తోట్లవల్లూరు, జూన్ 25: జీవితంలో ఇంతటి ఉపద్రవాన్ని మరోసారి చూడబోమని, కలసివెళ్ళిన వాళ్ళం చెల్లాచెదురవటం, చేయి పట్టుకొని వున్న మనిషి జారిపోవటం, కళ్ళముందే వందలాది మంది గడ్డిపోచల్లా వరద నీటిలో కొట్టుకుపోవటం, వందలాది గుర్రాలు, కార్లు వరదలో తేలియాడుతూ కొట్టుకుపోవటం, పెద్దపెద్ద భవంతులు, ఆలయాలు కూలిపోవటం ఇలా ఉత్తరాఖండ్ వరదల్లో తమ కళ్లముందు సాక్షాత్కరించిన భయానక దృశ్యాలని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని దేవరపల్లి వాసులు వివరించారు. ఢిల్లీలో చంద్రబాబు ఏర్పాటు చేసిన విమానంలో సోమవారం సాయంత్రం బయలుదేరిన మరీదు కృష్ణవేణి (దేవరపల్లి), మర్రెడ్డి వనజ, మర్రెడ్డి విజయలక్ష్మి, జొన్నల శ్రీదేవి (చాగంటిపాడు), భీమవరపు మురహరరెడ్డి, భీమవరపు రాణి (ఇబ్రహీంపట్నం), బొమ్మారెడ్డి సామ్రాజ్యం (విజయవాడ), కొల్లి సీతారావమ్మ (హైదరబాద్) రాత్రికి హైదరాబాద్ వచ్చి ఉదయం 9 గంటలకు స్వస్థలాలకు చేరుకున్నారు. మొత్తం ఎనిమిది మంది వారి సొంతిళ్ళకు చేరటంతో బంధువులు ఆనందంలో మునిగిపోయారు. దేవరపల్లి, చాగంటిపాడు వెళ్ళిన విలేఖరులకు కృష్ణవేణి, విజయలక్ష్మి తమకు ఎదురైన అనుభవాలను ఏకరువు పెట్టారు. 16న కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన సమయంలోనే వర్షాలు వస్తున్నాయని, ఓ పోలీసు వచ్చి వరదలు వస్తున్నాయి, దూరంగా వెళ్ళిపొమ్మని ఆదేశించాడని చెప్పారు. దీంతో తమ 19మంది బృందం వడివడిగా కొండ ఎగువకు వెళుతుండగానే కేదార్‌నాథ్ ఆలయానికి వరద వచ్చి తాము చూస్తుండగానే భక్తులు కొట్టుకుపోయారని విజయలక్ష్మి తెలిపారు.
తాము కొండపైకి ఎక్కుతుండగా వరద ఎదురవటంతో గౌరీ టెంపుల్‌లోకి వెళ్ళామని, అక్కడ అందరం ఉండగానే వరదలు రావటంతో ఇసుప మెష్‌ను కొందరం పట్టుకున్నామని, మెష్‌ను పట్టుకోలేనివారు వరద నీటిలో కొట్టుకుపోయారని చెప్పారు. తమకు నడుంలోతు ఒండ్రుమట్టి పేరుకుపోయిందని, ఓ వ్యక్తి సాయంతో గౌరీ టెంపుల్ నుంచి బయటకు వచ్చామని, తమ బృందంలోని 19 మందిలో ఏడుగురు ఇనుప మెష్‌ను పట్టుకోలేకపోవటంతో తమ కళ్లెదుటే కొట్టుకుపోయారని తెలిపింది. అక్కడ నుంచి కొండ ఎక్కుతుండగానే వరద ఉద్ధృతి పెరగటంతో గౌరీ టెంపుల్ పూర్తిగా కొట్టుకుపోయిందని కృష్ణవేణి, విజయలక్ష్మి వివరించారు. అక్కడ నుంచి 11 వేల అడుగుల ఎత్తులో కొండపైకి వెళ్ళగా అన్నపూర్ణ లాడ్జి కనిపించిందని, దాని యజమాని తమను చేరదీసి నాలుగు రోజులు భోజనం పెట్టాడని, అక్కడ భోజనం చేస్తూనే హెలిపాడ్‌ల వద్దకు వస్తుంటే తెలుగువారిని ఎక్కించుకోలేదని, మళ్ళీ అన్నపూర్ణ లాడ్జికి వెళ్ళి తలదాచుకుని నాలుగు రోజులైనా హెలికాప్టర్ ఎక్కలేకపోవటంతో కొండపై నుంచి 15 కిలోమీటర్లు కిందకి దిగామన్నారు. అప్పటికే గుజరాత్, కర్నాటక, మద్రాస్ పోలీసులు బస్సుల వద్ద ఉండి వారి రాష్ట్రాల ప్రజలను బస్సుల్లోకి ఎక్కిస్తున్నారని, తాము తెలుగువారం కావటంతో పట్టించుకోలేదన్నారు.
ఈ నడకలోనే ఆరేపల్లి సరస్వతి, భీమవరపు నాగరత్నం చనిపోయారని చెప్పారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రజల కోసం సొంత పోలీసులను పంపగా మన రాష్ట్రం నుంచి మాత్రం ఎవ్వరూ రాలేదని వాపోయారు. కిందికి నడుస్తూ వస్తుండగా బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి కారులో ఎక్కించుకుని ఓ హోటల్లో భోజనం పెట్టించారని, అక్కడ ఓ తెలుగు వ్యక్తి పరిచయమై తలా 2 వేల రూపాయలు ఇచ్చారని అన్నారు. ఆ డబ్బులతో ఓ కారును రూ.10వేల కిరాయికి మాట్లాడుకుని రుషికేష్ చేరామని వివరించారు. అక్కడ ఓ తెలుగు టివి చానల్ వారు తమతో మాట్లాడి తరువాత వదిలి వెళ్ళిపోయారని చెప్పారు. దేవరపల్లి నుంచి రుషికేష్ వెళ్ళిన కొల్లి సాంబిరెడ్డి తమను ఓ ఆశ్రమానికి, తరువాత ఢిల్లీకి చేర్చాడని చెప్పారు. ఢిల్లీ ఎపి భవన్‌లో ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. కొందరు మంత్రులు వచ్చి పలకరించి వెళ్ళటంతప్ప ఒరిగిందేమీ లేదన్నారు.
బాబు సాయంతోనే ఇంటికి చేరాం
కేదారనాథ్ యాత్రకు వెళ్లి వరద భీభత్సంలో చిక్కుకుని దుర్భర పరిస్థితిలో ఉన్న తాము టిడిపి అధినేత చంద్రబాబు ప్రత్యేక చొరవ వల్ల క్షేమంగా ఇంటికి చేరామని గుంటూరు జిల్లా అమరావతికి చెందిన సబ్బిశెట్టి పుల్లారావు, భార్య భారతి చెప్పారు. 26వ తేదీన చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన తాము కేదారనాథ్ పర్వత శ్రేణి నుండి శనివారం ఉదయం 10 గంటలకు కిందకు వచ్చి అద్దె గదుల్లో ఉన్నామని సాయంత్రం 7 గంటల తర్వాత సంభవించిన భారీ వర్షం, ఉప్పెనలాగా వర్షపునీరు రావడంతో తాము ఉన్న భవనంలోనే రెండు అడుగుల ఎత్తున బురదలో కూరుకుపోయామని, ఆ సమయంలో భవనం అటూ ఇటూ ఊగడంతో భయబ్రాంతులకు గురై పక్కనే ఉన్న దిబ్బపైకి చేరుకున్నామని తెలిపారు. తాము ఒడ్డుకు చేరిన గంటలోపే తాము బస చేసిన భవనం కుప్పకూలి నీళ్లలో కొట్టుకుపోయిందన్నారు.
సురక్షితంగా స్వస్థలానికి..
విజయనగరం: ఉత్తర భారతదేశ యాత్రలకు జిల్లా నుంచి 150 మంది వరకు వెళ్లినట్టు సమాచారం. వారిలో మంగళవారం నాటికి 30 మంది యాత్రికులు జిల్లాకు చేరుకున్నారు. కొత్తవలస, విజయనగరం తదితర ప్రాంతాలకు చెందిన వారు ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ గంగోత్రి యాత్ర నరకయాతనని పేర్కొన్నారు. తాము ఒక గంట ముందు బయల్దేరకపోతే తాము బయటపడే మార్గం ఉండేది కాదని బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి ఆర్‌కెఎఎన్ రాజు, బిజె ప్రసాదరావులు తెలిపారు. తమ బంధువు డెహ్రడూన్ కలెక్టర్‌గా పనిచేయడం వల్ల ముందస్తుగా సమాచారం తెలుసుకోగలిగామన్నారు. తాము మాతలి నుంచి శ్రీనగర్ మీదుగా కేదార్‌నాథ్ వెళ్లడానికి బయల్దేరామన్నారు. ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లేసరికి రోడ్డు మూసుకు పోవటంతో ముందుకు ప్రయాణించడానికి అవకాశం లేక వెనుదిరిగామన్నారు. తాము మూడు రోజులపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. తాము తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గం గుండా ప్రయాణించామని అక్కడ పరిస్థితులు చెప్పడానికి అలవికాని విధంగా ఉన్నాయన్నారు. దరసు దగ్గర రోడ్డు కోత పడటంతో కొండను తొలిచి రోడ్డును కలిపారని వారు పేర్కొన్నారు. తాము చూస్తుండగానే కొండలు మట్టి ముద్దల్లా కొట్టుకుపోయాయన్నారు. తాము బస చేయడానికి రిజర్వు చేసుకున్న లాడ్జి కూడా వరదల్లో కొట్టుకుపోయిందని వారు కన్నీటిపర్యంతమయ్యారు. తాము దేవుని దయవల్ల తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోగలిగామని వారు తెలిపారు.
గుట్టలుగా శవాలు
ఉరవకొండ: దేవుడి దయవల్ల పునర్జన్మ లభించిందని అనంతపురం జిల్లా ఉరవకొండకు చేరుకున్న ఉత్తరాఖండ్ వరద బాధితులు పేర్కొన్నారు. ఉరవకొండకు చెందిన చెన్న బసమ్మ, కురుబ రాజు, వడ్డే పరశురాం మంగళవారం ఇంటికి చేరుకున్నారు. 16న కేదార్‌నాథ్ నుండి గౌరీఖండ్‌కు వెళ్తుండగా భారీ వర్షాలు కురియడంతో తిండితిప్పలు లేక రెండు రోజుల పాటు 21 కిలోమీటర్లు నడికి ఉత్తరకాశీకి చేరుకున్నామన్నారు. గుట్టలుగా పడిఉన్న శవాల మధ్య నరకాన్ని చూశామన్నారు. అష్టకష్టాలు పడి ఢిల్లీ ఎపి భవన్ చేరుకున్నామ.న్నారు.
నంద్యాల సైనికాధికారి సాయం
ఎమ్మిగనూరు: నంద్యాలకు చెందిన సైనికాధికారి రాము సాయంతో తామంతా క్షేమంగా ఇంటికి చేరుకోగలిగామని ఎమ్మిగనూరుకు చెందిన ఉత్తరాఖండ్ బాధితులు తెలిపారు. ఎమ్మిగనూరు సోమప్పనగర్ వాసులు పూజారి లక్ష్మన్న, సావిత్రమ్మ, రాములమ్మ విలేఖరులతో మాట్లాడుతూ బద్రీనాథ్‌లో ఆంధ్రులు కట్టించిన ఆశ్రమంలో తమతోపాటు, మరో 120 మంది తలదాచుకున్నారన్నారు. నంద్యాలకు చెందిన ఆర్మీ అధికారి తమను తమను హెలికాప్టర్‌లో ఎక్కించడంతో ఢిల్లీ చేరుకున్నామన్నారు.
=====================
మాకిది పునర్జన్మ
విజయవాడ: కేదారనాథ్ ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే నిమిత్తం విజయవాడ భావాజీపేటకు చెందినవారు ఇద్దరు తిరిగి వచ్చారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రాగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని నాని శ్రీనివాస్ (నాని) తమ బస్సుల్లో దగ్గరుండి 41 మంది యాత్రికులను మంగళవారం తెల్లవారుజామున విజయవాడకు తీసుకువచ్చి జిల్లాలోని వారివారి ప్రాంతాలకు పంపించారు. భావాజీపేటకు చెందిన చిన్నకేశవులు, సంధ్యా లక్ష్మి, వెంకట సుశీల (53), ఆవుల రంగారెడ్డి (67) భార్య వెంకటలక్ష్మి (58) ఆచూకీ తెలియరావటంలేదు. తిరిగి వచ్చిన డివి సతీష్‌కుమార్ మాట్లాడుతూ తన కళ్ల ఎదుటే 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ నెల 4వ తేదీ బయలుదేరి 15వ తేదీ కేదారనాథ్‌లో స్వామి దర్శనం చేసుకున్నామని, ఇక తిరుగు ప్రయాణంలో సంభవించిన భారీ వర్షాలకు నరకయాతన అనుభవించామన్నారు. ఇంతటి ఘోర విపత్తు కనీవినీ ఎరుగలేదన్నారు. ఆహార పానీయాలే కాదు బట్టలకు కూడా ఇబ్బంది పడ్డామన్నారు. హెలికాప్టర్ ద్వారా డెహాడ్రూన్ నుండి ఢిల్లీకి చేరుకోగల్గామన్నారు. ఇరుకైన ఘాట్ రోడ్డులో వందలాది వాహనాలు చిక్కుకున్నాయని తమతో వచ్చిన వారిలో ఐదుగురు గల్లంతయ్యారంటూ లక్ష్మి విలపించారు.
కళ్ళ ముందే ప్రళయం..ఉత్తరాఖండ్ బాధితుల్లో వీడని భయం * బతికి వస్తామనుకోలేదు..!
english title:
pralayam
Date:
Wednesday, June 26, 2013