విశాఖపట్నం, జూన్ 30: సాధారణ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాలా? లేక విడగొట్టాలా? అన్న అంశంపై సత్వర నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తోంది. ఇటువంటప్పుడే తెలంగాణ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. అయితే సమైక్యాంధ్ర ఉద్యమానికి ఇన్నాళ్ళూ నాయకత్వం వహించిన కావూరి ఇప్పుడు వౌనం వహిస్తున్నారు. గతంలో డిసెంబర్ తొమ్మిది ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమం పెద్దఎత్తున లేచింది ఉత్తరాంధ్ర నుంచే. పార్టీలకు అతీతంగా సమైక్య రాష్ట్రం కోసం అంతా ఉద్యమించారు. సమైక్యవాదానికి మద్దతు తెలిపిన అప్పటి పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి కూడా ఉత్తరాంధ్రలో పర్యటించి, తమ వాదనను వినిపించారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణ సెగ కాంగ్రెస్ అథిష్ఠానాన్ని తాకుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకుంటే, ఆ ప్రభావం సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులపై కచ్చితంగా పడుతుంది. దీన్ని తట్టుకోవాలంటే, సీమాంధ్ర నాయకులు సమైక్య రాష్ట్రం గురించి ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా విశాఖ చేరుకున్న దిగ్విజయ్ సింగ్‌ను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి సమైక్యాంధ్రపై వినతులు అందచేశారు. అలాగే సమైక్యాంధ్ర జెఎసి నాయకులు కూడా దిగ్విజయ్‌ను కలిసి రాష్ట్రాన్ని విభజించవద్దంటూ వినతులు అందచేశారు. అయితే ఆయన నాయకులు ఆశించినంతగా స్పందించలేదు. అన్నింటికి ఓకె...లెట్ అజ్ సీ అంటూ సమాధానం చెప్పారు. దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం ఇవ్వడం వలన ప్రయోజనం ఉండదని భావించిన మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. అయితే ఆయన స్పందన అంతంతమాత్రంగా ఉండడంతో నిరాశకు గురయ్యారు.
మరోపక్క తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అథిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, దానికి తామెలా ప్రతి స్పందించాలో గాదె వెంకటరెడ్డి, గంటా, శైలజానాథ్ ఆదివారం ఉదయం విశాఖలో సమావేశమై చర్చించారు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణను వీరు ఏవిధంగా రూపొందిస్తారన్నది వేచి చూడాలి. సమైక్యవాదులతో హైదరాబాద్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటికీ మించి క్షేత్ర స్థాయిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ, ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడింది.
సాధారణ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది
english title:
general elections
Date:
Monday, July 1, 2013