విజయవాడ, జూలై 1: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ వాదానికి తలొగ్గకుండా రాష్ట్రం సమైక్యంగా ఉంటుందంటూ తక్షణం ప్రకటన చేయాలని సోమవారం నాడిక్కడ జరిగిన సమైక్యాంధ్ర సంరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. సమితి రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి అధ్యక్షత జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని జెఏసిలతో కలిపి త్వరలోనే విజయవాడలో సమైక్యాంధ్ర సాధన సభ భారీగా నిర్వహించాలని తీర్మానించారు. ఈలోగా రాజకీయ పక్షాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరి సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకుని ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే ప్రకటన చేయాలని సమావేశంలో నాయకులు విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని ఓ తీర్మానంలో కోరారు. ఈ సమావేశంలో సమితి ప్రధాన కార్యదర్శి కొణిజేటి రమేష్, కృష్ణా జిల్లా కార్యదర్శి కొల్లూరు వెంకటేశ్వరరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.
తీరు మారకుంటే భౌతికదాడులే
విశాఖపట్నం: సీమాంధ్ర ప్రజాప్రతినిధుల తీరు మారకపోతే వారిపై భౌతికదాడులు తప్పవని సమైక్యాంధ్ర పొలిటికల్ జెఎసి రాష్ట్ర కన్వీనర్ జెటి రామారావు హెచ్చరించారు. చెప్పుల దండలు వేయడంతో పాటు, ఇళ్ళ ఎదుట నల్ల జెండాలతో ఆందోళనలు చేపడతామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ విశాఖలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను కలిసేందుకు వెళుతున్న జెఏసి ప్రతినిధులను పోలీసులు సోమవారం తెల్లవారుజామున ముందుగానే అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో ఆందోళనకారులు తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జెఏసి రాష్ట్ర కన్వీనర్ జెటి రామారావు మాట్లాడుతూ దిగ్విజయ్‌సింగ్ తాను బస చేసే ప్రాంతానికి రమ్మని చెబితే ఉదయం ఆరు గంటలకు తాము సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు అంది వచ్చిన అవకాశాన్ని నేలపాలు చేశారన్నారు. కీలక సమయంలో కనీసం ఉద్యమకారులకు దిగ్విజయ్‌ని కలిసి వివరంగా మాట్లాడే అవకాశం కల్పించలేకపోయారన్నారు. దిగ్విజయ్‌సింగ్‌కు మిలియన్‌మార్చ్, సాగరహారం, చలో అసెంబ్లీ ఉద్యమాల్లో జరిగిన విగ్రహాల విధ్వంసం, మీడియా వాహనాల దగ్ధం తదితర సంఘటనల చిత్రాలకు సంబంధించిన ఫొటోలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి వివరించాలనేది తమ ఉద్దేశంగా చెప్పారు. టి నాయకుల విద్వేష ప్రకటనలు, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, కెసిఆర్ అండ్ కో అవినీతి, అక్రమాలు, బెదిరింపు తదితర అంశాలతో పూర్తిస్థాయిలో వివరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రజల తరపున నాయకులుగా ఉండాల్సన వారంతా దళారులుగా మారారన్నారు.
పది లక్షల సంతకాల సేకరణ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి ఆధ్వర్యంలో సోమవారం విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమైక్యాంధ్ర విద్యార్థి యువజన జెఎసి చైర్మన్ ఆరేటి మహేష్, సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవిందరావు సంయక్త ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణపై బిజెపి, సిపిఐ వైఖరి మార్చుకోకపోతే పార్టీ ఆఫీసులు ముట్టడిస్తామని హెచ్చరించారు.
కిషన్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
సమైక్యాంధ్ర 14 యూనివర్శిటీల కమిటీ ప్రతినిధి కాంతారావు ఆధ్వర్యంలో ఏయు బయట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. నెల్లూరులో సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ప్రతినిధులపై బిజెపి నేతల దాడికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. అదే విధంగా కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్లనే రాష్ట్రంలో విభేదాలు తలెత్తుతున్నాయని, రాష్ట్ర అగ్నిగుండంగా మారే పరిస్థితులున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన జరగదంటూ ప్రకటించాలని డిమాండ్ చేశారు. (చిత్రం) సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖపట్నంలో సంతకాలు సేకరిస్తున్న దృశ్యం
సంరక్షణ సమితి సమావేశంలో నిర్ణయం * రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆహ్వానం
english title:
unity
Date:
Tuesday, July 2, 2013