పాట్నా, జూన్ 23: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర
మోడీపై జెడి(యు) నాయకత్వం
విరుచుకుపడటాన్ని బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్
తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోడీని నియంత
అని, చీలికలు తెచ్చే నాయకుడు అంటూ
జెడి(యు) వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టిన
ఆయన అసలు నరేంద్ర మోడీ చేసిన
తప్పేమిటంటూ ఆ పార్టీ నాయకత్వాన్ని
నిలదీశారు. పదిహేడు సంవత్సరాల పాటు బిజెపి
సారధ్యంలోని ఎన్‌డిఎ కూటమిగా వున్న
భాగస్వామ్య పక్షంగా ఉన్న జెడియు బయటకు
వెళ్లిన వెంటనే నరేంద్ర మోడీపై ఇంత తీవ్ర
స్థాయిలో విరుచుకుపడటం అర్థరహితమని
ఆయన ఖండించారు. ఆదివారం పాట్నాలో
జరిగిన బిజెపి కార్యకర్తల సదస్సులో మాట్లాడిన
రాజ్‌నాథ్‌సింగ్ ‘దశాబ్దానికి పైగా మాతో
కలిసివున్న జెడియు అభిప్రాయం ఆకస్మికంగా
మారడానికి కారణమేమిటి? 2002 నుంచి 2013
వరకు అదే నరేంద్ర మోడీపై కలిసి పనిచేసిన
జెడియు నేతలకు ఆయన ధోరణి ఏమిటో స్పష్టం
కాలేదా? ఇప్పుడు బయటకు వచ్చిన వెంటనే
ఆయన అంత వ్యతిరేకిగా మారిపోయారా?’ అని
నిలదీశారు. నరేంద్ర మోడీని బిజెపి జాతీయ
ప్రచార సారధిగా నియమించిన నేపథ్యంలో
ఎన్‌డిఎ కూటమి నుంచి జెడియు తప్పుకున్న
విషయం తెలిసిందే. మరో పార్టీ ఆంతరంగిక
వ్యవహారాలను సాకుగా చూపించి ఎన్డీఏ నుంచి
జెడియు వైదొలగడం ఎంతమాత్రం సమంజసం
కాదని, ప్రతి పార్టీకి అంతర్గతంగా అవసరమైన
నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని
రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఈ అంతర్గత స్వేచ్ఛలో
భాగంగానే నరేంద్రమోడీని పార్టీని ప్రచార సారధిగా
నియమించామని, అందుకు కారణం దేశవ్యాప్తంగా
ఆయనకున్న ఆదరణ, జనాకర్షణ శక్తేనని
రాజ్‌నాథ్ పేర్కొన్నారు. కొంతకాలంగా కాంగ్రెస్‌కు
సన్నిహితమవుతున్నారంటూ బీహార్
ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పైనా రాజ్‌నాథ్
విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు చేరువ కావడం
వల్ల ఇప్పటివరకు నితీష్‌కున్న కీర్తిప్రతిష్ఠలన్నీ
కూడా దానితోపాటే మిగిలిపోతాయని
హెచ్చరించారు. బీహార్ మంత్రివర్గం నుంచి బిజెపి
మంత్రులకు ఉద్వాసన పలకడాన్ని కూడా
రాజ్‌నాథ్ తప్పుబట్టారు. ఇది ఏకపక్ష నిర్ణయమని,
సంకీర్ణ ప్రభుత్వాలు పనిచేసే పద్ధతే కాదని
తెలిపారు. కాంగ్రెస్‌పైనా తీవ్రస్థాయిలో
విరుచుకుపడ్డ రాజ్‌నాథ్‌సింగ్ ఆ పార్టీని
మహాభారత కథలోని ధృతరాష్ట్రుడితో పోల్చారు.
కళ్లు కనిపించకపోయినా చివరివరకు
ధృతరాష్ట్రుడు అధికారాన్ని పట్టుకుని
వేళ్ళాడాడని, చివరికి భీముడ్ని కూడా
కౌగలించుకుని హతమార్చేందుకు
ప్రయత్నించాడని రాజ్‌నాథ్ అన్నారు. ఇప్పుడు
కాంగ్రెస్ చేతిలో జెడియుకు ఇదే గతి పడుతుందని
హెచ్చరించారు. యుపిఎ ప్రభుత్వం అన్ని రంగాల్లో
విఫలమైందని ధ్వజమెత్తారు.
ఆదివారం పాట్నాలో జరిగిన బిజెపి కార్యకర్తల
సదస్సులో స్థానిక నేతలతో రాజ్‌నాథ్‌సింగ్
జెడియును నిలదీసిన రాజ్‌నాథ్
english title:
m
Date:
Monday, June 24, 2013