కర్నూలు, జూన్ 25: సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య సెప్టెంబర్ నాటికి డబుల్ డెక్కర్ రైలు ప్రవేశపెడతామని రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. కర్నూలు రైల్వేస్టేషనులో మంగళవారం కర్నూలు-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ, కర్నూలు-నంద్యాల డెమో ప్యాసింజర్ రైళ్లను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ గతంలో రైల్వేపరంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చుకునేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నామన్నారు. రైల్వేబడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్దపీట వేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన రైళ్లు ఒక్కొక్కటీ పట్టాలెక్కుతున్నాయన్నారు. అవిగాక సికింద్రాబాద్ నుంచి బెంగుళూరుకు, బెంగుళూరు నుంచి సికింద్రాబాద్‌కు డబుల్ డెక్కర్ రైళ్లు, సికింద్రాబాద్ నుంచి విజయవాడ, సికింద్రాబాద్ నుంచి తిరుపతి మార్గాల్లో సెప్టెంబర్ నాటికి కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ రైళ్లన్నీ కర్నూలు మీదుగా వెళ్తాయన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాదు డివిజన్ పనితీరు బాగా ఉందని పేర్కొన్న మంత్రి కోట్ల డివిజన్‌కు ప్రోత్సాహకంగా రూ.రెండు లక్షల నగదు బహుమతి ప్రకటించారు. కర్నూలు నుంచి సికింద్రాబాద్‌కు కొత్తగా ఇంటర్‌సిటీ రైలు, కర్నూలు నుంచి నంద్యాలకు ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించడం ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తక్కువ ఖర్చుతో హైదరాబాద్, నంద్యాలకు వెళ్లే సౌకర్యం కలిగిందన్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన రైల్వేబోగీల మరమ్మతు కర్మాగారానికి సెప్టెంబర్ నెలలో యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ శంఖుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. మూడేళ్లలో పనులు పూర్తిచేసి కర్మాగారాన్ని ప్రారంభిస్తామన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా ఐదు వేల మందికి, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వారే ప్రజా నాయకులన్న విషయం గుర్తుంచుకుని పనిచేస్తూ ప్రజల ఆశీర్వాదం కోరుతామని అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ఆ మేరకు అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైల్వే స్టేషనుకు వచ్చిన ప్రయాణికుడు అసంతృప్తి చెందకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ వెంకటేష్, ఎంపి ఎస్పీవైరెడ్డి, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) ఇంటర్‌సిటీ రైలుకు కర్నూలు సిటీ రైల్వేస్టేషన్‌లో పచ్చజెండా ఊపుతున్న మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య సెప్టెంబర్ నాటికి
english title:
double decker train
Date:
Wednesday, June 26, 2013