తిరుపతి, జూలై 7: తిరుమల ధర్మగిరిలో టిటిడి నిర్వహిస్తున్న వేద పాఠశాలను ఇఓ ముక్కామల గిరిధర్ గోపాల్ ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులతోనూ, పాఠశాల అధ్యాపకులతో ఆయన ముచ్చటించారు. రుగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యుజుర్వేదం, తైత్తరీయ శాఖల్లోనూ సామవేదం, అధర్వరణ వేదం, శైవాగమం, వైష్ణవ ఆగమం, పాంచరాత్ర ఆగమం తదితర శాఖల్లోని మంత్ర పుష్పాలను వేద విద్యార్థులు పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో స్పష్టంగా అద్భుతంగా వేదపారాయణం చేస్తున్నారని ప్రశంసించారు. సనాతన ధర్మపరిరక్షణకు వేద విజ్ఞానం ఎంతో అవసరమని ఆయన అన్నారు. వేద వాప్తికి మరింత కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టిటిడి అధికారులు పాల్గొన్నారు.
పెరిగిన రద్దీ
ఇదిలావుండగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సాధారణ భక్తులు స్వామిని దర్శించుకోడానికి 20 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 7 గంటలు పడుతోంది. ఈ నేపధ్యంలో టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు క్యూలైన్‌లో తనిఖీలు చేసి భక్తులకు అవసరమైన పాలు, మజ్జిగ, ఆహారం అందేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా విఐపిలకు ఇచ్చే పాస్‌ల సంఖ్యను కుదించి సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇచ్చారు.
క్యూలైన్లలో భక్తులకు ఆహారం
అందుతోందో లేదో తనిఖీ చేస్తున్న జెఇఓ