న్యూఢిల్లీ, జూన్ 24: భారత సాయుధ బలగాలు గత కొద్ది సంవత్సరాల కాలంలో అమెరికా నుంచి దాదాపు 40 వేల కోట్ల రూపాయల విలువైన సైనిక సామగ్రిని కొనుగోలు చేశాయి. దీంతో సైనిక సామగ్రికి సంబంధించి ఉభయ దేశాల మధ్య సాగుతున్న క్రయ-విక్రయ సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవాలని భారత్, అమెరికా సోమవారం అంగీకారానికి వచ్చాయి. ఇటీవలి కాలంలో ఉభయ దేశాల మధ్య రక్షణ వాణిజ్యం ఎంతో విస్తరిస్తోందని, భారీ రవాణా విమానాలైన సి-17, సి-130జె సూపర్ హెర్క్యులస్‌లను వాయుసేనలోనూ, జలాంతర్గామి విధ్వంసక విమానం పి-81ను నావికాదళంలోనూ ప్రవేశపెట్టడంతో ఉభయ దేశాల మధ్య రక్షణ వాణిజ్యం కొత్త పుంతలు తొక్కిందని భారత్, అమెరికా పేర్కొన్నాయి. పరస్పరం ప్రయోజనం చేకూర్చే విధంగా రక్షణ వాణిజ్య, పారిశ్రామిక సహకార రంగాల విస్తృతికి గల అవకాశాలను అందిపుచ్చుకుని సైనిక సామగ్రి క్రయ-విక్రయ సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఉభయ దేశాలు వివిధ మార్గాల్లో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నాయని రక్షణ రంగానికి సంబంధించిన వాస్తవ పత్రం (్ఫ్యక్ట్ షీట్)లో భారత్, అమెరికా పేర్కొన్నాయి.
భారత్, అమెరికా 2005 నుంచి దాదాపు 40 వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే హై-టెక్ ఆయుధ వ్యవస్థలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు బదిలీ చేయడంపై అమెరికాలో కఠినమైన చట్టాలు రావడం, అలాగే రక్షణ సామగ్రి కొనుగోలుదారుగా కొనసాగేందుకు భారత్ కూడా విముఖంగా ఉండటంతో ఇటీవలి కాలంలో ఉభయ దేశాల మధ్య రక్షణ వాణిజ్యం కాస్త మందగించింది.
సోమవారం ఢిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో అమెరికా, భారత్ విదేశాంగ
శాఖ మంత్రులు జాన్ కెర్రీ, సల్మాన్ ఖుర్షీద్
వరద సహాయ కార్యక్రమాలను
సోనియాకు వివరించిన మర్రి
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, జూన్ 24: జాతీయ విపత్తు నివారణ కమిటీ ఉపాధ్యక్షుడు, శాసన సభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకుని ఉత్తరాఖండ్‌లో తమ కమిటీ చేపట్టిన విపత్తు నివారణ కార్యక్రమాల గురించి వివరించారు. శశిధర్ రెడ్డి హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేతోపాటు ఉత్తరాఖండ్‌లోని వరద ముంపు ప్రాంతాలను సందర్శించి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ జాతీయ విపత్తు నివారణ కమిటీ అధికారులు, కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాలను కూడా పర్యవేక్షించారు. అనంతరం సోమవారం సోనియా గాంధీకి ఈ కార్యక్రమాలు కొనసాగుతున్న తీరు తెన్నుల గురించి లోతుగా వివరించారని తెలిసింది. సహాయ, పునరావాస కార్యక్రమాల్లో కొంత సమన్వయం లోపించిందని సుశీల్‌కుమార్ షిండే చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో శశిధర్ రెడ్డి సమావేశం కావటం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ఇలావుండగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎంఎ ఖాన్ సోనియా గాంధీని కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమస్య తదితర అంశాలు చర్చకు వచ్చాయని అంటున్నారు. కాగా, ఈ సందర్భంగా ఖాన్ తన కుమారుడి పెళ్లి పత్రికను పార్టీ అధ్యక్షురాలికి ఇచ్చి ఆహ్వానించారు.
ఎన్డీఎలో మలుపు
తిరిగిన లుకలుకలు
మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై శివసేన అభ్యంతరాలు
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, జూన్ 24: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి కీలక బాధ్యతలను అప్పగించటంతో పార్టీలోనేగాక కూటమిలో మొదలైన లుకలుకలు మరోమలుపు తిరిగాయి. ఎన్డీయేలో మిగిలి ఉన్న ఇద్దరు భాగస్వాములలో ఒకటైన శివసేన ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోడీని ప్రకటించిన పక్షంలో ఇక్కట్లు తప్పకపోగా భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గిపోయే అవకాశాలున్నాయని బిజెపి నాయకత్వానికి స్పష్టం చేసింది. బాల్‌థాక్రె కుమారుడు ఉద్ధవ్‌థాక్రే పార్టీ అధికార పత్రికలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు బిజెపిని కంగుతినిపిస్తున్నాయి. మోడీకి ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించటంతో ప్రధాన భాగస్వామ్య పక్షమైన జెడియు బయటకు వెళ్లిపోయింది. మోడీకున్న హిందుత్వ ముద్ర వల్ల లౌకిక పార్టీలు కూటమికి దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ‘కొత్త బాగస్వాములను సమకూర్చుకోవటానికి బిజెపి చేస్తున్న కసరత్తేమిటి? భాగస్వామ్య పక్షాలు చెట్లకు పుట్టవు. అదేవిధంగా భాగస్వామ్య పక్షాలతో పరస్పర నమ్మకం విశ్వాసంతో వ్యవహరించాలే తప్పించి వాతావరణ పరిస్థితులపై ఆధారపడ్డ పంటల మాదిరి చూడరాదు’ అని సామ్నా సంపాదకీయం బిజెపికి సలహా ఇచ్చింది. బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థిగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ వైపు శివసేన మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే. బ్రతికి ఉన్నప్పుడు బాల్‌థాక్రే సుష్మానే సమర్థించారు. శివసేన అధికార పత్రికలో వచ్చిన ఈ తాజా సంపాదకీయంపై వ్యాఖ్యానించటానికి బిజెపి నాయకులు నిరాకరించారు. ఎన్నికలకు చాలా వ్యవధి ఉన్నందున ఎన్నో పరిణామాలు జరిగే అవకాశాలున్నాయని మాత్రం చెబుతున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం బిజెపి నాయకత్వం శివసేనతోనేగాక ఏంఎన్‌ఎస్ అధినేత రాజ్‌థాక్రేతో కూడా పొత్తు కుదుర్చుకోవాలని ఆలోచిస్తొంది. గుజరాత్ ముఖ్యమంత్రి మోడీకి రాజ్‌థాక్రేకి సన్నిహిత సంబంధాలున్నందున శివసేనకు టాటా చేప్పే అవకాశాలుంటాయని చెబుతున్నారు.
భారత్, అమెరికా అంగీకారం
english title:
s
Date:
Tuesday, June 25, 2013