రోజుల తరబడి
దుమ్ము దుప్పట్లు కప్పుకుని
విక్రమార్కుడు మోసే శవంలా
గదిలో ఓ మూల మేకుకు
వేలాడే ఉత్తరాల తీగ
నా మానవ సంబంధాల
పిచ్చుక గూడు...
ఇంటికొచ్చిన తోకలేని పిట్టల్ని
విజ్ఞానంగా నిక్షిప్తం చేసుకున్నాక
తీగపై వాలిన పెంపుడు పక్షుల్లా మలచడం
బలపం పలకను తొలి ముద్దడినప్పటి అలవాటు...
బక్కచిక్కిన అనాధకి
పౌష్టికాహార నిధి దొరికినట్టు...
రోజురోజుకీ రాజకీయ నాయకుని
అనైతిక సంపాదనలా
ఇంతింతై వటుడింతై మురిపించేది...
ఆ ఉత్తరాల దొంతరలలో
ఎనె్నన్ని లక్షల అక్షరాలు?
వాటి విలువ ఎనె్నన్ని అక్షర లక్షలు..
అనుభవ తూణీరాలు నింపుకున్న
అనుభూతుల అమ్ముల పొది
నా ఉత్తరాల తీగ.
ఉద్యోగ బాధ్యతల సాలిగూడులో
దిక్కుతోచక దోగాడుతున్నప్పుడు
అందుకున్న లేఖా సందేశాలు
మనసును శాంతి శాలువలతో
సత్కరించి ఉపశమింప చేసేవి...
బాల్యం నుండి ఈ క్షణం వరకు
నా జీవన రూపాంతరతకు
సమకాలిక మార్గదర్శి
సమకాలీన కార్యదర్శి...
నా ఉత్తరాల తీగ..
ఈ బహు దూరపు బాటసారికి
కడదాకా మిగిలిన ఒంటరి నేస్తం!!
కన్నకొడుకు
-మోకా రత్నరాజు
ఏ నదీమ తల్లి
రొమ్ము పాలు తాగిన పుణ్యఫలమో కాని
గింజను మింగి
కంకిని ప్రసవించే - ఈ పురిటిగెడ్డ బిడ్డనైన ధన్యుడినైతిని.
సాగరమదనంలో
అమృతం పుట్టిందో లేదో నాకు తెలీదు కాని
నిస్సత్తువ దప్పిక గొంతులోకి
సత్తువనిచ్చి దప్పిక తీర్చే జీవ జలనిధి మా గోదారి గంగా బొండామంటే-
కచ్చితంగా అమృత భాండమే అంటానే్నను!
ఏటి నీటి స్నాన పానాలతోపాటు
శ్రమ రెక్కల చెమట ఉగ్గుల్ని పట్టించి
కళ్లల్లో పెట్టుకు పెంచుకున్న కొబ్బరిమొక్కా-
పేగు తెంచుకు పుట్టిన కన్నబిడ్డా-
కళ్లెదుట మసలుతున్న కవల పిల్లల్లా కన్పించేవారు!
మాట తప్పిన కన్నకొడుకు
అవసాన దశలో పట్టించుకోకపోయినా-
తనూ; నేనూ బతకుండాలే కాని
చచ్చేదాకా రుణం తీర్చుకుంటూ-
నెలనెలా జీతభత్యాలు చెల్లించే ఖజానాలా నిలబడ్డ కొబ్బరి చెట్టే - నా కన్నకొడుకు!
*
పట్నంలో శాలిబండ
-ఆశారాజు
దసరా వస్తుంది
దీపావళి వస్తుంది
పక్కపక్కనే పరిమళంతో
నా జ్ఞాపకం నడుస్తుంది
జులూస్‌లో తిరిగే హైదరాబాద్
ముసిముసిగా నవ్వుకుంటుంది
రాఖీ పున్నమి వస్తుంది
జగ్‌నేకీ రాత్ వస్తుంది
కలల చెకీల మీద
వెనె్నల జల్లు కురుస్తుంది
కొత్తబట్టలు కొనుక్కొని
చార్మినార్ తల్లిలా వస్తుంది
బోనాల పండుగ వస్తుంది
హోలీ సందడి వస్తుంది
జాతరలో రంగుల రాట్నం మీద
లాల్‌దర్వాజా మురుస్తుంది
వౌనంగా వున్న మనసులాగ-
శాలిబండ
ఒక గోలకొండ
పీసల్‌బండ
మరొకటి మేకలబండ
ఇవన్నీ రాళ్లూ రప్పలు కావు
ఉరుసులకూ, ఉజ్జయిని వేడుకలకూ
తరలివచ్చే ‘దట్టీలూ’ - ‘తొట్టెళ్లూ’
హార్మోనియం మెట్లలాగ-
హరీబౌలి
రేతిబౌలి
పుత్లీబౌలి
ఇంజన్‌బౌలి
గచ్చుబౌలి
ఇది బెదిరించే దండకం కాదు
భూమి చెమ్మగిల్లిన కమ్మదనం
నేను పెరిగిన గల్లీలు
తిరిగిన బజార్లు
నేర్చుకున్న గజళ్లు
దర్శించిన సౌందర్యాలు
నన్ను ప్రేమికుణ్ణి చేశాయి
వినయంగా బతుకుతూ
పొగరుగా షాయరీ చెప్పడం నేర్పాయి
గుచ్చుకున్న గాజుపెంకుల్ని పారేయలేదు
ఫకీరు పాడిన పాటలు మరిచిపోలేదు
మూసీలో విసిరేసిన చారాణా సిక్కా
ఇప్పటికీ కళ్లల్లో శబ్దం చేస్తుంది
ఇక్కడిది చేమంతుల ఉదయం
మరుమల్లెల సాయంత్రం
మర్మంలేని మనుషులతో
అలలుపు సొలుపు లేని ప్రయాణం
రోజుల తరబడి దుమ్ము దుప్పట్లు కప్పుకుని
english title:
kavitha
Date:
Sunday, June 23, 2013