విశాఖపట్నం, జూన్ 30: మాదిగల అభివృద్ధికి వర్గీకరణ ఒక్కటే పరిష్కార మార్గమని జాతీయ రహదారుల కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అసెంబ్లీ హాలులో ఆదివారం నిర్వహించిన మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాదిగ బిడ్డగా, కేంద్రంలో మంత్రిగా ఉన్న తాను ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అండగా నిలుస్తానన్నారు. ఈ వర్గీకరణకు యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అనుకూలమేనని, అందువలనే ఉషా మెహరా కమిషన్‌ను వేసారన్నారు. 2012లో సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్‌లో సైతం ఎన్నికల మ్యానిఫెస్టోలో వర్గీకరణను పెట్టారన్నారు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమన్నారు. మాదిగ జాతి భవిష్యత్, కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే రెండు అంశాల కోసం తాను పాటుపడతానన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాల్సిందిగా మాదిగలు నిర్వహిస్తున్న ఉద్యమం న్యాయమైనదిగా పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ మాట్లాడుతూ మాదిగల తరఫున ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వే సత్యనారాయణకు తామంతా విలువనిస్తున్నామన్నారు. దీనిని గౌరవించి కేంద్రంలో యుపిఎ సర్కార్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రంలో కోటి మంది మాదిగల ఆగ్రహాన్ని కాంగ్రెస్ చవిచూడాల్సి వస్తుందన్నారు. అలాగే రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు తరువాత గడువు ఇచ్చే అవకాశం లేదన్నారు. ఎందుకంటే శీతాకాల సమావేశాలు జరుగుతాయనే విశ్వాసం లేదని, బిల్లు వచ్చే నమ్మకం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌పార్టీకి మాదిగలు ఈ రాష్ట్రంలో శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. 2004వ సంవత్సరం నుంచి కేంద్రంలోను, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిస్తుందని, యుపిఏ రెండు విడుతల్లో బిల్లు పెట్టకపోతే మూడవసారి అధికారంలోకి వచ్చే నమ్మకం లేదన్నారు. ఒకవేళ అధికారంలోకి వచ్చినా చేస్తారని విశ్వసించలేకపోతున్నామన్నారు. అలాంటి పరిస్థితిల్లో మాదిగలు తమదారి తాము చూసుకోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే భవిష్యత్ లేదనేది రూడీ అవుతందని, మాదిగలు ఉపకులాలు ఒకే కులంగా మెజారిటీ కులంగా ఉన్నారన్నారు. మాదిగ ఉపకులాల జనాభా పది శాతం ఉండగా, ఇందులో మాదిగలు కోటి వరకు ఉన్నారన్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ చేయూతనిస్తే చేయి అందుకుంటూ అండగా నిలుస్తామని, మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటామన్నారు. రాజకీయ నిర్ణయం ముందు ఉద్యమపరంగా వత్తిడి తీసుకువచ్చేందుకు ఆగస్టు,సెప్టెంబర్ మాసాల్లో అనేక రాపాల్లో ఉద్యమ కార్యక్రమాలను రూపొందించామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నేత కృష్ణమాదిగ నాయకత్వంలో వర్గీకరణ కోసం చేసిన ఉద్యమానికి 19 ఏళ్ళు పూర్తయ్యిందన్నారు. అయిన పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించలేదన్నారు. 19 ఏళ్ళ ఉద్యమాల్లో ఎంతోమంది అమాయక మాదిగలు అశువులు బాసారని ఆందోళన వ్యక్తంచేశారు. రెల్లి ఉపకులాల ప్రతినిధి డాక్టర్ ఆడమ్స్ మాట్లాడుతూ మాదిగలకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆకలితో ఉన్నవారు ఐక్యమత్యం ఎలా సాధించగలరని ప్రశ్నించారు. మహిళా నాయకురాలు అనిత సకుర మాట్లాడుతూ మాదిగల సమస్యల పరిష్కారానికి వెంట ఉంటానని, తన వంతు సహాయ, సహకారాలుంటాయని హామీనిచ్చారు. ఏయు ఎస్సీఎస్టీ, బిసి సి నాన్ టీచింగ్ ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మల్లిపూడి నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటరు కొట్ర కన్నారావు, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, పెద్దాడ ప్రకాశరావు మాదిగ, మున్నంగి నాగరాజు మాదిగ, విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం తీర్మానాలు చేశారు.
మాదిగల అభివృద్ధికి వర్గీకరణ ఒక్కటే పరిష్కార మార్గమని జాతీయ
english title:
sarvey
Date:
Monday, July 1, 2013