న్యూఢిల్లీ, జూన్ 23: రాష్ట్రానికి చెందిన ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవటంలో ఆంధ్రాభవన్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా నుంచి ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయన సాయంత్రం ఏడు గంటలకు ఆంధ్రాభవన్ చేరుకుని బాధితులను పలకరించి వారు పడిన బాధలను తెలుసుకున్నారు. నానా గడ్డి కరిచి ఢిల్లీకి చేరుకున్న తమకు ఆంధ్రాభవన్‌లో అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని బాధితులు బాబుకు ఫిర్యాదు చేశారు. చలికి తగిలిన గాయాలకు చికిత్స చేయవలసిందిగా కోరితె వాజ్‌లైన్ తెచ్చుకుని రాసుకోవలసిందిగా అధికారులు సలహా ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదురోజుల పాటు తిండితిప్పలకు నోచుకోని తమకు ఆంధ్రాభవన్ అధికారులు ఉడకని అన్నం, సాంబరు పెట్టి చేతులు దులుపుకున్నారని బాబుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్నానానికి గదులివ్వరాదనీ, ఒకవేళ గది కావాలంటే 6వేల రూపాయలు కట్టండంటూ అధికారులు అన్నారని బాబు దృష్టికి ఈ సందర్భంగా పలువురు బాధితులు తీసుకొచ్చారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షిత ప్రాంతాలకు తరలించటంలోనేగాక చివరకు హెలికాప్టర్ ఎక్కించటంలో అధికారులు విపరీతమైన వివక్ష చూపించినట్లే భవన్ అధికారులు అంతకంటే హేయమైన తీరులో వ్యవహరించినట్లు వీరు తెలియచేశారు. అన్నం పెట్టే విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుకు మనస్థాపం చెందిన తాము ఢిల్లీలో అడుక్కోక తప్పలేదని ఓ మహిళా యాత్రికురాలు బాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి వెళ్లేందుకు ఇంతకుముందు కొన్న టిక్కెట్‌ను రద్దు చేసుకుని కొత్త టిక్కెట్ కొనుక్కుంటేనే ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పారన్నారు. మా దగ్గర చిల్లిగవ్వ లేదని చెప్పినా ఫలితం లేకపోయిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో వచ్చిన తమకు కనీసం ఒక టవల్ కూడా ఇవ్వటానికి అధికారులు ముందుకు రాలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇంతవరకూ ఢిల్లీకి వచ్చి పరామర్శించక పోవటాన్ని బాధితులు తీవ్రంగా విమర్శించారు. సహాయ కార్యకలాపాలను పర్యవేక్షించటానికి నియమితులైన ఇద్దరు మంత్రులు ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో తెలియదని ఆరోపించారు. అమ్మ పెట్టాపెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నతీరులో ఆంధ్రాభవన్ అధికారులు వ్యవహరిస్తున్నారు. తమకు తెలిసిన తెనాలి వాస్తవ్యులు అష్టకష్టాలు పడి ఆంధ్రాభవన్‌కు చేరుకున్నారని తెలిసి ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది బాధితులకు రొట్టెలు, ఆపిల్స్ ఇవ్వటానికి రాగా ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందాలని అధికారులు మెలిక పెట్టారు. దీంతో వారు వెంటనే ఈ విషయాన్ని రెసిడెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పర్యాటక మంత్రి కేవలం సానుభూతి చూపించటం తప్పించి తమని ఆదుకోవటానికి ఎట్టి చర్యలు తీసుకోలేదని బాధితులు అగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రాభవన్‌లో వరద బాధితులకు నగదు పంపిణీ చేస్తున్న చంద్రబాబు
ఆంధ్రాభవన్‌లో పట్టించుకునే దిక్కులేదు దుర్భర పరిస్థితిలో ఉన్నాం చంద్రబాబుకు వరద బాధితుల గోడు
english title:
a
Date:
Monday, June 24, 2013