బేగంపేట, జూలై 8: పద్నాలుగు మంది ప్రాణాలను మింగేసిన సికింద్రాబాద్ రాష్టప్రతి రోడ్డులోని సిటీలైట్ హోటల్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం సిటీలైట్ భవనం కుప్పకూలిన తర్వాత వివిధ విభాగాలు చేపట్టిన సహాయక చర్యలు అనుక్షణం ఉత్కంఠగా సాగాయి. ఏ క్షణం ఎవరి మృతదేహం బయటకు వస్తుందోనని సంఘటన స్థలంలో మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు రోదిస్తూ ఆందోళనకు గురయ్యారు. కానీ పోలీసులు మాత్రం వారిని ముందుకు రానివ్వకుండా అడ్డుకోవటమేగాక, వారిని బలవంతంగా అక్కడినుంచి పంపించి వేశారు. ఎల్లయ్య అనే స్థానికుడు టీ తాగేందుకు వచ్చాడని, ఆయన ఏమైపోయాడోనంటూ ఆయన భార్య, కూతురు సంఘటన స్థలంలో రోదిస్తున్నా, పోలీసులు విచక్షణారహితంగా వారిని అక్కడినుంచి తరిమేశారు. మృతులు, బాధితుల కుటుంబాలకు చేయూతనివ్వాల్సిన పోలీసులు సంఘటన స్థలానికి వచ్చిన రాజకీయ నేతలకు దాసోహం అన్నారు. ఒక్కో నేత వెంట పదులు సంఖ్యలో వారి అనుచరులు, కార్యకర్తలు వస్తూ, సహాయక చర్యలకు ఆటంకం కల్గిస్తున్నా, ప్రశ్నించని పోలీసులు అమాయకులపై తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. సంఘటన ఉదయం జరిగినందున మృతుల సంఖ్య తక్కువగానే ఉండవచ్చునని అధికారులు భావించినా, శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడ్డాయి. సంఘటన జరిగిన అరగంటలో ముగ్గురి మృతదేహాలను వెలికితీసిన అధికారులు సోమవారం సాయంత్రానికల్లా 13 మంది మృతి చెందినట్లు, మరో 17 మంది తీవ్ర గాయాలపాలైనట్లు నిర్థారించారు.
ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే తెరిచే సిటీలైట్ హోటల్‌కు వందల మంది టీ, టిఫిన్ కోసం వస్తుంటారు. అయితే సోమవారం అమావాస్య కావటం, మార్కెట్ బంద్ ఉండటంతో ఉదయం ఆరున్నర గంటల సమయంలో సుమారు నలభై నుంచి యాభై మంది ఉన్నపుడు ఒక్కసారిగా హోటల్ జి ప్లస్ టు భవనం కుప్పకూలింది.
ఒక రకంగా మామూలు రోజుకన్నా సోమవారం అమావాస్యరోజు తక్కువమంది హోటల్‌లో ఉన్నపుడు కూలటంతో ప్రాణనష్టం బాగా తగ్గిందని స్థానికులంటున్నారు. కానీ పలువురు ప్రత్యక్ష సాక్షులు మాత్రం భవన శిథిలాల కింద ఇంకా కనీసం 30 నుంచి నలభై మందికి వరకు ఉండి ఉండవచ్చునని తెలిపారు. త్వరలో రంజాన్ పండుగ ప్రారంభం కానున్నందున హలీం తయారు చేయడానికి హోటల్ యజమాని ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన 25 మందిలో యజమాని కొడుకు సయ్యద్ ముస్త్ఫాతో పాటు మొత్తం పదకొండు మంది, మరో ఇద్దరు కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
మృతులు, క్షతగాత్రుల వివరాలు
సిటీలైట్ భవనం కూలిన ఘటనలో నిజామాబాద్ కాన్‌పూర్ మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన యు.రమేష్(28), ఒరిస్సాకు చెందిన సంతోష్(28), రాజు(28), మురళీ(27), నన్ను అలియాస్ మనోజ్(28), సికింద్రాబాద్ పాన్‌బజార్‌కు చెందిన ఎం. రమేష్(35), సయ్యద్ ముస్త్ఫా(33), సికింద్రాబాద్ భోలక్‌పూర్‌కు చెందిన బల్దియా ఉద్యోగి ఎం. బాలకృష్ణ(50)తో పాటు మరో మూడు మృతదేహాలను పోలీసులు గుర్తించాల్సి ఉంది. గాయపడినవారిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రదీప్‌దాస్(20), బేకరిలో క్యాషియర్‌గా పనిచేస్తున్న మెదక్‌కు చెందిన నరేంద్ర(23), ముషీరాబాద్‌కు చెందిన బి. సాయిలు(60), రామంతాపూర్‌కు చెందిన బి.నర్సింహ(45), హోటల్‌లోనే నివాసముండే జి. ప్రభాకర్(62), ఎన్. చిరంజీవి(23), ఇందిరానగర్‌కాలనీకి చెందిన ఎన్. సురేష్, సప్లయిర్‌గా పనిచేస్తున్న ముఖేష్(23), సప్లయిర్ రమేష్(60), లేబర్‌గా పనిచేసే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బి.రమేష్‌కుమార్, రాహుల్‌సింగ్(26), నల్గొండ మిర్యాలగూడకు చెందిన రామాంజనేయులు రెడ్డి(38), రాజేంద్రనగర్‌కు చెందిన వర్కర్ సుధాకర్(30), బోయిన్‌పల్లికి చెందిన ఎం.డి. బాషా(24), మెదక్ సిద్దిపేటకు చెందిన వై.ఎలయ్య(40), టి.మల్లేష్(23), మెదక్ అందోల్ సమీపంలోని డాకూర్ గ్రామానికి చెందిన సిహెచ్. నాగేష్(32), వైసీపురాకు చెందిన మహ్మద్ హమీద్(23), సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటకు చెందిన లారీ డ్రైవర్ పులి ఎల్లమ్(40)లుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
పద్నాలుగు మంది ప్రాణాలను మింగేసిన సికింద్రాబాద్ రాష్టప్రతి రోడ్డులోని
english title:
city light hotel
Date:
Tuesday, July 9, 2013