హైదరాబాద్, జూన్ 23: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత రాజకీయ పునరేకీకరణలు తథ్యమని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ నేత ఎం వెంకయ్యనాయుడు అన్నారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 60వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఇక్కడ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని బిజెపి యువమోర్చా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సర్దార్ పటేల్ లాంటి వ్యక్తులు మొదటి ప్రధాని అయి ఉంటే కాశ్మీర్ లాంటి సమస్య ఉండేది కాదన్నారు. దేశంలో 630 పథకాలకు ఒకే కుటుంబం వ్యక్తులు పేర్లు పెట్టడాన్ని ఆయన ప్రశ్నించారు. నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ కుటిల నీతులను ఎండగట్టిన తొలి వ్యక్తి, బలమైన నేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అన్నారు. ఎన్డీఏ హయాంలో అభివృద్ధి చెందితే, యుపిఏ కాలంలో మాత్రం రూపాయి విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం, తప్పుడువిధానాల వల్లనే అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రంలో మాత్రమే అభివృద్ధి కొనసాగుతోందన్నారు. నరేంద్రమోడీ, మనోహర్ పారికర్, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్ నేతృత్వంలో ఆయా రాష్ట్రప్రభుత్వాలు అభివృద్థి పథంలో అగ్రగామిగా ఉన్నాయన్నారు. మోడీ అంటే త్రీడీ అన్న విషయం ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవడంలో మోడీ స్పందనే నిదర్శనమన్నారు. బీహార్‌లో జెడియూ విడిపోయిన తర్వాత సర్వేలే బిజెపికి, నరేంద్రమోడీ సామర్ధ్యానికి ప్రతీక అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తమ పార్టీ జయకేతనం ఎగుర వేయడం ఖాయమన్నారు. దేశాన్ని ఏకం చేసే విధంగా జాతీయ సమైక్యత, సమగ్రతా సిద్ధాంతాన్ని బలపరిచే పార్టీ కేవలం బిజెపి మాత్రమే అన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితో జాతీయ భావన, దేశభక్తితో ముందుకు అడుగులు వేయాలన్నారు. అవినీతి, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై దేశ యువతీ, యువకులు ముందుకు వచ్చి పోరాడుతున్నారన్నారు. మజ్లిస్ నేతలు హిందువులపై, జాతిపై చేసిన దేశ ద్రోహ వ్యాఖ్యలకు సంబంధించిన కేసు ఎందుకు నీరుకారిందన్నారు. ఇది దేశ సమైక్యత, సమగ్రతకు సంబంధించిన విషయం అని ఆయన అన్నారు. ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలను ఎదిరించడంలో బిజెపి ముందుంటుందన్నారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు లాంటి ఘటనలకు నెహ్రూ కాంగ్రెస్ విధానాలే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు దత్తాత్రేయ, జాతీయ కార్యదర్శి జి. సతీష్, శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి, బిజెపి నేతలు కె హరిబాబు, బద్దం బాల్‌రెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సభలో మాట్లాడుతున్న బిజెపి జాతీయ నేత వెంకయ్యనాయుడు
బిజెపి నేత వెంకయ్యనాయుడు
english title:
r
Date:
Monday, June 24, 2013