మహబూబ్‌నగర్, జూలై 1: దేశ రక్షణలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ యాదయ్య ప్రాణత్యాగాన్ని జాతి ఎప్పటికీ మరువలేరని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు తెలిపారు. గత నెల 24వ తేదీన శ్రీనగర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అసువులుబాసిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులను సోమవారం చంద్రబాబుపరామర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో యాదయ్య భార్య సుమతమ్మను, ఆయన పిల్లలను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ జవాన్ యాదయ్య ప్రాణత్యాగాన్ని దేశ ప్రజలు మరువలేరని తెలిపారు. 11 ఏళ్లు దేశం కోసం పని చేసి ఉగ్రవాదుల దాడిలో మృతి చెందడం బాధాకరమని అన్నారు. మరో ఐదు సంవత్సరాలలో పదవీ విరమణ పొందాల్సిన యాదయ్య లేకపోవడం ఆ కుటుంబానికి తీరని నష్టం జరిగిందని అన్నారు. చిన్నారులు సుశ్మిత(4), నశ్మిత(1)లకు యాదయ్య దూరం కావడం తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. యాదయ్య ప్రాణత్యాగాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా దేశ భక్తిని పెంపొందించుకోవాలని కోరారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను ప్రతిఒక్కరు ఆదుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని, సమాజం వారికి అండగా నిలిచినప్పుడే నిజమైన నివాళి అవుతుందని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన యాదయ్య విగ్రహాన్ని కొండారెడ్డిపల్లిలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. విగ్రహ ఏర్పాటుకు తమ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, రాములు చొరవ తీసుకోనున్నారని తెలిపారు. యాదయ్య కుటుంబానికి కేంద్రం నుండి రావల్సిన సహాయం కోసం తాను ప్రత్యేకంగా లేఖ రాస్తానని, ఇప్పటికే కుటుంబానికి సహాయం పూర్తి స్థాయిలో అందాల్సి ఉండేదని, ఆలస్యం కావడం విచారకరమని అన్నారు. యాదయ్య భార్య సుమతమ్మకు ఉద్యోగంతో పాటు అందాల్సిన సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. టిడిపి తరఫున రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, యాదయ్య కూతుళ్ల పేరిట డిపాజిట్ చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. యాదయ్య పిల్లలు దిక్కులేని వారిగా ఉండటానికి వీలులేదని, అందరికంటే మిన్నంగా ఉండేందుకు సమాజం మొత్తం ఆ కుటుంబానికి అండగా నిలవాలని అన్నారు. అప్పుడే ప్రజల్లో దేశ భక్తి ఉన్నట్లు అని బాబు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో యాదయ్య పేరిట గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశ ప్రజలందరు సురక్షితంగా ఉన్నారంటే యాదయ్య లాంటి జవాన్లు ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, వారందరి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. చంద్రబాబు వెంట ఎమ్మెల్యేలు రాములు, జైపాల్‌యాదవ్, రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎర్రశేఖర్ తదితరులు ఉన్నారు. (చిత్రం) కొండారెడ్డిపల్లి గ్రామంలో యాదయ్య భార్య సుమతమ్మకు 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న చంద్రబాబు
దేశ రక్షణలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ యాదయ్య
english title:
yadaiah
Date:
Tuesday, July 2, 2013