హైదరాబాద్, జూన్ 24: పది రోజుల పాటు అమెరికాలో విలాసంగా గడిపి ఇప్పుడు ఉత్తరాఖండ్ యాత్రికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం పిసిసి అధ్యక్షుడు బొత్స అధ్వర్యంలో పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వెంటనే తగు ఏర్పాట్లు చేశారని చెప్పారు. రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులను, ఒక కేంద్ర మంత్రిని, వైద్య బృందాలను, హెలికాప్టర్‌ను పంపించారని, ఎప్పటికప్పుడు ఉత్తరాఖండ్ సిఎంతో చర్చిస్తూనే ఉన్నారని వివరించారు. అయితే ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు పది రోజుల పాటు అమెరికాలో గడిపి వచ్చి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎపి భవన్‌లో చేసిన హంగామా, మాట్లాడిన తీరు, అనుచితమైన ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. గతంలో గోకుల్‌ఛాట్‌పై దాడి జరిగినప్పుడు కూడా చంద్రబాబు తన ఇంట్లో విందులో ఉన్నారని ఆయన విమర్శించారు. తమకు మానవత్వం ఉన్నదని, ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపట్టిందని, పార్టీ తరఫున కూడా సహాయక చర్యలు చేపడుతున్నామని, ఈ మేరకు పార్టీ తరఫున సహాయ నిధిని ఏర్పాటు చేసి, ఉత్తరాఖండ్‌కు పంపనున్నామని ఆయన తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల నివారణ కమిటీ సభ్యుడు వైస్-చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఆయన చెప్పారు. తాను కూడా డెహ్రాడూన్ కలెక్టర్‌తో మాట్లాడానని, ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలకు రెండు వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు తమ పార్టీ జిల్లా కమిటీల సమావేశాలు నిర్వహించనున్నట్లు బొత్స తెలిపారు.
నేడు కర్నూలుకు
రెండు కొత్త రైళ్లు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 24: రైల్వే మంత్రిత్వ శాఖ 2013-14 బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రకటించిన కొత్త రైళ్ల కార్యాచరణ మొదలైంది. సికింద్రాబాద్-కర్నూలు సిటీ-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, కర్నూలు సిటీ-నంద్యాల-కర్నూలుసిటీ డెమొ ప్యాసింజర్ రైళ్లు మంగళవారం ప్రారంభమవుతున్నాయి. రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి చేతుల మీదుగా ఈ రైళ్లను కర్నూలు సిటీ స్టేషన్‌లో ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం నాడిక్కడ ప్రకటించింది. ప్రతి రోజు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నెం.17223 సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి కాచిగూడ, ఫలక్‌నుమా, ఉమ్ధానగర్, తిమ్మాపూర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, శ్రీరామ్‌నగర్, గద్వాల్ మీదుగా వెళ్లి అదే రోజు రాత్రి 9.35 గంటలకు కర్నూల్‌సిటీ స్టేషన్‌కు చేరుకుంటుందని ద.మ.రైల్వే వెల్లడించింది. తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీ నుంచి ప్రతి రోజు ఉదయం 6.05 గంటలకు నెం.17224 ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరి ఉదయం 10.45 గంటలకు అదే రూట్లో సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి కర్నూలు సిటీ స్టేషన్ వరకు ఉన్న 244 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 40 నిమిషాల్లో చేరుకుంటుందని, చాలాకాలంగా కర్నూలు నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి ఉదయం వేళ నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు కావాలనే డిమాండ్ ఉంది. అనేక విజ్ఞప్తుల అనంతరం రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల చొరవతో ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందని రైల్వే వెల్లడించింది. డెమొ ప్యాసింజర్ రైలు నె.77696 కర్నూలు సిటీ నుంచి ఆది, సోమ, గురు, శుక్ర, శనివారాల్లో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి వెల్దుర్తి, ధోన్, బేతమ్‌చర్ల మీదుగా అదే రోజు రాత్రి 10.10 గంటలకు నంద్యాల చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంద్యాల నుంచి కర్నూలు సిటీకి ఆది, సోమ, గురు, శుక్ర, శనివారాల్లో నెం.77695 డెము రైలు ఉదయం 6.05 గంటలకు బయలుదేరి కర్నూలు సిటీకి అదే రోజు ఉదయం 10.20 గంటలకు చేరుకుంటుందని రైల్వే వెల్లడించింది. ఇప్పటివరకు కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్‌గా ఉన్న పేరును కర్నూలు సిటీగా మారుస్తున్నట్లు కూడా తెలిపింది. మంగళవారం నుంచి ఈ మార్పు వర్తిస్తుందని తెలిపింది.
నేడు ఇంటర్
ఫస్టియర్ ఫలితాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 24: ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు మాధ్యమిక విద్యా మంత్రి పార్ధసారధి విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి రామ శంకర్ నాయక్ తెలిపారు. ఫలితాలను ఇంటర్‌నెట్‌లోనూ, ఐవిఆర్‌ఎస్ ద్వారా, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అభ్యర్ధులకు తెలియజేస్తామని అన్నారు. నెట్ ద్వారా ఎగ్జామ్ రిజల్ట్సు డాట్ ఎసి డాట్ ఎన్‌ఐసి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌తో పాటు రిజల్ట్సు డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్, ఎపిఐటి డాట్ ఎపి డాట్ జిఓవి డాట్ ఇన్, ఇండియారిజల్ట్సు డాట్ కామ్ తదితర వెబ్‌సైట్లలో ఉంచుతున్నట్టు చెప్పారు. అలాగే పరిష్కిరం కాల్ సెంటర్లకు వెళ్లి లేదా 1100 నెంబర్‌కు, 18004251110 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని, ఐవిఆర్‌ఎస్ ద్వారా 1255225కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని ఆయన చెప్పారు.
10 రోజులు అమెరికాలో గడిపి ఇప్పుడు విమర్శలా.. చంద్రబాబుపై మండిపడ్డ బొత్స
english title:
r
Date:
Tuesday, June 25, 2013