హైదరాబాద్, జూన్ 24: దేశ రాజకీయాల్లో విఫలమైన యుపిఎ, ఎన్‌డిఎ కూటమిలకు ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలు జూలై 1న ఢిల్లీలో సదస్సును నిర్వహిస్తున్నట్టు సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో రెండు రోజుల పాటు నిర్వహించే సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలను సోమవారం ప్రారంభించారు. ఈ సమావేశాల్లో అంతర్జాతీయ, జాతీయ పరిణామాలను సుధాకర్‌రెడ్డి వివరించగా, రాష్ట్ర రాజకీయాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ చెప్పారు.
సుధాకర్‌రెడ్డి ప్రసంగిస్తూ పాలనాపరంగా అన్ని రంగాల్లో విఫలమై, అవినీతి కంపుకొడుతున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ, మతోన్మాద కార్డుతో అధికారంలోకి రావాలనుకుంటున్న బిజెపి నేతృత్వంలోని ఎన్‌ఎడిలకు వ్యతిరేకంగా విధాన ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా జెడియు, బిజెడి, ఎస్‌పి తదితర పార్టీలతో వామపక్షనాయకులు సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు. ఈ పూర్వరంగంలో భాగంగానే ఢిల్లీలోని వౌలాంకర్ ఆడిటోరియంలో సిపిఏఐ, సిపిఎం, ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డుబ్లాక్‌ల సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. యుపిఎ, అంతకు ముందు ఎన్‌డిఎ అవలంభించిన ప్రజావ్యతిరేక ఆర్ధిక విధానాలను ఎండగట్టి ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలను ప్రజల ముందుంచనున్నట్టు తెలిపారు.
యుపిఎ నుండి గత ఎడాది కాలంలో 48 మంది ఎంపిలున్న తృణముల్, డిఎంకెలు వెలుపలికి వచ్చాయని, వాజపేయి నేతృత్వంలోని యుపిఎ కూటమిలో 24 పార్టీలు ఉండగా, ఇపుడు కేవలం 3 పార్టీలే మిగిలాయని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలను కూడగట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ఆ ఫ్రంట్‌కు విధానాల విషయంలో స్పష్టత లేదని చెప్పారు. ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలు లేకుండా ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ ప్రమాదకరమైనదని హెచ్చరించారు. గుజరాత్ ముఖ్యమంత్రి 3డి నేతగా వెంకయ్యనాయుడు పోల్చడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. 3డి అంటే భ్రమకల్పించేదని, అలాగే మోడీ కూడా భ్రమలు కల్పిస్తున్నారని అన్నారు.
రిలయన్స్ సంస్థ ఉత్పత్తి చేస్తూన్న గ్యాస్ ధరను మూడు రెట్లు పెంచేందుకు, గతంలో ఆ సంస్థకు విధించిన వంద కోట్ల రూపాయిల జరిమానా రద్దుకు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ ఆధ్వర్యంలో కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇప్పటికే బ్రిటిష్ మెట్రిక్ యూనిట్‌కు 2.4 డాలర్లు నుండి 4.2 డాలర్లకు పెంచారని చెప్పారు. మరోసారి ధర పెంచితే ప్రజలపై వేల కోట్ల భారం పడుతుందని అన్నారు. అందుకే ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సిపిఐ ఆందోళనను కొనసాగిస్తుందని అన్నారు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలను తీసుకురావల్సిన అవసరం లేదని అన్నారు.
‘స్థానికం’గా పట్టు సాధిస్తాం
రాజకీయ శక్తిగా తెరాస జిల్లా అధ్యక్షులు, ఇంచార్జీల భేటీలో కడియం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఉద్యమ పార్టీగానే కాకుండా రాజకీయంగా కూడా బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని ఆ పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలనాటికి పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇంచార్జీలతో సోమవారం కడియం శ్రీహరి, పార్టీ అధినేత కెసిఆర్ భేటీ అయి పార్టీ నిర్మాణంపై చర్చించారు. సమావేశం అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 26 నుంచి 30 వరకు మండల స్థాయిలో విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. 30న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని భావిస్తున్నామనీ, ఆ దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై దృష్టి సారించినట్టు కడియం తెలిపారు. మండల స్థాయి విస్తృతస్థాయి సమావేశాలు ముగిసిన తర్వాత నియోజక వర్గాల స్థాయిలో కమిటీల ఏర్పాటుపై దృష్టి సారిస్తామన్నారు. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జీలతో జూలై 3న మరోమారు సమావేశమై పార్టీ నిర్మాణంపై తగిన సూచనలు, సలహాలు ఇస్తామని ఆయన తెలిపారు. ఉద్యమపరంగానే కాకుండా పార్టీని రాజకీయంగా బలోపేతం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంపై పార్టీ శ్రేణులను, నేతలను సమాయత్తం చేస్తున్నామని ఆయన తెలిపారు. అందులో భాగంగానే పార్టీ నిర్మాణంపై దృష్టి సారించినట్టు కడియం వివరించారు. పార్టీ నిర్మాణం పర్యవేక్షణకు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను రెండేసి జిల్లాలుగా విభజించి కమిటీలను వేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం కాకుండా ప్యాకేజి ఇస్తామని తమకు ఎవరు చెప్పలేదని టిఆర్‌ఎస్ జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్ కె కేశవరావు తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణకు ప్యాకేజి ఇస్తారనే ప్రచారం మాత్రమేనని తెలిపారు. తెలంగాణ ప్రజలు కోరుకునేది ప్రత్యేక రాష్ట్రానే్న తప్ప, ప్యాకేజిని కాదని ఆయన స్పష్టం చేసారు. ప్రజా జీవితంలోకి వచ్చాక ఏదంటే అది మాట్లాడటం తగదని, తనపై విమర్శలు చేసేవారు బలిపశువులు ఎవరయ్యారో మున్ముందు వారే గ్రహిస్తారనీ ఆయన పరోక్షంగా కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్‌కు ద్రోహం చేయడమే కాకుండా ఇద్దరు దళిత ఎంపీలను కేశవరావు బలిపశువులను చేసారని కేంద్ర మంత్రి సర్వే చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. తప్పుడు రాతలు, ప్రసారంతో సమాజాన్ని మీడియా తప్పుదోవ పట్టించవద్దనీ, సంచలనాల కోసం మీడియా విలువలను మరిచిపోవద్దని ఆయన హితవు పలికారు.
టిఆర్‌ఎస్‌లో చేరిన మక్తల్ కాంగ్రెస్ నేతలు
మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ భవన్‌లో కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ జెడిపిటిసి అధ్యక్షుడు లింగమ్మ, మాజీ ఎంపిపిలు మల్లన్నగౌడ్, నాగన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు రవికుమార్ టిఆర్‌ఎస్‌లో చేరినట్టు మక్తల్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ దేవర మల్లప్ప ప్రకటించారు.
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి
english title:
p
Date:
Tuesday, June 25, 2013