జి.మాడుగుల, జూన్ 30: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం ద్వారానే స్ధానిక సంస్ధల ఎన్నికలలో విజయం సిద్ధిస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. ఆదివారం ఆయన పాడేరు, జి.మాడుగుల మండలాల్లో విసృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు గావించారు. ఇందులో భాగంగా జి.మాడుగుల మండలం బందవీది గ్రామంలో 18 లక్షల రూపాయలతో నిర్మించనున్న పశువైద్య శాలకు శంకు స్ధాపన గావించిన అనంతరం జి.మాడుగుల మండల కేంద్రంలోని 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎ.టి.డబ్ల్యు.ఒ.కార్యాలయం, ప్రాధమిక అరోగ్య కేంద్రంలో 16 లక్షల 54 వేల రూపాయలతో నిర్మించనున్న జనరల్ వార్డ్‌లకు శంకు స్ధాపనలు గావించారు. అనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం ద్వారానే పార్టీకి విజయం వరిస్తుందని అన్నారు. రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ప్రజలు చూపుతున్న ఉత్సాహమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో గల ఆదరణ తెలియజేస్తుందని అన్నారు. అయితే ప్రతీ పంచాయతీలో కాంగ్రెస్ నాయకులు తారతమ్యాలు విడనాడి సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలే తప్ప పార్టీకి వెన్నుపోటు పొడిచే విదంగా వ్యవహరించి ఇతర పార్టీలు అవకాశాన్ని చేజిక్కించుకునే విదంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ శ్రమించి పనిచేసిన నాడే విజయం సిద్ధిస్తుంది తప్ప ఒకరిపై ఒకరు ఆదిపత్యం కోసం తపిస్తే ఓడిపోవడమే కాకుండా చేసిన కృషికి ఫలితం లేకుండా పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఎట్టి పరిస్ధితులలోనూ మాట పట్టింపులకు పోకుండా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు విజయానికి బాటలు వేశాయని, అయితే వాటిని ప్రజలకు చేరవేసే గురుతర బాధ్యత కార్యకర్తలపైనే ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండే కష్టించి పనిచేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాలలోకి వెళ్లి ప్రజలకు ఓట్లు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా అధికారం వెలగబెట్టిన మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వంజంగి కాంతమ్మ అధికార దాహంతో పార్టీ ఫిరాయించడంతో పాటు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీపై విమర్శలు గుప్పించడం అధికార తాపత్రయం తప్ప వేరేమి కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక పదవులు అలంకరించిన ప్రస్తుత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం అధికార దాహంతోనే పాదయాత్రలు చేపడుతున్నారని షర్మిల పాదయాత్రపై విమర్శించారు. ఇటువంటి అధికార వాంచతో విమర్శలు గుప్పిస్తున్న నాయకులు విమర్శలను తిప్పికొట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ చేతల పార్టీ అనే అంశాన్ని ప్రజలకు చేరవేయాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ద్వారా చెప్పింది చేస్తాం అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాల్సిన భాద్యత కార్యకర్తల భుజస్కంధాలపైనే ఉందని బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్శయ్య, కుడుముల సత్యనారాయణ, చిన్నాచారి, సార మన్మధరావు, చిన మత్య్సకొండబాబు, ఎస్.ప్రసాద్, సోమలింగం, చిన్నబ్బాయిచారి, రెడ్డిబాబు, రమణ, ఈశ్వరరావు, చిన్నుల దొర, అప్పారావు, బత్తిరి రవిప్రసాద్, సీదరి మంగ్లన్న దొర, బోద నారాయణ, గంపరాయి సూరయ్య, రొబ్బా ఉషారాణి, కిష్టవేణి, కృష్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు
english title:
welfare schemes
Date:
Monday, July 1, 2013