సింహాచలం, జూలై 7: ఉత్తరాఖండ్ చార్‌ధామ్ వరదల్లో మృతి చెందిన యాత్రికుల ఆత్మశాంతి కోసం శాంతి గీతాయజ్ఞ పరిషత్ ఆధ్వర్యంలో శాంతి గీతాయజ్ఞం ఆదివారం సింహాచలం దేవస్థానం పుష్కరిణీ సత్రం ప్రాంగణంలో జరిగింది. యజ్ఞ పరిషత్ ప్రతినిధులు, వేదపండితులు గీతా పారాయణల హోమాలు నిర్వహించి పూర్ణాహుతి ద్వారా యజ్ఞ్ఫలాన్ని మృతుల ఆత్మశాంతిని కాంక్షిస్తూ ధార పోశారు. ఈ కార్యక్రమానికి విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామితో పాటు సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రామచంద్రమోహన్ ఆలయ ప్రధాన అర్చక పురోహితుడు మోర్త సీతారామాచార్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు. పవిత్రమైన పుణ్యభూమిలో ఇంతటి విపత్తు సంభవించడం దురదృష్టకరమని స్వామి అన్నారు. ఈ సంఘటనను జాతీయ విపత్తుగా పరగణించి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాలన్నీ బాధితులను ఆదుకోవాలని స్వామీజీ విజ్ఞప్తి చేశారు. దుర్ఘటనలో వేలాది మంది మృత్యువాత పడ్డారని, మరెంతోమంది విగతజీవులుగా మారారని వీరందర్ని ఆదుకునేందుకు భారీగా నిధులు సేకరించి ప్రభుత్వం సాయం అందించాలని స్వామీ సూచించారు. అక్కడ అనేక గిరిజన గ్రామాలు వరదల్లో కొట్టుకుపోయాయని వాటిని పునర్నిమించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్వామీజీ కోరారు. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ప్రకృతి విపత్తులో చార్‌ధామ్‌లో ఉంటున్న ఎందరో మహనీయులు కూడా గల్లంతయ్యారని భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలని ఆభగవంతుడిని అందరూ ప్రార్థించాలని స్వామీజీ పిలుపు నిచ్చారు. మృతుల ఆత్మశాంతి కోసం గీతాయజ్ఞ పరిషత్ నిర్వహించిన శాంతి యజ్ఞాన్ని స్వామీజీ అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం పరిషత్ ప్రతినిధులు గోశాల నుండి సింహాచలేశుని తొలిపావంచా వరకు వౌన ప్రదర్శన నిర్వహించారు. పరిషత్ ప్రతినిధులు ప్రసాదరావు పీతల అప్పలరాజు కార్యక్రమానికి సారధ్యం వహించారు.
.......................
పూర్ణాహుతి నిర్వహిస్తున్న వైదికులు,
హాజరైన స్వామీజీ, ఈవో, ప్రధాన అర్చకుడు
స్వరూపానందేంద్ర విజ్ఞప్తి
english title:
ca
Date:
Monday, July 8, 2013