నిజామాబాద్, జూన్ 25: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎంసిఐ నుండి ఎట్టకేలకు అనుమతి లభించింది. దీంతో ప్రస్తుత 2013-14 విద్యాసంవత్సరంలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ద్వారా కౌనె్సలింగ్ ప్రక్రియను చేపట్టి ఈ ఏడాది 100 సీట్లను భర్తీ చేయనుండగా, ఆగస్టులో తరగతులు ప్రారంభం కానున్నాయి. స్థానిక వైద్య కళాశాలకు అనుమతి మంజూరు చేస్తూ ఎంసిఐ పాలక మండలి ఈ నెల 18, 19వ తేదీలలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం తాలూకా ప్రతులను మంగళవారం ఇంటర్నెట్‌లో ఎంసిఐ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. జిల్లాకు చెందిన భారీ నీటి పారుదల శాఖా మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి సైతం మంగళవారం సాయంత్రం ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మెడికల్ కళాశాలకు ఎంసిఐ అనుమతి లభించిన విషయాన్ని నిర్ధారించారు. 2009వ సంవత్సరంలో నిజామాబాద్‌కు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి మైదానంలో సుమారు 200 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ భవన సముదాయాలను నిర్మించారు. కళాశాల నిర్వహణకు అవసరమైన అన్ని సదుపాయాలను సమకూరుస్తూ, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టారు. ఎంసిఐ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా, గత నెల 16, 17వ తేదీలలో ముగ్గురు సభ్యులతో కూడిన ప్రతినిధుల బృందం హాజరై స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి వెళ్లింది. తాజాగా, ఈ నెల 18, 19 తేదీలలో ఎంసిఐ పాలక మండలి సమావేశంలో చర్చించిన మీదట నిజామాబాద్ మెడికల్ కాలేజీకి అనుమతి మంజూరు చేశారు. ఎంసిఐ నుండి అనుమతి లభించడం పట్ల మంత్రి సుదర్శన్‌రెడ్డి, పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎంసిఐ
english title:
mci
Date:
Wednesday, June 26, 2013