![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/chepa.jpg)
వైరా, జూలై 7: ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌లో 17 కేజీల వాలిగి చేప జాలరులకు ఆదివారం చిక్కింది. రిజర్వాయర్‌లో గత నెల 25 నుండి జాలరులు చేపల వేట చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రిజర్వాయర్‌లో చేపలు, రొయ్యలు లభ్యమవుతాయని ప్రతీతి. అయితే మత్స్యకారులు ఆదివారం సాగించిన వేటలో భారీ చేప దొరకడంతో వారి పంట పండింది. షేక్ బి.బి.సాహెబ్ రోజూలాగే శనివారం రాత్రి కూడా వలలు వేశాడు. ఆదివారం ఉదయానికి వల పూర్తిగా కనిపించకుండా చాలాదూరం పోయింది. చాలాసేపు గాలించిన తరువాత కనిపించకుండా పోయిన వలను కనుగొని అతికష్టం మీద దాన్ని ఒడ్డుకు చేర్చారు. దాదాపు ప్రతి ఆదివారం చేపలు కొనుగోలు చేయడానికి జనాలు రిజర్వాయరు వద్దకు అధికంగా వస్తుంటారు. రిజర్వాయరులో భారీ చేప లభ్యమైందన్న వార్త ఆ నోట ఈ నోట విన్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ‘ఔరా’ అనుకోవడం కనిపించింది.
వైరా రిజర్వాయర్‌లో దొరికిన భారీ వాలిగి చేప