Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘తృటిలో బయటపడ్డాం.. చచ్చి బతికాం’

$
0
0
రాజమండ్రి, జూన్ 23: ‘మా పరిస్థితి చచ్చి బతికినట్లు ఉందని’ చార్‌ధామ్‌యాత్ర నుంచి తిరిగి వచ్చిన యాత్రికులు వ్యాఖ్యానించారు. చార్‌ధామ్‌యాత్రకు వెళ్లి ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న యాత్రికులు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలోని తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తమవారికి స్వాగతం పలకడానికి యాత్రికుల బంధువులు పెద్ద సంఖ్యలో రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో స్టేషన్‌లో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు తమవారి చెంతకు చేరిన యాత్రికుల కళ్లల్లో ఒకలాంటి మెరుపుకనిపించింది. వారి కళ్లల్లో చార్‌ధామ్‌యాత్ర తాలూకు అనుభవాలు, భయాందోళనలు స్పష్టంగా కనిపించాయి. అయితే ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న జిల్లా యాత్రికులు ఒక విధంగా అదృష్టవంతులనే చెప్పాలి. వీరి వెనుక బయలుదేరిన వేలాది మంది ఇప్పటికీ వరదల్లో చిక్కుకుపోవడం గమనార్హం. నాలుగు రోజుల పాటు నరకయాతన అనుభవించామని యాత్రికులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తూ, కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలు చూశామన్నారు. దీంతో నాలుగు రోజుల పాటు బస్సు దిగే అవకాశం కూడా లేకపోయిందన్నారు. కనీసం తినేందుకు తిండి, తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకలేదన్నారు. కొన్నిసార్లు వర్షపునీటితోనే దాహం తీర్చుకోవాల్సి వచ్చిందన్నారు. తమ పక్కనే ఉన్న వంతెనలు కొట్టుకుపోయాయని, తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నామని పలువురు యాత్రికులు చెప్పారు. తమ వెనుక వచ్చిన యాత్రికుల్లో చాలామంది గల్లంతయ్యారన్నారు. ఉత్తరాఖండ్‌లో తమ గోడును పట్టించుకునే నాధుడు కనిపించలేదన్నారు. ఏలూరు చేరుకున్న 50 మంది ఏలూరు: చార్‌ధామ్ పెను ఉత్పాతం నుండి బయటపడిన 50 మంది యాత్రికులు ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా నరకయాతన అనుభవించిన చార్‌ధామ్ యాత్రీకుల కళ్లల్లో ఒకింత అనందం కన్పడింది. దేవుని దయవల్ల అతి పెద్ద ఉపద్రవాన్ని తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డామని, ఇది తమకు పునర్జన్మ వంటిదని యాత్రికులు పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీన తామంతా ఉత్తరకాశీ యాత్రకు బయలుదేరామని, 15వ తేదీన ఉత్తరకాశీకి వెళ్లేందుకు సిద్దమవుతుండగా చిన్నగా వర్షం ప్రారంభమైందన్నారు. ఇక అక్కడ నుండి ప్రయాణం కుదరదని చెప్పటంతో అక్కడే బస్టాండ్‌లో దాదాపు 40మంది వరకు ఉండిపోయామన్నారు. ఇక అక్కడ నుంచి నరకం ప్రారంభమైందని, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు తీసుకోకపోవటం వల్ల యాత్రికులంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కళ్లముందే ఎంతోమంది తెలుగువారు కొట్టుకుపోతున్నా ఏమి చేయలేని పరిస్దితిలో చూడాల్సి వచ్చిందన్నారు. అయితే ఢిల్లీలో కేంద్ర మంత్రులు చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి తమకు ఎంతో ధైర్యం చెప్పటంతోపాటు భోజనం, అల్పాహారం ఏర్పాట్లు చేశారన్నారు. చార్‌ధామ్ యాత్రికులను రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో పరామర్శిస్తున్న సినీ నటుడు, టిడిపి నేత మురళీమోహన్ ‘నరకాన్ని అనుభవించాం’ వినుకొండ, జూన్ 23: గుంటూరు జిల్లా వినుకొండ నుండి ఈ నెల మూడున చార్‌ధామ్ యాత్రకు వెళ్ళిన పట్టణానికి చెందిన పది మంది బాధితులు ఆదివారం మధ్యాహ్నం క్షేమంగా వినుకొండ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. చార్‌ధామ్ నుండి వినుకొండకు రైలులో తిరిగి వచ్చిన భక్తుల సమాచారం అందుకున్న బంధువులు, మిత్రులు రైల్వేస్టేషన్‌లో వారికి ఘనస్వాగతం పలికారు. తమ బంధువులను చూడగానే వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు విలేఖరులతో మాట్లాడుతూ, తాము వారం రోజులపాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించామన్నారు. చూస్తుండగానే కొండచరియలు విరిగిపడి రోడ్లు ధ్వంసమయ్యాయని, నాలుగు రోజులపాటు బస్సులోనే ఉండి అన్నపానీయాలు లేక అలమటించామన్నారు. క్షేమంగా తిరిగివచ్చిన వారిలో గోనుగుంట్ల రాఘవమ్మ, పర్చూరి హేమమాలిని, పర్చూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కందకట్ల పుల్లారావు ఉన్నారు. బాధితులను ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, వైఎస్సార్ సిపి కన్వీనర్ డాక్టర్ సుధ తదితరులు పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ‘ప్రాణాలతో వస్తామనుకోలేదు’ ఆంధ్రభూమి బ్యూరో విశాఖపట్నం, జూన్ 23: ప్రాణాలతో తిరిగొస్తామనుకోలేదు. కనీసం మావార్ని చూస్తామనిగానీ, కలుసుకుంటామని గానీ అనుకోలేదు. భగవంతుని అనుగ్రహం వల్లే తామీరోజు మీముందుకు వచ్చాం. లేదంటే అంతటి విధ్వంసం నుంచి తాము క్షేమంగా ఇళ్ళకు తిరిగిరావడాన్ని తలచుకుంటేనే భయం వేస్తోందంటూ కేదార్‌నాథ్ యాత్రీకులు కన్నీళ్ళపర్యంతమయ్యారు. విశాఖపట్నం నుంచి 18 మంది సభ్యుల బృందం రామకృష్ణ అనే అర్గనైజర్ నేతృత్వంలో బయలుదేరారు. ప్రకృతి కనె్నర్ర చేయడంతో కేదార్‌నాథ్ యాత్రను మధ్యలోనే ముగించుకుని ప్రత్యేక రైల్లో ఆదివారం విశాఖపట్నం చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌లో ఎదురు చూస్తున్న బంధువులను కలుసుకున్న యాత్రికుల్లో ఒక్కసారి దుఃఖం కట్టలు తెంచుకుంది. నిజంగా భగవంతుడు తమను కాపాడాడని పేర్కొన్నారు. ఈనెల నాలుగో తేదీన విశాఖపట్నం నుంచి రైలులో బయలుదేరిన వీరంతా ఆరోతేదీన హరిద్వార్ చేరుకుని బోళానంద ఆశ్రమంలో బస చేశారు. ఏడోతేదీన ఉదయం బయలుదేరి రుషికేష్ తదితర పుణ్యక్షేత్రాలు సందర్శించారు. 14న గంగోత్రి యాత్రను పూర్తి చేసుకున్నారు. అక్కడ్నుంచి బయలుదేరి యమునోత్రికి చేరుకోవాలి. అంతే చిన్నగా మొదలైన వర్షం తీవ్రరూపం దాల్చింది. మూడు రోజుల పాటు అక్కడే బస్సుల్లోనే ఉండి సైన్యం సాయంతో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ్నుంచి ప్రత్యేక రైల్లో విశాఖ చేరుకున్నారు. ఆర్గనైజర్ రామకృష్ణ మొత్తం 110 మంది వరకూ యాత్రికులను వెంట తీసుకెళ్ళాడని, మధ్యలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్న తమను కాపాడే క్రమంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడని తెలిపారు. విశాఖ చేరుకున్న యాత్రికులు
నాలుగు రోజులు నరకయాతన.. వాననీరే దిక్కు : చార్‌ధామ్ బాధితుల ఆవేదన
english title: 
t

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>