సింహాచలం, జూలై 7: రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుకుంటూ కృతయుగ దైవం శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామివారికి పూజలు చేయించామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఓడరేవులు వౌలిక వసతుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఇద్దరు మంత్రులు, గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి సింహాచలేశుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో మంత్రి ఏరాసు మాట్లాడారు. రాష్ట్రాన్ని విడదీయడం అంత సులువు కాదని ఒక కుటుంబ విడిపోతేనే అనేక సమస్యలు, అంశాలు పరిగణంలోకి తీసుకొన్నాకే నిర్ణయం ప్రకటిస్తారని అటువంటి రాష్ట్రాన్ని విడదీయాలంటే కేకు కత్తిరించినంత సులువు కాదని ఏరాసు అన్నారు. ఒక ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఊపందుకుంటుందని, సమైక్యవాదులు కూడా పోరాటాలకు సన్నద్ధమవుతున్నారని మంత్రి చెప్పారు. వర్షాలు సక్రమంగా కురవాలని, రైతాంగం ప్రజల సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ముందుగా దేవాలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకున్న మంత్రులు సింహాచలేశున్ని ప్రార్థించారు.
కప్ప స్తంభం వద్ద స్వామిని ప్రార్థిస్తున్న మంత్రులు