నర్సీపట్నం,జూన్ 30: విశాఖ ఏజన్సీలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పకడ్భందీ చర్యలు చేపడుతున్నామని జిల్లా అదనపు ఎస్పీ దామోదర్ (ఆపరేషన్స్) తెలిపారు. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలిస్తామన్నారు. ఏజన్సీలో ఎన్నికల నిర్వహణకు ఏ మేరకు పోలీసు బృందాలు అవసరమో ఇప్పటికే రూరల్ ఎస్పీ సమావేశం ఏర్పాటు చేసి వివరాలను సేకరించినట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం తన కార్యాలయంలో కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ మన్యంలో గిరిజనులు స్వేచ్ఛగా ఓట్లు వేసుకునే వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. ఎన్నికల పోలింగ్‌కు మావోయిస్టులు ఎటువంటి అవాంతరాలు కల్పించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇతర ప్రాంతాల నుండి అదనపు బలగాలను మన్యానికి తరలిస్తామన్నారు. గిరిజనులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ బ్యాలెట్ బాక్సులను తరలించేందుకు అవసరమైతే హెలికాప్టర్లను వినియోగిస్తామన్నారు. ఇప్పటికే మన్యంలో అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామలను గుర్తించామన్నారు. రాజకీయ ఘర్షణలు, మావోయిస్టుల కదలికలున్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. చింతపల్లి, పాడేరు ఘాట్‌రోడ్లులో ప్రత్యేక పోలీస్ బృందాల ఆధ్వర్యంలో ఆధునిక పరికరాలతో తనిఖీలు చేస్తున్నామన్నారు. మందుపాతర్లను గుర్తించేందుకు వీలుగా పోలీసు డాగ్స్ పార్టీలు తిరుగుతున్నాయన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం ఈ తనిఖీలు చేపడుతున్నట్లు దామోదర్ వివరించారు.
* మావోలకు విరాళాలిస్తే కఠిన చర్యలు
మైదాన ప్రాంతాల్లో ఉంటూ గిరిజన ప్రాంతంలో వ్యాపారాలు సాగిస్తున్న వ్యాపారులు మావోయిస్టులకు విరాళాలు, ఇతర సరుకులు అందజేస్తే అటువంటివారిపై కేసులు నమోదు చేస్తామని అదనపు ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు నిధుల కోసం కొంత మంది వ్యక్తులను డిమాండ్ చేస్తుండగా, మావోయిస్టుల పేరుతో మరి కొంత మంది నకిలీ మావోయిస్టులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని, వ్యక్తుల ద్వారా డబ్బు పంపించాలని పలు రూపాల్లో నిధుల కోసం మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇటువంటి సందర్భాల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మావోయిస్టులకు నిధులు సమకూర్చే వారి వివరాలు ప్రస్తుతానికి తెలియనప్పటికీ, ఎన్‌కౌంటర్, లొంగుబాట్లు సమయాల్లో బయటపడుతుందన్నారు. ఏజన్సీ ముఖ ద్వారమైన నర్సీపట్నంలో కొత్త వ్యక్తులు, యువకులకు ఇళ్ళు అద్దెకు ఇస్తే వారి వివరాలు ముందుగా తెలుసుకోవాలన్నారు. మావోయిస్టులు, వారి సానుభూతి పరులు పట్టణాల్లో ఇళ్ళు అద్దెకు తీసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి వారికి ఇళ్ళు అద్దెకు ఇస్తే ఇంటి యజమానులపై మావోయిస్టులపై పెట్టే కేసులనే నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేసారు.
రేపు మాడుగులలో మంత్రుల పర్యటన
చోడవరం, జూన్ 30: మాడుగుల నియోజవకవర్గంలో గిరిజన సంక్షేమ శాఖామంత్రి పి. బాలరాజు, ఓడరేవుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావులు జూలై 2వ తేదీన మాడుగుల నియోజకవర్గంలో పర్యటించనున్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలియజేసారు. 2వ తేదీన 11 గంటలకు మాడుగుల నియోజకవర్గంలో కింతలి పిహెచ్‌సిని సందర్శించి, 12.30గంటలకు మండల సమాఖ్య భవనం ప్రారంభంతోపాటు మూడు గంటలకు చీడికాడ మండలంలోని మోడల్ స్కూల్‌ను ప్రారంభిస్తారని ఆయన తెలియజేసారు. అలాగే సాయంత్రం నాలుగు గంటలకు ఐదుకోట్ల 30లక్షలతో నిర్మించిన శిరిజాం వంతెనను ప్రారంభిస్తారన్నారు. వరహాపురంలో పార్టీవర్గ సమావేశంలో పాల్గొంటారన్నారు. ఆరుగంటలకు వరహాపురంలోని మెర్క్యురీ లైట్లను ప్రారంభిస్తారని కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలియజేసారు.
3న విశాఖ వస్తున్న చంద్రబాబు
* పంచాయతీ ఎన్నికలపై సదస్సు
విశాఖపట్నం, జూన్ 30: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జులై మూడో తేదీన విశాఖ వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో ఆయన ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన విశాఖలో జరిగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల పార్టీ కార్యకర్తలు, నాయుకులతో సమావేశమవుతారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఆయన కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
ఆహుతులను అలరించిన
చిన్నారుల సుందర కాండ బృంద గానం
సబ్బవరం, జూన్ 30: మండలంలోని గొల్లలపాలెం వద్ద శ్రీనగర్ కాలనీ సప్తరుషీ వేద పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన సంగీత జనకులం స్టీల్ ప్లాంట్ విద్యార్ధుల సుందర కాండ సంగీత విభావరి ఆహూతులను ఆధ్యంతం అలరించింది. ఈసందర్భంగా వారు పలు భక్తిగీతాలను రసవత్తరంగా ఆలాపన చేశారు. సంగీత అభిమానులను అమితంగా ఆకర్షించిన ఈకార్యక్రమం ఇక్కడి సప్తరుషీ వేద పాఠశాల 4వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినట్లు వ్యవస్ధాపక అధ్యక్షులు మాధవ శర్మ తెలిపారు. అనంతరం స్టీల్ ప్లాంట్ సంగీత జనకులం సంగీత పాఠశాల గురువులు పి.దుర్గారావును ఘనంగా సన్మానించారు.
విశాఖ ఏజన్సీలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో
english title:
manyam
Date:
Monday, July 1, 2013