హైదరాబాద్, జూన్ 24: రాష్ట్రంలో అధికారం ఆశిస్తున్న పార్టీల సంఖ్య పెరిగిపోవడంతో ప్రతిదీ రాజకీయమే అవుతోంది. చివరకు ఉత్తరాఖండ్‌లోని వరద బీభత్సం ప్రకంపనలు సైతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. టిడిపి అధినాయకుడు చంద్రబాబు ఢిల్లీలో ధర్నాకు దిగి, బాధితులను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించగా, కాంగ్రెస్ నాయకులు బాబు రాజకీయంపై తమ రాజకీయం చూపిస్తున్నారు. టిడిపి తరఫున ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ నాయకులు సైతం ప్రభుత్వం తరఫున విమానాన్ని ఏర్పాటు చేసి, బాధితులను తరలించాలని నిర్ణయించినట్టు మంత్రి దానం నాగేందర్ తెలిపారు. ఇక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు తాము అందరికన్నా ముందే అక్కడికి సహాయ బృందాన్ని పంపించామని, వారు సహాయ కార్యక్రమాలు చేపట్టారని ప్రకటించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడకుండానే చేయాల్సింది చేస్తే, తెలుగు నాయకులు మాత్రం రాజకీయంతో హడావుడి చేస్తున్నారు. తెలుగు నాయకులు మాత్రం సహాయాన్ని మించి రాజకీయం చేస్తూ రాష్ట్రంలో వరద రాజకీయాలకు తెర లేపారు.
చంద్రబాబు నాయుడు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకోగానే ఆయన చార్‌ధామ్ బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదని విమర్శిస్తూ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వెంటనే ఢిల్లీ వెళ్లి ఎపి భవన్‌లో ఉన్న బాధితులను పరామర్శించి అక్కడే ధర్నా చేశారు. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని ఉత్తరాఖండ్ పంపించిది. మంత్రి శ్రీ్ధర్ బాబు అక్కడే ఉన్నారు. మోడీ స్పీడ్‌ను చూసి బాబు రెండు రోజుల తరువాత ఢిల్లీలో వాలిపోగా, కాంగ్రెస్ నాయకులు సైతం జూలు విదిలించారు. సహాయ కార్యక్రమాల ప్రచారంపై అప్పటివరకు దృష్టి సారించని కాంగ్రెస్ నాయకులు బాబు రంగ ప్రవేశం చేయడంతో తమ వంతు రాజకీయానికి శ్రీకారం చుట్టారు.
అయితే ఎపి భవన్‌లో బాధితులకు వైద్య సహాయం అందుతుండగా, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వెళ్లిన డాక్టర్లు వైద్య సహాయం అందిస్తామంటే అధికారులు అభ్యంతరం చెప్పారు. దీనిని టిడిపి తీవ్రంగా విమర్శించింది. అయితే మోడీని మించి పోవాలని భావించిన చంద్రబాబు టిడిపి డబ్బుతో విమానంలో ఢిల్లీ నుంచి బాధితులను హైదరాబాద్ తరలించారు. ఇక సోమవారం ఉదయం నుంచి టిడిపి నాయకులు చార్‌ధామ్ వరదలపై ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టారు.
చార్‌ధామ్ బాధితులను ఆదుకోవడానికి పడవలు పంపించలేరా? అంటూ శాసన సభలో టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు నిలదీశారు. దీంతో ‘వరద బీభత్సంపై మనకున్న అవగాహన ఇదీ.. అంతా కొండ ప్రాంతం.. కొండలపైకి పడవలు పంపాలా?’ అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి టిడిపిని ఎండ గట్టారు. వ్యవహారం అక్కడితోనే ఆగిపోతుందని కాంగ్రెస్ నాయకులు భావించారు. చంద్రబాబు ప్రధానమంత్రికి, హోంమంత్రికి లేఖలు రాశారు. హుటాహుటిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని కలిశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానం ఏర్పాటు చేశారు. చంద్రబాబుతోపాటు టిడిపి నాయకులంతా వరదలపై విమర్శల జోరు పెంచారు. బాబుతో పాటు పార్టీ సీనియర్లు అంతా స్పందించారు. లోకేశ్ సైతం సంఘటనపై స్పందించారు. ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం వరద బాధితుల మృతికి సంతాప సమావేశం కూడా నిర్వహించారు.
మరోవైపు విఐపిలు రావద్దని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హెచ్చరించడం వల్ల వెళ్లలేదని, అక్కడికి వెళ్లి రాజకీయం చేయడం వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం అవుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ ప్రళయాన్ని చూసి ముఖ్యమంత్రికి ఎలా నిద్ర పడుతోందని చంద్రబాబు నిలదీయగా, ప్రతిపక్ష నాయకుడు ఉత్తరాఖండ్ వెళ్లారు కానీ ముఖ్యమంత్రి వెళ్లలేక పోయారని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు.
ఢిల్లీ నుంచి టిడిపి ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన చార్‌ధామ్ బాధితులకు నారా లోకేశ్‌తో పాటు టిడిపి సీనియర్లు స్వాగతం పలికారు. 190 మంది యాత్రికులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకు వచ్చినట్టు పార్టీ నాయకులు తెలిపారు.
ఏ క్షణమైనా ఎన్నికలు
సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇసి సమీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 24: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలు ఏక్షణమైనా జరిగే అవకాశం ఉందని, అందువల్ల జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్లు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి రమాకాంతరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు (ఎస్‌పిలు), పోలీస్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, ఇతర జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల జాబితాలు రాగానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నోటిఫికేషన్ జారీ కాకముందే ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. ప్రశాంత పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల ఎన్నికల తర్వాత మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ అంశాలపైనా కమిషనర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే పోలీసు బందోబస్తు గురించి సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. స్థానిక ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల గుర్తింపు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలను సిద్ధంగా ఉంచాలన్నారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సుల గురించి చర్చించారు. బాక్సులను అవసరమైన మేరకు ఏర్పాటు చేసుకోవాలని, పాత బాక్సులు సరిపోని పక్షంలో కొత్తవాటికి ఆర్డర్ ఇచ్చి తెప్పించాలని సూచించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సబంధించి మూడు నాలుగేసి జిల్లాలకు ఒక ప్రాంతీయ సమావేశాన్ని నెలరోజుల క్రితమే రమాకాంతరెడ్డి ఏర్పాటు చేసి సమీక్షించారు. ప్రాంతీయ సమావేశాల నిర్ణయాలపై తీసుకున్న చర్యల గురించి సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వం ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం మరోమూడు, నాలుగు రోజుల్లోగా రిజర్వేషన్ల జాబితాలు ఎన్నికల కమిషన్‌కు అందుతాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల జాబితా రాక గురించి ఎన్నికల కమిషన్ ఎదురు చూస్తోంది. ఈ జాబితాలు అందిన 24 గంటల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ వ్యవహారాలు చూసేందుకు కమిషనర్‌కు సహాయంగా ఉండేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌ను కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.
పంచాయతీల విలీనం కొనసాగింపు?
రాష్ట్రంలోని 21,590 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే ప్రభుత్వం కొన్ని గ్రామ పంచాయతీల హోదాను పెంచాలని, కొన్ని గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయాలని భావిస్తోంది. గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, హోదాపెంపు, విలీనాలను కొనసాగించేందుకు వీలుగా రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ఒక జీఓ (జీఓ నెంబర్ 298, తేదీ 22-06-2013) జారీ చేసింది. అంటే గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, హోదాపెంపు, విలీనాలకు అవకాశం కల్పించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. ఈ అంశాలేవీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాకపోవడం మూలంగా వీటిపై సమీక్షా సమావేశంలో చర్చించలేదు.
చార్‌ధామ్ బాధితులకు
తక్షణ సాయం రూ.5వేలు
మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ‘ఉత్తరాఖండ్’పై సిఎం సమీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 24: చార్‌ధామ్ ఘటనలో బాధితులకు ఇప్పుడు ఇస్తున్న రెండు రూపాయలకు బదులుగా ఐదు వేలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే బాధితుల ఆర్ధిక సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నారు. ఉత్తరాఖండ్ ఘటనపై ఆయన సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఒక విమానాన్ని పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. ఘటనలో మరణించిన వారి వివరాలు ఖరారైన తరువాత వారి కుటుంబాలకు కూడా నష్ట పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఉత్తరాఖండ్ ఘటన నేపథ్యంలో అక్కడి వెళ్లి వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసిన కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ హైదరాబాద్‌కు తిరిగివచ్చి ముఖ్యమంత్రికి అక్కడి పరిస్థితులు, బాధితులకు అందిస్తున్న సహాయ పునారావాసాలపై వివరించారు. ఆర్మీ, ఇతర అధికారుల సహాయంతో మంచు కొండల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, మన రాష్ట్రానికి చెందిన వారిని ఢిల్లీకి, అక్కడి నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే త్వరగా బాధితులను రాష్ట్రానికి రప్పించేందుకు ఒక విమానాన్ని కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విమానాన్ని డెహ్రాడూన్ నుంచి హైదరాబాద్‌కు బాధితులను తరలించేందుకు ఉపయోగించాలని సూచించారు. ఇతర మార్గాల ద్వారా వచ్చే యాత్రికులకు భోజన, రవాణా, వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని ఆదేశించారు. అదేవిధంగా యాత్రికుల మృతదేహాలను కూడా ప్రభుత్వ ఖర్చుతో రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇలా ఉండగా, వాస్తవంగా రాష్ట్రం నుంచి ఎంతమంది ఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లారు.. వారిలో ఎంతమంది తిరిగి వచ్చారు అన్న అంశాలపై పూర్తి వివరాలను కలెక్టర్ల నుంచి తెప్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉన్న అధికారులకు తోడుగా మరికొంతమందిని పంపించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుంచి వైద్య బృందాలను పంపించామని, వారు అవసరమైన వైద్య సహాయం బాధితులకు అందిస్తున్నారని, మన రాష్ట్రం నుంచి ఇప్పటికే రెండు హెలికాప్టర్లను పంపించామని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగునాట చార్‌ధామ్ ప్రకంపనలు పోటాపోటీ విమానాలు
english title:
u
Date:
Tuesday, June 25, 2013