మన ప్రపంచమే ఒక పోరాట క్షేత్రం.. పోరుబాటలో జీవితం పరిగెడుతూనే ఉంటుంది. భావోద్వేగాలు ఉద్రేక స్వభావంతో ఉరుకుతుంటాయి.. సారధ్యం వహిస్తున్న అంతరంగం వాటికి గంతలు కట్టి దౌడు తీయమంటుంది. పోరాడవలసిన దేహం విస్తుపోయి చైతన్యరహితమైనట్లుగా చేష్టలుడిగినదవుతుంది. ఒకపక్క భావోద్వేగాలకు సారధ్యం వహిస్తూన్న ఆంతర్యం నిశ్శబ్దంగా బ్రతుకు పోరాటం నేర్పుతుంటుంది. అంతర్వీక్షణా ఫలితంగా బహిరంగ రూపానికి మాటలు మిగలవు.. అంతర్వీక్షణతో ఉద్వేగ తత్వాన్ని గణిస్తూ, దౌడు తీస్తున్న తీరును గుణిస్తూ, మనసును హృదయానికి చేర్చి ఆత్మిక జీవనం సాగించవలసి ఉంటుంది. ఈ గమనంలో మానవ పుటక సైతం సంభవామి యుగేయుగే అనుకుంటే తప్ప ప్రపంచీకరణలో నెగ్గుకు రావటం సాధ్యపడదు.
నిజానికి ‘నెగ్గాలి’ అన్న సంకల్పంలో ఎంతో కొంత ‘అహంకారం’ ఉంటుంది. ‘నెగ్గుకు రావాలి’ అన్న లక్ష్యంలో కొంత మేరనైనా భావోద్వేగం మిళితమై ఉంటుంది. ఇలా చూసినపుడు ఇగో, ఎమోషన్ వేరువేరు కాదనిపిస్తుంది. అహంకారం అహంభావాల వల్ల మనకు మనం బందీలమై పోతుంటాం. అంటే మనం గీసుకున్న గీతను దాట ప్రయత్నించం. అయితే భావోద్వేగాలతో మనం మారుతుంటాం. మనం ఊపిరి తీసుకుంటున్న సమాజం కానీ, మనం శ్వాసిస్తున్న కుటుంబ వ్యవస్థ కానీ, మన హృదయ స్పందనలుగా మారిన భక్తిప్రపత్తులు కానీ మనల్ని ఉద్వేగభరితుల్ని చేస్తూనే ఉంటాయి. ఈ జీవన యానంలో తెలివితేటలు, భావోద్వేగాలు సమాంతర వ్యక్తిత్వాలుగా అనిపిస్తున్నప్పటికీ భావోద్వేగ తీవ్రత ముందు తెలివిది కాస్త వెనకడుగే అవుతోంది.
భావోద్వేగాలే జీవితాన్ని దౌడీ తీయిస్తున్నా మనుకున్నపుడు ఈ ఉద్వేగాలను మానవ జీవన ఉద్వేగాలు గాను, దివ్య జీవన ఉద్వేగాలుగాను వింగడించుకోవచ్చు. మానవ పర ఉద్వేగాలన్నీ సమ్మిశ్రీతాలు, కలుషితాలు. దివ్య జీవన ఉద్వేగ పవిత్రాలు, పారదర్శకాలు. కలుషిత ఉద్వేగాల వల్ల ప్రేమకంపితులం అవుతుంటాం.. పారదర్శక ఉద్రేకాల వల్ల ప్రేమ పాత్రల మవుతాం. మానవ ఉద్వేగాలు బందీలను చేస్తుంటే దివ్య ఉద్వేగం స్వతంత్రుల్ని చేస్తుంటుంది. హ్యూమన్ ఎమోషన్స్ భౌతిక మనుగడకు వత్తాసు పలుకుతుంటే డివైన్ ఎమోషన్ అధిభౌతిక జీవనానికి మార్గం సుగమం చేస్తుంటుంది.
అయినా బ్రతుకు పోరులో భయస్థులమూ మనమే! ధైర్యస్థులం మనమే! నిజానికి భయకంపితులమై దివ్యత్వానికి చేరువ కాగలుగుతున్నట్లే ధైర్యంతో స్వంత పంథాలోను దివ్యత్వాన్ని అందుకోగలం. అయితే మనం చేస్తున్న పొరపాటుల తప్పులు చేస్తూ, భయపడుతూ భగవంతుడి ముందు మోకరిల్లి క్షమాపణ కోరుకోవటం.. చేసిన తప్పును మరలా చేయకుండా ఉండే ప్రయత్నం చేయకపోవడం. ఈ మానవ తప్పిదం నుండి బయటపడనంత కాలం భయపడుతూనే ఉండి.. భగవంతుడు క్షమించక శిక్షిస్తాడనే భయంతోనే బ్రతుకును వెళ్లదీస్తుంటాం. ఇలా భయం మనల్ని భక్తి వాకిట కూర్చుండబెడుతోంటే తప్ప ధైర్యంగా ఆత్మను జాగృతం చేయటం లేదు.
ఇంతకీ భయానికి భక్తిరంగు పులిమి చేస్తున్న పూజల్ని నివేదిస్తున్న ప్రసాదాల్ని అందుకుంటున్న భగవంతుడు ఎవరు? ఆ భగవంతుడూ మనలా మరో సృష్టికారకుడే కదా! మనం సృష్టిలోకి వచ్చినట్లుగా మరొకరినీ సృష్టిలోకి తెస్తున్నాం కదా. కాబట్టి ఆ భగవంతుడూ మన స్నేహితుడే! సన్నిహితుడితో స్నేహం చేయాలే తప్ప సిగ్గిలితే ఎలా? మన మనసు వణుకుతున్నంత కాలం స్నేహం పురి విప్పదు.. మనం భయపడుతున్నంత కాలం ఎంతటి ప్రాణ స్నేహితుడైనా మనలోని తప్పొప్పులను చూపించే ప్రయత్నం చేయడు. ఇద్దరం వేరువేరు కాదు అనుకునే తత్వంలోనే, ఆ ‘ఒన్‌నెస్’లోనే డివైన్ ఎమోషన్ ప్యూర్ ఎమోషన్ అవుతుంది.
మనం ప్రతిరోజూ సంధ్యా సమయాలలో చేసే పూజలు భక్తి ప్రపత్తులతో చేస్తున్నవే! అయితే ఈ భక్తి కూడా భావోద్వేగ జనితమేనా? మన ఎమోషన్‌ను ఇలా ‘డివోషన్’గా మలుస్తున్నామా? మానవ సంబంధాల నడుమ మన భావోద్వేగం ప్రాపంచిక మానవ బంధం అవుతోంది. భగవంతుని పరంగా మన భావోద్వేగం దివ్య బంధం అవుతోంది.
ప్రాపంచిక మనుగడలో మన ఎమోషన్స్ ఒక్కొక్కరితో ఒక్కో విధంగా ఉంటున్నాయి. అలాగే అవతలి వారు ఒక్కొక్కలా మన భావోద్వేగాలను అర్థం చేసుకుంటున్నారు. అంటే మానవ సంబంధాలలో మన భావోద్వేగాలు వ్యక్తులను బట్టి, సందర్భాలను బట్టి వేరువేరు తీరుల వ్యక్తమవుతున్నాయన్నమాట. అందుకే అంటుంటారు We offer our emotion according to our capacity and others receive our emotion according to their receptivity అని. మొత్తానికి భావోద్వేగాలను పంచుకోనిదే బంధాలు పెరగటాలు, తరగటాలు జరగటం లేదు. మనం ఉంటున్నది ఒకే వ్యవస్థనే అయినప్పటికీ భావోద్వేగాల పరంగా వ్యవస్థ వైయక్తిక మయిపోతోంది. చివరికి వ్యక్తిపరంగానే భావోద్వేగానికి అస్తిత్వం సిద్ధిస్తోంది.
వ్యవస్థ ఇలా విడిపోతుండటం వల్లనే దైవం, దివ్యత్వం అనే భావనలు మనలో భావోద్వేగాలుగా పరిణమించి మతం నీడన అస్తిత్వాన్ని వెతుక్కుంటున్నాయి. ఫలితంగా దివ్యత్వం ఒక అసామాన్య, సంపూర్ణ వ్యవస్థగా చిత్రితమై పోయింది. అందుకే దైవంతో బంధం ‘త్వమేవాహం’ అవుతోంది. ఇక్కడ పొటమరించే భావోద్వేగమూ ‘ఒక్క’టే.. అదే డివైన్ ఎమోషన్... పవిత్ర భావోద్వేగం.. అంటే కలుషితం కానటువంటిది.
మన బాహ్య జీవనం ఆడంబర జీవనం అని మనందరకూ తెలిసిందే. ఒక విధంగా ఇది కలుషితం అవుతూనే ఉంటోంది. అయితే అంతరంగ జీవనంపై ఈ నీడలు పడటం లేదు. అది నిష్కళంకంగాను, పారదర్శకంగాను, పవిత్రంగాను ఉంటోంది. ఇలా డివైన్ ఎమోషన్ అంతరంగానికి చెందినదవుతోంది. దీనికి హృదయ స్పందనలు ముఖ్యమే తప్ప మానసిక ప్రకంపనలు ప్రధానం కాదు.
సర్వసాధారణంగా మనం భక్తి పారవశ్యంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాం. ప్రార్థనతో మనం సంకల్పిస్తున్నాం అనుకుంటూనే కోరికల చిట్టా విప్పుతుంటాం. ప్రార్థించటం అంటే కోరుకుంటున్నాం అనుకుంటున్నామే తప్ప ప్రాధేయ పడుతున్నాం అని అనుకోవటం లేదు. దివ్యత్వం అనేది శక్తి ప్రవాహం. ఈ శక్తిని దేహంలోకి వొంపుకోవాలే తప్ప ప్రార్థించినంత మాత్రాన అది మనలోకి ప్రవహించదు. విల్ పవర్‌తో డివైన్ పవర్ అంది వచ్చేది. కాబట్టి ప్రేయర్‌కు కావలసింది విల్ పవర్. దివ్యత్వానిది రాజప్రాసాదమయితే మానవత్వానిది రాచరికమే కదా! రాజ్యం మనదే కాబట్టి అందులో ఎలా విహరించాలన్నది మనం నిర్ణయించుకోవాలి... మన ఎంపికను బట్టే దివ్యానందం లభిస్తుంది.
భావోద్వేగానికున్న శక్తిని మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఎమోషన్‌ను పాజిటివ్ అనుకున్నా, నెగెటివ్ అనుకున్నా దాని శక్తి అపారమే. అది చాలా పవర్‌ఫుల్! సామాన్యంగా నచ్చిన వాటిని పాజిటివ్ అంటుంటాం. నచ్చని వాటిని నెగెటివ్ అంటుంటాం. పాజిటివ్ ఎమోషన్స్ వల్ల మంచి జరుగుతుంటుంది. నెగెటివ్ ఎమోషన్స్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక పోయినా, వాటి నుండి బయట పడలేకపోయి బలహీనపడతాం. అంతే తేడా! మనల్ని మనం ఎంత పాజిటివ్‌గా అంచనా వేసుకుంటుంటామో అలాగే మనలో నుండి పుట్టుకొచ్చే ఎమోషన్స్‌ను - ఎటువంటివైనా - పాజిటివ్ గానే డీల్ చేయగలగాలి.
ఐహికానందాన్నిచ్చే హ్యూమన్ ఎమోషన్స్‌ను ఎంత సులభంగా ఆదరించ గలుగుతున్నామో అంతే సరళంగా ఆయుష్మికానందాన్నిచ్చే డివైన్ ఎమోషన్‌తోను అనుసంధానం కాగలగాలి. మానవ జీవితం సంపూర్ణం కావటానికి అన్ని భావోద్వేగాలను సమంగా స్వీకరించ గలుగుతున్నట్లే డివైన్ ఎమోషన్ పరంగానూ స్వయం సమృద్ధం కావలసిందే.
మొత్తానికి హ్యూమన్ ఎమోషన్స్‌ను డివైన్ ఎమోషన్‌తో లింక్ చేయగలిగితే జీవితం ధన్యమైనట్లే! కారణం ఈ అనుసంధానం మన బాహ్యాన్ని అంతరంగాన్ని ముడిపెట్ట గలుగుతుంది కాబట్టి, ఇంకొక విధంగా చెప్పాలంటే మన భావోద్వేగాలను దైవదత్తం చేయగలిగితే అంటే మన కోపతాపాలు, ప్రేమ ఆప్యాయతలు మొదలైన ఉద్వేగాలను భగవంతుడి పరంగాను చూపగలిగితే మన లోలోతుల మార్పు సాధ్యమవుతుంది.
ఈ డివినైజేషన్ ఆఫ్ ఎమోషన్స్ వల్ల భావోద్వేగాల విషయంలో పాజిటివ్, నెగెటివ్ అన్న వింగడింపు లేకుండా పోతుంది. విరుద్ధతలు లేని అద్వితీయ భావోద్వేగం మాత్రమే మిగులుతుంది. ఈ అద్వైత భావనే జీవితాన్ని సంపన్నం చేస్తుండాలి. ఈ దృష్టితో బ్రతుకును అర్థవంతం చేసుకుంటూ పోవాలి.
కొన్ని గుణగణాలతో, ఉద్వేగ ఉద్రేకాలతో మనం వ్యక్తిత్వ సంపన్న మవుతున్నాం... ఈ దేహమూ పురుష లక్షణ సమన్వితమే అవుతోంది. అయితే ఈ కనిపించే దేహంలో కనిపించని ఆత్మ ఒకటుంది. ఆ ఆత్మకు ఉండేవన్నీ మహా పురుష లక్షణాలే. అంటే భౌతిక జీవనానికి మించింది ఆత్మిక జీవనం.
విను నా మాట
english title:
vinu naa maata
Date:
Sunday, June 23, 2013