వరంగల్, జూలై 7: ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబీకులెన్నడైనా సచివాలయానికి వచ్చారా? నా తొమ్మిదేళ్ల పాలనలోనూ మా వాళ్లు ఎక్కడైనా కనిపించారా? రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజాక్షేమమే ధ్యేయం కావాలి.. ఆ ముగ్గురి మాదిరిగా అవినీతే లక్ష్యం కాకూడదు’ అని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెరాస అధినేత కెసిఆర్, వైకాపా నేత జగన్మోహన్‌రెడ్డి దృష్టి మొత్తం అక్రమ సంపాదనలపైనే ఉందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయత్తపరిచడంలో భాగంగా వరంగల్‌లో ఆదివారం నిర్వహించిన ఉత్తర తెలంగాణ టిడిపి ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలనుండి తరలివచ్చిన పార్టీశ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ‘స్థానిక’ ఎన్నికల కార్యాచరణ వేదికనుండే సాధారణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రెండు దఫాలుగా దాదాపుగంటన్నరకు పైగా ఆవేశంతో ప్రసంగించిన బాబు, మళ్లీ తాను అధికారంలోకి వస్తేనే భ్రష్టుపట్టిన రాష్ట్రం గాడిన పడుతుందని చెప్పుకొచ్చారు. అటు కాంగ్రెస్, తెరాస, ఇటు వైకాప నేతలకు ప్రజాక్షేమంకంటే స్వార్ధం, అక్రమార్జనలే పరమావధిగా ఉన్నాయని ధ్వజమెత్తారు.
ఆ పథకాలన్నీ మావే..
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడపిల్లల సంక్షేమం కోసం ప్రారంభించిన మహాలక్ష్మి పథకాన్ని కాపీకొట్టిన సిఎం బంగారుతల్లి అని కొత్త ప్రచారం చేస్తున్నారని అన్నారు. ‘ఈ-సేవను ప్రారంభించింది నేను, ఆనాడు అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ రాష్ట్రానికి వస్తే అరగంటలో ఆయనకు డ్రైవింగ్ లైసెన్సు మంజూరు చేయించాం. దాని పేరునే ఇప్పుడు ‘మీ-సేవ’గా మార్చారు. పేర్లు మార్చడంలో కిరణ్ దిట్ట, ఆయనకు రాజకీయాల్లో ఓనమాలే తెలియవు. పరిపాలన అసలే తెలియదు, అందుకే మా కార్యక్రమాల్నే పేర్లు మార్చి తమవిగా చెప్పుకుంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. అత్యున్నతమైన ఎపిపిఎస్సీని సైతం భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. ‘నాడు వైఎస్ తన అనుచరున్ని ఎపిపిఎస్సీ సభ్యునిగా నియమిస్తే ఇటీవలే ఆయన అరెస్టయి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. అలాగే సిఎం కిరణ్ ఓ కాంగ్రెస్ కార్యకర్తకు ఎపిపిఎస్సీ పదవి ఇస్తే ఒక మహిళ ఇంట్లో పేకాడుతూ చిక్కాడు. డిప్యుటి తహశీల్థార్ స్థాయి సభ్యుడొకరు డిప్యుటి కలెక్టర్ పోస్టు అభ్యర్ధులను ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?’ అని ప్రశ్నించారు. తన తొమ్మిదేళ్ల పాలనలో ఏ పోస్టయినా డబ్బు పెట్టి తెచ్చుకున్నామని ఇప్పుడెవరైనా నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని సవాల్ చేశారు.
ఆస్తులు పెంచుకోవడమే కెసిఆర్ ధ్యేయం..
తెరాస అధినేత కెసిఆర్ ఉద్యమం ముసుగులో తన కుటుంబ ఆస్తులు పెంచుకుంటున్నారని తూర్పారబట్టారు. ‘వారి బండారమమంతా బయటపడుతూనే ఉంది. ఉప ఎన్నికల్లో ప్రజలకు మాయ మాటలు చెప్పి గెలవడం తప్ప సాధారణ ఎన్నికల్లో గెలిచే సత్తా కెసిఆర్‌కు లేదు’ అని ఎద్దేవాచేశారు. వైకాపా అధినేత జగన్ లక్షకోట్ల అక్రమార్జనతో పత్రిక, ఛానల్ పెట్టడం చూస్తే సిగ్గేస్తోందన్నారు. ఈ ముగ్గురికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని, 2014 సాధారణ ఎన్నికల్లో తమదే గెలుపని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘కేంద్రంలో కాంగ్రెస్ గెలవదు, బిజెపికి ఓట్లు పెరగవు. మూడో ప్రత్యామ్నాయం వస్తోంది. రాష్ట్రం మాదిరిగానే కేంద్రంలోనూ నేనే చక్రం తిప్పుతా’ అని చంద్రబాబు చెప్పారు. ఇందుకు ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతున్న చంద్రబాబు. హాజరైన వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల టిడిపి శ్రేణులు