‘‘మన తాత్త్విక వారసత్వం’’ (వ్యాసాలు)
ఎం.వి.ఎస్.శర్మ,
ప్రతులకు:
ప్రజాశక్తి బుక్‌హౌస్,
హైదరాబాద్.
వెల: రూ.100
భారతదేశ తాత్త్విక సంప్రదాయం ఆధ్యాత్మికమేనన్న భావన స ర్వత్రా వ్యాపించిపోయింది. ఇక్కడ అంతా పరలోకం గురించి ఆలోచించేవారే తప్ప ఇహలోకం గురించి, భౌతిక విషయాల గురించి పట్టించుకోరన్న భావన అధికంగా వుంది. భౌతికవాదం అంటే అదేదో పాశ్చాత్య సిద్ధాంతం అని చిన్నచూపు చూసే ప్రచారం కూడా జరుగుతున్నది. నిజానికి మన దేశపు తాత్త్విక వారసత్వం ఆధ్యాత్మికవాదం కాదు. అది మన ప్రాచీన తాత్త్విక సంపదలో చిన్న భాగం మాత్రమే. మన తాత్త్విక సిద్ధాంతాల్లో ప్రధానమైన ధోరణి భౌతికవాదమే. ఉత్తర మీమాంస తప్ప తక్కిన షడ్దర్శనాలు భౌతికవాద దర్శనాలే. ఇవిగాక లోకాయతం, బౌద్ధం, జైనం కూడా భౌతికవాద దర్శనాలే. పశ్చిమ దేశాల్లో తాత్త్విక భావాలింకా రూపుదిద్దుకోని కాలంలోనే మన దేశంలో సుసంపన్నమైన భౌతికవాదం రూపొందిందన్న వాస్తవాన్ని విస్మరించడం సరియైనది కాదు.
హేతువాదం, తార్కికత ప్రధానంగా కొనసాగే భౌతికవాద ధోరణులు ప్రబలితే ప్రజలు తెలివిమీరిపోతారన్న భయంతో పాలకులు వాటిని అణచివేసి భావవాద లేదా ఆధ్యాత్మికత ధోరణులను ప్రోత్సహిస్తూ వచ్చారు. దేవుడు, వేద ప్రామాణ్యం పేరిట భావ వాదాన్ని పెంచి పోషించగా, వాటిని వ్యతిరేకించిన భౌతికవాద ధోరణులను నాస్తిక మతంగా ప్రచారం చేసి అణచివేయడానికి ప్రయత్నించారు.
భారతదేశ తాత్త్విక సంప్రదాయంలో బలమైన భౌతికవాద ధోరణులున్నాయనీ, ఈ ధోరణులు ఆధ్యాత్మికత లేదా భావవాద ధోరణులతో తీవ్రంగా పోరాటం చేశాయని డిడి కోశాంబీ, దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ లాంటి ప్రగతిశీల చరిత్రకారులు, తత్త్వవేత్తలు తమ రచనల ద్వారా నిరూపించారు. తెలుగులో ఏటుకూరి బలరామమూర్తి లాంటివారు కొంత చేసినప్పటికీ భారత తాత్త్విక సిద్ధాంతాల గురించిన రచనలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకుంటూ ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకతను ఎం.వి.ఎస్.శర్మగారు గుర్తించారు. అది మానవ దశనుండి మానవుడిలో పొడసూపిన భౌతికవాద ధోరణులతో ప్రారంభించి క్రమంగా వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, స్మృతులు, షద్దర్శనాలు, ఇతర భారతీయ మతాలలో చోటుచేసుకున్న భౌతికవాద దృక్పథాన్ని వివరించారు. 19వ శతాబ్దంలోని కొంతమంది తాత్త్వికుల కృషిని కూడా చివరన తెలియజేశారు. క్లిష్టమైన తత్త్వశాస్త్ర విషయాలను వ్యాసాలుగా విభజించుకొని సులభశైలిలో ఆసక్తికరంగా తెలియజేసిన విధానం బాగుంది. భారత తాత్త్విక సంప్రదాయం గురించి ఒక సమగ్రమైన దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
భారతదేశ తాత్త్విక సంప్రదాయం ఆధ్యాత్మికమేనన్న
english title:
vishleshana
Date:
Saturday, June 22, 2013