రాజమండ్రి, జూలై 1: అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో తెలంగాణ సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే విధంగా కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, వీటి తరువాత ఆయన అధిష్ఠానానికి ఒక నివేదికను సమర్పించే అవకాశం ఉందన్నారు. ఈ నివేదిక తరువాత కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులే ఉన్నాయని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ అంశంపై సభలు నిర్వహిస్తున్నాయన్న అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినపుడు, అందరికీ వాక్ స్వాతంత్య్రం ఉందని, ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకోవచ్చన్నారు. తన ఢిల్లీ పర్యటనకు ప్రత్యేకత ఏమీ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రిని, కేంద్ర హోం మంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కలిశానన్నారు. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. ఉత్తరాఖండ్ ప్రకృతి విలయతాండవంలో బాధితులను ఆదుకోవడానికి సైన్యం, జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందాలు, పోలీసులతో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విశేష సేవలందిస్తున్నారని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న మన రాష్ట్ర ప్రజలను ఆదుకోవటంలో మన రాష్ట్ర ప్రభుత్వం, ఇతరులు విశేషంగా కృషిచేశారని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
గోదావరిలో అత్తగారి అస్తికలు నిమజ్జనం
ఇటీవల కన్నుమూసిన గవర్నర్ నరసింహన్ అత్తగారి అస్తికలు సోమవారం గోదావరిలో నిమజ్జనం చేశారు. రాజమండ్రిలోని పుష్కర్‌ఘాట్‌లో పూజలు నిర్వహించిన అనంతరం గవర్నర్ నరసింహన్ దంపతులు అస్తికలు నిమజ్జనం చేశారు. హైదరాబాద్ నుండి విమానంలో రాజమండ్రి చేరుకున్న గవర్నర్ దంపతులు అస్తికల నిమజ్జనం అనంతరం మళ్లీ విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
* గవర్నర్ నరసింహన్ స్పష్టీకరణ
english title:
governor
Date:
Tuesday, July 2, 2013