హైదరాబాద్, జూలై 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశం లేదని టిడిపి సీమాంధ్ర నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుందని వారు చెబుతున్నారు. ఏదో జరిగిపోతున్నట్టు కాంగ్రెస్ హడావుడి చేస్తోందే తప్ప తెలంగాణ ఏర్పాటు చేసే ఉద్దేశం ఆ పార్టీకి లేదని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య అన్నారు.
తెలంగాణ ఏర్పాటు చేసేట్టుగా ఉంటే ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ వచ్చే వారు కాదని, రాష్ట్రానికి చెందిన నాయకులే ఢిల్లీలో ఉండేవారని, సచివాలయం ఢిల్లీకి మారి ఉండేదని వర్ల వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే తప్ప సమస్య పరిష్కరించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.
మరోవైపు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని టిడిపి అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. చార్‌ధామ్ యాత్రీకుల పరిస్థితిపై రోజుకు రెండుసార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న చంద్రబాబు మాత్రం తెలంగాణ అంశంపై మాత్రం వీరితో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు.
అయితే ఢిల్లీ పరిణామాలను బాబు జాగ్రత్తగా గమనిస్తున్నారని, ఎలాంటి నిర్ణయం వెలువడినా ధైర్యంగా ఎదుర్కోవాలనే ధృడ నిర్ణయంతో ఆయన ఉన్నారని టిడిపి నాయకులు చెబుతున్నారు.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లోనూ గణనీయమైన స్థాయిలో విజయం సాధించడం ద్వారా టిడిపి బలం పెరిగిందనే నమ్మకం కలిగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని కలిగించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.
‘దేశం’ నేతల్లో భిన్నాభిప్రాయాలు
english title:
telangana raadu
Date:
Tuesday, July 2, 2013