విశాఖపట్నం, జూలై 1: సిబిఐపై ఎవరూ ఒత్తిడి తేలేరని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం బిజెపికి అలవాటుగా మారిందన్నారు. సోమవారం ఉదయం విశాఖలో తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుకునేందుకు బిజెపి యత్నిస్తోందన్నారు. బిజెపి నక్కజిత్తుల పార్టీ అని ఆయన విమర్శించారు. ఆ పార్టీకి చెందిన గోపినాధ్ ముండే ఎన్నికల వ్యయంపై వ్యాఖ్యానించి తన గొయ్యి తానే తవ్వుకున్నారన్నారు. సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఇన్వ్‌స్టిగేషన్ అనే బిజెపి ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాస్తవానికి సిబిఐ స్వయం ప్రతిపత్తిగల సంస్థ అని, దానిపై ఎవరు ఒత్తిడి తేలేరని ద్విగిజయ్ సింగ్ అన్నారు. కాగా దిగ్విజయ్ సింగ్ సోమవారం ఉదయం 8.30కు విశాఖ నుండి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఆయన ఎక్కిన విమానం టేక్ ఆఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు తీవ్ర ఆస్వస్థకు గురికావడంతో చికిత్స నిమిత్తం అతనిని కిందకు దించారు. విమానం అరగంట ఆలస్యంగా బయలు దేరింది.
రైల్ రోకో కేసులో టిడిపి ఎమ్మెల్యేలకు వారెంట్లు
హైదరాబాద్, జూలై 1: తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా రైల్ రోకో చేసినందుకు 11 మంది తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలకు సోమవారం రైల్వే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో తెలంగాణ జెఎసి రైల్ రోకోకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు సికింద్రాబాద్ స్టేషన్‌లో రైళ్లను నిలిపి వేశారు. అయితే రైల్వే కోర్టు విచారణకు ఎమ్మెల్యేలు హాజరుకాక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. విచారణకు హాజరు కావాలని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. నాగం జనార్దన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన రైల్ రోకోలో దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, దయాకర్ రెడ్డి, వేణుగోపాలా చారి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. వీరందరికీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.
80 మంది వరద బాధితులను తీసుకొచ్చిన టిడిపి
ఉత్తరాఖండ్ చార్‌ధామ్ వరదల్లో చిక్కుకున్న 80 మంది యాత్రికులను టిడిపి ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకు వచ్చింది. యాత్రికులతోపాటు టిడిపి ఎంపిల బృందం టిడిపిపి నాయకులు నామా నాగేశ్వరరావు నాయకత్వంలో హైదరాబాద్ చేరుకుంది. యాత్రికులంతా తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఎంపిలను ఆదేశించారు.
గన్‌మెన్లను ఇవ్వండి
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు గతంలో ఇచ్చిన విధంగా ఇద్దరు గన్‌మెన్లను భద్రత కోసం ఇవ్వాలని కోరుతూ టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ఇంటిలిజెన్స్ అదనపు డిజిపి మహేందర్‌రెడ్డికి లేఖ రాశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి వర్లకు ముప్పు ఉందని, టిడిపిలో ఆయన ముఖ్యమైన నాయకుడని లేఖలో బాబు పేర్కొన్నారు. వర్లకు సెక్యురిటీ అవసరం లేదని విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ చేసిన సూచన మేరకు గన్‌మెన్లను తొలగించారన్న బాబు.. పార్టీ కోసం వర్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారని, దీనిని దృష్టిలో పెట్టుకుని సెక్యూరిటీ కొనసాగించాలని కోరారు.
మాట తప్పింది టిడిపినే
* అనర్హత వేటుపై ఎమ్మెల్యేల వాదన
హైదరాబాద్, జూలై 1: తెలంగాణ అంశంపై మాట తప్పిన టిడిపికి తనపై అనర్హత వేటు వేయాలని కోరే హక్కు లేదని టిడిపికి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిన గంగుల కమలాకర్ వాదించారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం పిటిషనర్, కౌంటర్ పిటిషనర్‌ల వాదనలు విన్నారు. గంగులపై అనర్హత వేటు వేయాలని పిటిషనర్ టిడిపి ఎమ్మెల్యే డి నరేంద్ర స్పీకర్‌ను కోరారు. అయితే 2009 ఎన్నికల్లో టిడిపి తెలంగాణకు హామీ ఇచ్చిందని, తరువాత మాట తప్పిందని, తాము ఆ మాటకే కట్టుబడి ఉన్నామని గంగుల తెలిపారు. మాట తప్పిన టిడిపికి తనపై అనర్హత వేటు వేయాలని కోరే అధికారం లేదన్నారు. కాగా, ఎమ్మెల్యేలు కె హరీశ్వర్ రెడ్డి, చిన్నం రామకోటయ్య, వేణుగోపాలా చారి సోమవారం విచారణకు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ను దిక్కరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు వీరిపై వేటు వేయాలని టిడిపి ఫిర్యాదు చేసింది. దీంతో టిడిపి వాదనల వివరాలు తమకు అందజేయాలని, అవి అందిన తరువాత మరోసారి తమ వాదనలు వినిపిస్తామని తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు.
* దిగ్విజయ్‌సింగ్
english title:
digvijay singh
Date:
Tuesday, July 2, 2013