న్యూఢిల్లీ, జూన్ 24: ఉత్తరాఖండ్ నుంచి అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఆంధ్రాభవన్ చేరుకున్న తెలుగువారికి ఎదురవుతున్న నిరాదరణపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన దాడికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించటంతో సోమవారం పరిస్థితి కొంత మారింది. ఆంధ్రాభవన్‌కు చేరుకున్న ప్రతి ఒక్క బాధితుడికి 2వేల రూపాయల చొప్పున నగదు సాయం అందించారు. ఇలా సుమారు 2లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినట్లు అధికారులు తెలియచేశారు. అయితే కాలకృత్యాలు తీర్చుకోవటానికే తప్పించి విశ్రాంతి తీసుకోవటానికి గదులను ఇవ్వకపోవటంతో బాధితులు నేలపైనే పడుకుంటున్నారు. కాగా, సాయంత్రానికి సుమారు 125 మందికి టిక్కెట్లు తెప్పించి స్వస్థలాలకు పంపారు. చంద్రబాబు ఒక ప్రత్యేక విమానంలో 120 మందిని హైదరాబాద్ మీదుగా విశాఖకు పంపించారు. ఆయన పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కె నారాయణరావు, రమేష్ రాథోడ్‌తో కలసి డెహ్రాడూన్ వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించారు. నారాయణరావు, రమేష్ రాథోడ్‌లను పరిస్థితి మెరుగుపడేంత వరకూ డెహ్రాడూన్‌లో ఉండి తెలుగువారికి సహాయపడవలసిందిగా ఆదేశించారు. ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మరికొంత మంది మంగళవారం ఢిల్లీ చేరుకుంటారని అధికారులు చెప్పారు. వీరిని తీసుకురావటానికి కొన్ని బస్సులను పంపారు.
వీహెచ్ సాయం
వరద బాధితులను పరామర్శించటానికి ఆంధ్రాభవన్‌కు వచ్చిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు వారి దయనీయ స్థితిని చూసి చలించిపోయారు. సాయంత్రానికి ఆయన వంద మందికిపైగా మహిళలకు చీరలను, సమారు అరవై మంది పురుషులకు వెయ్యి రూపాయల వంతున నగదు అందచేశారు. వరద బాధితులను ఆదుకునే విషయంలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో తన శక్తి మేరకు బాధితులకు సాయం చేశానని చెప్పారు. పార్టీ అధ్యక్షురాలి ఆదేశం మేరకు నెల జీతంతోపాటు పదిలక్షల రూపాయలను ఎంపీలాడ్స్ నుంచి అందజేశానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బాధితులను, పరామర్శించాలని ఆయన కోరారు.
ఆంధ్రాభవన్‌లో ఎన్టీఆర్ ట్రస్టు పేరిట వైద్య శిబిరం ఏర్పాటు చేయటానికి రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ అనుమతి ఇవ్వటానికి నిరాకరించటంతో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. తమకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరేందుకు వెళ్లిన తనకు ఒక ఎంపీనన్న కనీస మర్యాద కూడా ఇవ్వకుండా కమిషనర్ తలబిరుసుగా వ్యవహరించారని టిడిపి రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఆరోపించారు. అధికారం తన చేతులలో ఉందనీ వైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని కమిషనర్ కరాఖండిగా మాట్లాడారని ఆమె చెప్పారు. అయితే ఈ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా తెలుగుదేశం పార్టీ వైద్య శిబిరం నిర్వహించింది. కమిషనర్‌పై చర్య తీసుకోవలసిందిగా తాను ముఖ్యమంత్రిని కోరటంతోపాటు సభా హక్కుల తీర్మానాన్ని ప్రతిపాదిస్తానని ఆమె తెలియచేశారు.
ఎలాంటి లోపాలు లేవు
వరద బాధితులను ఆదుకోవటంలో ఎట్టి లోపాలు లేవని ఆంధ్రాభవన్ రెసిడెంట్ కమిషనర్ తనకు తెలియచేశారని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి విలేఖరులకు చెప్పారు. బాధితులకు మంచి అల్పాహారం, భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రాభవన్‌లో ఉత్తరాఖండ్ వరద బాధిత మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న విహెచ్
వరద బాధితులకు మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వ ఆదేశాలతో అల్పాహారం, భోజనం
english title:
a
Date:
Tuesday, June 25, 2013