ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 23: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేందుకు విశాఖ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చేసిన ప్రయత్నం ఉద్రిక్తంగా మారింది. నిర్వహణ లోపం వలన చిన్నారులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. లక్షా 20 వేల మందితో ఐదు కిలోమీటర్లు ఒలింపిక్ డే రన్ నిర్వహించాలన్న లక్ష్యంతో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రయత్నించింది. ఈ కార్యక్రమానికి క్రీడాకారులకు పెద్దగా స్థానం కల్పించకపోగా, స్కూల్ పిల్లలతో ప్రయోగం చేసింది. ఇది కాస్తా బెడిసికొట్టింది. రన్ ప్రారంభమయ్యే చోటకు వేల సంఖ్యలో జనం వచ్చారు. అక్కడ ఏర్పడిన పరిస్థితులను తట్టుకోలేక సగంమంది వెనుదిరిగారు. వివిధ స్కూళ్ళ నుంచి వచ్చిన విద్యార్థులు తప్పిపోయారు. చివరకు 5కె పరుగులో గమ్యస్థానం చేరుకున్నది చాలా తక్కువమందే.
1989లో వాషింగ్టన్ డిసిలో సుమారు 85,956 మందితో రన్ నిర్వహించి గిన్నీస్ రికార్డు సృష్టించారు. ఆ రికార్డును బద్దలు కొట్టడానికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ విశాఖలో ఆదివారం 5కె రన్ నిర్వహించింది. ఈ రన్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం 9.30 గంటలకు ఈ రన్ ప్రారంభమైంది. ఈ రన్‌లో పాల్గొన్న వారికి ప్రత్యేక టిక్కెట్‌లు అసోసియేషన్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఒక్కో టిక్కెట్ 10 రూపాయల చొప్పున విక్రయించింది. లక్షన్నరకు పైగా టిక్కెట్‌లు విక్రయించినట్టు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ రన్‌పై స్కూళ్ళలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. దీంతో వివిధ స్కూళ్ళ నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు రన్ ప్రారంభమయ్యే ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. వీరందరికీ మంచినీరు అందచేస్తామని అసోసియేషన్ ముందుగానే ప్రకటించింది. కానీ ఉదయం 8 గంటల తర్వాత కూడా వీరికి మంచినీరు లభించలేదు. వేల సంఖ్యలో వచ్చిన చిన్నారుల మధ్య తొక్కిసలాట జరిగింది. చాలా మంది నీరసించిపోయారు. మరికొంతమంది రన్ ప్రారంభం కాకమునుపే వెనుదిరిగారు. మరికొంతమంది బయటకు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోవలసి వచ్చింది. వీరికి ఏమైనా ప్రమాదం సంభవిస్తే, ఆదుకునేందుకు తగిన అంబులెన్స్‌లు కూడా లేకపోవడం గమనార్హం. గ్రౌండ్స్ వద్దకు వచ్చే అంబులెన్స్‌లకు పర్మిషన్ లేదంటూ పోలీసులు వాటిని వెనక్కు పంపేశారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వచ్చే ముందు సినీ హీరో రామ్‌చరణ్ తేజ వచ్చాడంటూ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో పిల్లలు కేరింతలు కొడుతూ ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఒక దశలో పిల్లలు ఏమవుతారోనన్న భయం కలిగింది. రామ్‌చరణ్ వచ్చిన తరువాత ఈ పరిస్థితి మరింత భయానకంగా మారింది. మరి కాసేపటికి ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్నారు. ఆయన రెండు నిముషాలు మాట్లాడి జెండా ఊపి రన్ ప్రారంభించి వెళ్ళిపోయారు. ఇక వేలాది మంది చిన్న ద్వారం నుంచి బయటకు వెళ్ళేందుకు నిర్వహకులు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. చిన్నారుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. అప్పటికే సుమారు 20 మంది పిల్లలు తప్పిపోయారు. వారి కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అల్లాడారు. అప్పటికీ పిల్లలకు మంచినీరు అందలేదు. దీంతో గ్రౌండ్‌లో ఉన్న సగం మంది వెనుదిరిగిపోయారు. 5కె రన్ చివరి వరకూ పాల్గొన్నది కేలం కొద్ది మంది మాత్రమే.
హెలికాప్టర్‌లో చిత్రీకరణ
ఈ రన్‌ను భారత నౌకాదళం హెలికాప్టర్ ద్వారా చిత్రీకరించింది. సుమారు నాలుగు గంటల పాటు హెలికాప్టర్ ద్వారా చిత్రీకరణ సాగింది. రన్ ప్రారంభం నుంచి చివరి వరకూ ఎంతమంది ప్రయాణిస్తే అంతమందినే లెక్కిస్తారని ఒలింపిక్ అసోసియేషన్ తెలియచేసింది. ఆ విధంగా అయితే చివరి వరకూ వెళ్ళింది లక్షమంది ఉండరన్నది కచ్చితంగా చెప్పచ్చు. మరి రికార్డు ఏవిధంగా సాధిస్తారో వేచి చూడల్సిందే.
తొక్కిసలాటను అదుపు చేస్తున్న పోలీసులు, సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో వెలవెలబోయిన ఫినిషింగ్ పాయింట్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది : కేంద్ర మంత్రి సర్వే
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూన్ 23: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం నేటికీ కట్టుబడి ఉందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. గుంటూరు వెళ్లేముందు తనను కలిసిన విలేఖరులతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. తెలంగాణ విషయమై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా వెనుకబడిన గ్రామాలు ఉన్నాయని దీనికి పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమన్నారు. నగర ప్రజలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికల్లోపు దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్‌ను నిర్మించి తీరుతామన్నారు.
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేందుకు
english title:
o
Date:
Monday, June 24, 2013