంఘిక నవల
రచన: బి.సులోచన
ప్రథమ ముద్రణ: 2013
వెల: రూ.60/-
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్,ఇతర పుస్తక కేంద్రాలు.
ఇదొక విచిత్రమైన నవల.
మామూలుగా మనం చూసే అంతంతమాత్రపు తెలుగు సినిమాలలో మాదిరిగానే ఇందులో కథ నడుస్తుంది.
కథానాయకురాలు పవిత్ర అందాల రాశి. పైగా బుద్ధిమంతురాలు. కాలేజీలో ఈ అప్సరసను చూడగానే హీరో కళ్యాణ్ ప్రేమలో పడతాడు. మర్నాడు ఆ సంగతి తెలుసుకొని పవిత్ర తను కూడా ప్రేమలో పడుతుంది.
హీరోయిన్‌ది మధ్యతరగతి కుటుంబం. హీరో కోటీశ్వరుల కుమారుడు. ఈయన తల్లి మహిళామండలి అధ్యక్షురాలిగా కాలక్షేపం చేస్తుంటుంది. తండ్రి పెద్ద వ్యాపారస్తుడు. భార్య ఉండగా ఆయన మరో మహిళతో సంబంధం పెట్టుకుంటాడు. ఫలితంగా కొడుకులతో తిట్లు తింటుంటాడు.
వ్యక్తిత్వం అనేది ఎక్కడా కనపడని రకరకాల పాత్రలు పుస్తకంలో దర్శనమిస్తాయి.
ఫైటింగు సీన్లు కూడా ఉంటాయి.
కాబోయే అత్తగారికోసం- అంటే హీరో తల్లికోసం హీరోయిన్ చేసే మహత్తరమైన త్యాగం పుస్తకం చివరలో కనిపిస్తుంది.
ఈ పుస్తకంలో పాత్రలైతే అనేకం ఉన్నాయి గాని, ఎవరికీ సరైన వ్యక్తిత్వం కనపడదు.
పుస్తకం చదివి నేర్చుకోవాల్సిన అంశాలేవీ లేవు.
రచయిత్రికి కల్పనాచాతుర్యం ఉంది. శైలికూడా బాగుంది. సన్నివేశాల రూపకల్పన సరిగాలేదు. పైగా సంభాషణలలో స్పష్టత లోపించింది.
ఏ నవలకైనా ఇతివృత్తం ముఖ్యం. ఈ పుస్తకంలో అదే సరిగ్గాలేదు.
ఇదొక విచిత్రమైన నవల.
english title:
pavithra
Date:
Saturday, June 22, 2013