హైదరాబాద్, జూన్ 23: రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు ఎట్టకేలకు తమ ఇళ్లకు తిరిగొస్తున్నారు. ప్రత్యేక రైళ్లలో ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు 1,864 మంది చేరుకున్నారు. అయతే వరద బీభత్సంతో మృత్యువు అంచుదాకా వెళ్లి వచ్చిన తమవారిని చూసిన బంధువులు ఒక్కసారిగా రైలు వద్దకు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్లాట్‌ఫామ్ మీద ఇతర రైళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు కూడా ఉండటంతో ఒకరినొకరు తోసుకొని కిందపడ్డారు. మరోవైపు ప్రకృతి విలయాన్ని ప్రత్యక్షంగా చూసిన యాత్రికులు పడ్డ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తమ ఇబ్బందుల గురించి బంధువులకు చెబుతూ కన్నీరు పెట్టారు. అడుగడుగునా బాధితులు, బంధువుల ఆర్తనాదాలే. అందరివీ విషన్న వదనాలే. తిరిగి స్వస్థలాలకు చేరుకుంటామని ఊహించలేకపోయామని బరువెక్కిన హృదయాలతో యాత్రికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.మృత్యువు నుంచి బయటపడడం తమ అదృష్టంగా భావిస్తున్నామని బోరున విలపించారు. తిరిగి రావడం అదృష్టంగా భావిస్తున్నామని హైదరాబాద్‌కు చెందిన రాములమ్మ చెప్పగా, యాత్రలో తానుపడిన కష్టాలు, ఘోర దృశ్యాలను జీవితాంతం మర్చిపోలేనని నిజామాబాద్‌కు చెందిన యాదగిరి కన్నీటి పర్యంతమయ్యాడు.
కళ్ళెదుటే తమతోపాటు వచ్చిన యాత్రికులు వరదల్లో కొట్టుకుపోతుండటం కన్పించిందని మెదక్‌కు చెందిన ఈశ్వరయ్య అనగా,ఏదిఏమైనా తమ వారికి ఇది పునర్జనే్మనంటూ బంధువులు చెబుతున్నారు. ఇదిలావుంటే ఢిల్లీ చేరుకున్న యాత్రికులు ప్రత్యేక రైళ్లలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలకు వస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి ఆర్‌టిసీ బస్సులు ఏర్పాటు చేసి స్వస్థలాలకు వెళ్లడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, యాత్రికుల ఖర్చుల కోసం ప్రతి ఒక్కరికి 2వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. యాత్రికులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. నేటికీ అక్కడి వరదల్లో, కొండ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాత్రికులను తరలించడానికి హెలికాప్టర్‌ను సిద్ధం చేశామని, కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు చెప్పారు. అయతే నేడోరేపో ఉత్తరాఖండ్‌కు హెలికాప్టర్ బయలుదేరి వెళుతుందని విపత్తుల అధికారి కె రాధ తెలిపారు. ఉత్తరాఖండ్, ఢిల్లీలో ఉన్న తెలుగువారి కోసం సహాయ చర్యలను చేపడుతూనే స్వస్థలాలకు వెళుతున్న వారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు. కాగా, వైద్య, ఆహార సదుపాయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని, ఇప్పటి వరకు 3వేల మంది రాష్ట్ర వాసులను గుర్తించామని, అందులో 1,500 మందిని ఢిల్లీ ఎపి భవన్‌కు తీసుకువచ్చామని అధికారులు చెబుతున్నారు.
ఆదివారం తెల్లవారుజామున చార్‌ధామ్ యాత్రికుల బంధువులతో కిటకిటలాడుతున్న సికిందరాబాద్ రైల్వేస్టేషన్.
వరద బీభత్సంనుండి ప్రాణాలతో బయటపడి తిరిగొచ్చిన ఆప్తులకు మిఠాయ తినిపించి ఆనందంతో స్వాగతం పలుకుతున్న ఓ కుటుంబం.
కిటకిటలాడిన సికిందరాబాద్ రైల్వేస్టేషన్ భారీసంఖ్యలో బంధువుల రాక... తొక్కిసలాట యాత్రికుల బాధలు వర్ణనాతీతం సహాయ కార్యక్రమాలను చేపడుతున్నామన్న ప్రభుత్వం
english title:
y
Date:
Monday, June 24, 2013