అది విక్రమపురి. ఆ దేశపు రాజుకి తమ రాజ్యానికి వచ్చే సాధువులను విచారించి, వారి పూర్వాపరాలు తెలుసుకోవటంలో ఆసక్తి ఎక్కువ. అంతేకాదు. వారిలో ఎవరు ఉన్నతమైన వారోనని పరిశీలించేవారు. ప్రపంచంలో సాధువులు గొప్పవారా? అని ఆయనకు తెలుసుకోవాలనిపించింది. దీనిపై మేధావులను ఆయన ప్రశ్నించాడు. ఎవరికి వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు సాధువులే గొప్పవారని, మరి కొందరు బాధ్యతలు నెరవేరుస్తూ గృహస్థు జీవితం గడుపుతున్న వారే గొప్పవారని చెప్పుకొచ్చారు. అయితే తమతమ వాదనలను నిరూపించుకోవలసిందిగా రాజు ఆదేశించాడు. సాధువులను గృహస్థు జీవితం గడుపుతున్న వారిని ఆయన తన సభకు ఆహ్వానించాడు. అందరూ తమ వాదనలు చెప్పసాగారు. చివరగా ఒక సాధువు లేచి నిల్చోగానే రాజు అందరినీ అడిగినట్లే ఆయనను ప్రశ్నించసాగాడు. సాధువు వాటికి ఇలా జవాబు చెప్పాడు.
‘రాజా! ఎవరైనా సరే వారివారి స్థితిగతులలో గొప్పవారే. సమమే’ అన్నాడు. ‘అయితే మీ వాదనను నిరూపించుకోండి’ అని రాజు అడిగాడు.
‘నిరూపిస్తాను. కానీ మీరు నాతో వచ్చి నాలాగా కొంతకాలం జీవించాలి. అప్పుడే నిరూపించగలను’ అని సాధువు అన్నాడు.
అందుకు అంగీకరించిన రాజు సాధువుతో బయలుదేరాడు. ఇద్దరూ మరో ప్రాంతానికి వెళ్లారు. ఆ దేశపు రాజధానిలో భారీ ఉత్సవం జరుగుతోంది. దేశమంతా సందడిగా ఉంది. ఈ సందడిలో ఆ దేశ రాజు ఒక ప్రకటన చేయించాడు. స్వయంవరం జరగబోతోందన్నదే ఆ ప్రకటన. రాజు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేశారన్న ప్రకటన రాజు, సాధువు చెవిన పడింది. స్వయంవరానికి వచ్చేవారిలో మంచి అందగాడినో, తెలివైన వాడినో, యువరాణి ఎన్నుకుంటుంది. ఆమె ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. స్వయంవరానికి వచ్చిన వారి వివరాలు తెలుసుకుంటూ తనకు ఇష్టం లేని వారిని ఆమె వద్దంటుంది. వెనక్కి వెళ్లిపోమంటుంది. అయితే ఆ దేశపు యువరాణి మహా సుందరాంగి. అందగత్తె.
ఆ సభకు ఎందరో వచ్చారు. వారిలో ఒక సాధువు కూడా ఉన్నారు. నింగినున్న సూర్యుడు భూమికి వచ్చాడా అనిపించేలా వున్న ఆ సాధువు మెడలో యువరాణి పూలమాల వేసింది. ఆయననే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. అయితే సాధువుకు కోపం వచ్చింది. ‘ఇది అసందర్భం. తానేమీ పెళ్లి చేసుకోవడానికి రాలేదం’టూ పూలమాలను మెడలోంచి తీసి విసిరేశాడు. అక్కడి నుండి వెళ్లిపోయాడు. యువరాణి పెళ్లంటూ చేసుకుంటే ఆయనే్న చేసుకుంటాననీ, లేకుంటే ప్రాణత్యాగం చేస్తానంటూ ఆ సాధువు వెంట పడింది. ఆమె వెంట విక్రమపురి రాజు, సాధువు వెళ్లారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన సాధువు గుర్తు పట్టలేని ఒక గుహలోకి వెళ్లిపోయాడు. దాంతో యువరాణి వెనుదిరిగి ఒక చెట్టు కింద ఏడుస్తూ కూర్చుంది. విక్రమపురి రాజు, సాధువు ఆమెను ఓదార్చి తిరిగి వెళ్లిపోదామనుకున్నారు. అయితే అప్పటికే చీకటి కావడంతో మరుసటిరోజు ఉదయం వెనక్కు వెళ్లిపోయే విధంగా ఒప్పించారు. ఆ రోజు ముగ్గురూ అక్కడే వున్నారు. ఆ చెట్టుపైన ఒక పక్షి జంట, వాటి పిల్లలు మూడు ఉన్నాయి. చెట్టు కింద వున్న ముగ్గురిని చూసిన పక్షి జంటలో ఆడపక్షితో మగపక్షి, బాగా చలి వేస్తోంది. ఆ ముగ్గురూ చలికాచుకోవటానికి మంట ఏదైనా తయారుచేస్తే బాగుంటుంది అని చెప్పింది.
వెంటనే ఆడపక్షి ఆ ఏర్పాటు చేసింది. అలాగే వారి ఆకలి తీర్చడానికి తమ వద్ద ఏమీ లేనందువల్ల ఆ మంటల్లో తానే పడి వారికి ఆహారమవుతానని మగపక్షి పడిపోయింది. ఆ వెంటనే ఆడపక్షి, మూడు పిల్లలు కూడా మంటల్లో పడిపోయాయి. అది చూసిన విక్రమపురి రాజు, సాధువు, యువరాణి విస్తుపోయారు.
తెల్లవారింది. యువరాణిని విక్రమపురి రాజు, సాధువు ఆమె తండ్రికి అప్పగించారు. అప్పుడు సాధువు విక్రమపురి రాజుతో, ‘రాజా! నీకో విషయం చెప్పదలిచాను. ఎవరైనా సరే వారున్నచోట ఎవరికి వారు గొప్పవారే. గృహస్థు జీవితం గడపాలనుకుంటే మాటల్లో పడి ఆత్మత్యాగం చేసిన పక్షుల్లాగా ఇతరులకు సాయపడే విధంగా జీవించు. లేదంటావా అందాల సుందరిని సైతం పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి గుహలోకి వెళ్లిపోయిన సాధువులాగా జీవించు. ఈ వాస్తవాన్ని తెలుసుకుని జీవనం సాగించాలి’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
*
చేసి చూద్దాం
తలమీద మంట
అనుభవం, నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఈ ప్రయోగం చేసి ప్రేక్షకులను ఆశ్చర్యం లో ముంచెత్తవచ్చు. ఒక వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టి అతని నడినెత్తిన మంట వెలిగించి దాని మీద కాఫీ కాచి, వేడివేడి కాఫీ ఇతరులకు ఇవ్వవచ్చు. దీనిని బహిరంగ వేదికలపై అనేక పర్యాయాలు నిర్వహించటం జరిగింది.
ముందుగా కుర్చీలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టాలి. అతని కళ్లకు గంతలు కట్టాలి. ఒక చిన్న సంచీలో తడి దూదిని ఏకరీతిగా సర్ది చిన్న తలగడగా తయారుచేయాలి. దీనిని కుర్చీలో ఉన్న వ్యక్తి నడినెత్తిన పెట్టాలి. ఇది అథమ ఉష్ణవాహకంగా ఉపయోగపడుతుంది. అంటే తన గుండా ఉష్ణాన్ని ప్రసరింపనీయదు.
నూలుగుడ్డలతో వృత్తాకారంగా ఒక చుట్ట కుదురు తయారుచేయాలి. దీనిని ఈథైల్ ఆల్కహాలుతో తడపాలి. ఈ చుట్ట కుదురును వ్యక్తి నడినెత్తిన ఉంచిన చిన్న తలగడపై పెట్టి అగ్గిపుల్లతో దానిని వెలిగించాలి. ఆ వ్యక్తి నడినెత్తిన మంట పైకి లేస్తుంది. ఆ మంట మీద గినె్న నుంచి అందులో పాలు, కాఫీ పొడి వేయాలి. కొద్ది నిమిషాలలో కాఫీ తయారవుతుంది.
మంటపై అకస్మాత్తుగా పెద్ద గుడ్డను కప్పడంతో దానికి ఆక్సిజన్ అందక మంట ఆరిపోతుంది. మంట పైకి వెడుతుంది. అందువల్ల మనిషి నెత్తికి గాని ఇతర అవయవాలకు గాని మంట వేడి సోకదు. తల మీద అధమ ఉష్ణవాహకం ఉంచడం వలన మంట వేడి తలకు వెళ్లదు. కళ్లకు గంతలు ఎందుకంటే పొరపాటున మంట గాలికి పక్కకు వాలితే కంటికి నేరుగా ఆ వేడి తగలకుండా ఉండేందుకు. బాల బాలికలు మాత్రం ఈ ప్రయోగాన్ని స్వతంత్రంగా ఎవరి పర్యవేక్షణ లేకుండా చేయకూడదు.
-సి.వి.సర్వేశ్వరశర్మ
గోల్డెన్ రూల్ -- స్ఫూర్తి
ఖ్యాతి ప్రవర్తనని ఆమె తల్లిదండ్రులు కొన్ని నెలలుగా గమనిస్తున్నారు. తన అక్కతో, తమ్ముడితో తరచూ గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. సాధారణంగా తప్పు ఖ్యాతిదే అవడం వాళ్లు గమనించారు. ప్రతీసారి ఖ్యాతిని కోప్పడుతున్నారు. కాని ఆ పాప మారలేదు.
ఖ్యాతి పుట్టినరోజు వచ్చింది. ఆ సాయంత్రం వాళ్లు దాన్ని ఓ హోటల్‌లో సెలబ్రేట్ చేశారు. బంధు మిత్రులు, ఖ్యాతి క్లాస్‌మేట్స్, వారి తల్లిదండ్రులు.. దాదాపు నూట యాభై మంది దాకా దానికి హాజరయ్యారు.
ఒకరిద్దరు పూల బొకేలని తెచ్చారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థని నియమించటంతో పిల్లలందరికీ గంటన్నరసేపు కాలక్షేపం అయింది.
‘ఎస్‌తో స్టార్టయ్యే పేరుగల వాళ్లు వెంటనే వచ్చి నన్ను తాకండి. మొదటగా వచ్చిన వాళ్లకి బహుమతి’ ఈవెంట్ మేనేజర్ మైక్‌లో ప్రకటించగానే నలుగురైదుగురు వెళ్లి అతన్ని తాకారు. ముందుగా వెళ్లిన సుశీల, సుధాకర్, సోఫియాలకి అతను చాక్లెట్లు బహుమతిగా ఇచ్చాడు.
ఖ్యాతిని పిలిచి అడిగాడు.
‘నీ ఫేవరేట్ రంగు ఏమిటి?’
‘నీలం రంగు’ చెప్పింది.
‘గుడ్ నీలంరంగు డ్రస్ వేసుకున్న వారికి బహుమతి ఇద్దాం. ఒంటి మీద ఒక్క నీలం రంగు దుస్తులున్నా సరే. చూసి నువ్వే వెళ్లి ఇవ్వు’
ఖ్యాతి చాక్లెట్లు తీసుకుని హాలంతా వెదికి ఆ రంగు డ్రెస్సుల్లో ఉన్న వారికి వాటిని ఇచ్చింది.
‘ఎవరు తమ తల్లిదండ్రులని పట్టుకుని ముందుగా ఈ సర్కిల్‌లోకి తీసుకువస్తారో వారికి ఏభై రూపాయల బహుమతి’ ఈవెంట్ మేనేజర్ ప్రకటించి కింద కార్పెట్ మీద ఓ ప్లాస్టిక్ రింగ్‌ని పెట్టాడు.
సుబ్బారావు దంపతులని వారి కూతురు సుబ్బలక్ష్మి ముందుగా తీసుకువచ్చింది.
ఇలా రకరకాల ఆటలతో కార్యక్రమం గంటన్నర సేపు చక్కగా సాగాక బఫే డిన్నర్ చేశారు. రెస్టారెంట్ వాళ్లకి లెక్క చూసుకుని ఖ్యాతి తండ్రి డబ్బు చెల్లించాక అంతా ఇంటికి బయలుదేరారు. ఖ్యాతి పూల గుత్తులు రెండిటినీ తీసుకోబోయింది.
‘నేనొకటి తెస్తాను’ ఖ్యాతి తమ్ముడు చెప్పాడు.
‘వద్దు. నా పుట్టినరోజుకి నాకు వచ్చాయి ఇవి. నేనే తెస్తాను’ వాడిని పక్కకి తోయడంతో కింద పడ్డాడు.
‘ఈ గులాబీ గుత్తి ఎంత బావుందో కదా?’ తల్లికి చెప్తూ ఖ్యాతి గులాబీ బొకేని చేతిలోకి తీసుకుంది. ఓ ముల్లు ఖ్యాతి వేలికి గుచ్చుకోగానే బాధగా అరిచింది.
వేలి నించి రక్తం బొట్లు కారాయి.
‘గులాబీలు అందంగా వున్నా, ముళ్లు వాడిగా ఉన్నాయి’ తల్లితో చెప్పింది ఖ్యాతి. టిష్యూ పేపర్‌ని రక్తం కారకుండా వేలికి చుట్టుకొంది.
‘అవును అచ్చం నీలానే.’ తల్లి నవ్వుతూ చెప్పింది.
‘అదేమిటి?’
‘గులాబీలా నువ్వు కూడా చక్కగా వున్నావు. కానీ నువ్వు నీ తమ్ముడితో అక్కతో మాట్లాడే మాటలు ముళ్లల్లా వాడిగా ఉన్నాయి. నాన్న నీకు ఎప్పుడూ చెప్పే గోల్డెన్ రూల్ గుర్తుందా?’ తల్లి అడిగింది.
‘గుర్తుంది. నిన్ను ఇతరులు ఎలా ట్రీట్ చేయాలనుకుంటారో నువ్వూ ఇతరులని అలాగే ట్రీట్ చెయ్’
‘కరెక్ట్. గులాబీలకి ముళ్లు లేకపోతే, అంతా ఎలా సంతోషిస్తారో నువ్వు కూడా మృదువుగా మాట్లాడటం నేర్చుకుంటే అప్పుడంతా నిన్ను మెచ్చుకుంటారు’
కారులో ఇంటికి వెళ్తూ ఖ్యాతి తల్లి చెప్పిన విషయమే ఆలోచించింది. ఆ పుట్టిన రోజు అనుభవంవల్ల ఖ్యాతికి గోల్డెన్ రూల్ గురించి బాగా అర్థమైంది. మర్నాటి నించి ఆ పాప ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.
-మల్లాది
సిసింద్రి
english title:
sisindri
Date:
Sunday, June 23, 2013