‘ఏవండీ.. వింటున్నారా?’ అని అమ్మలు అంటుంటే - ‘ఆ.. వింటున్నానే’ అంటూ జవాబును పెదాలకు అప్పజెప్పి తన ఆలోచనల్లో మునిగిపోతున్న నాన్నలను మనమందరం చూస్తూనే ఉన్నాం. ఇది మన ముందరి తరం తీరు.
ఈ తరంలో అయితే- పేరు పెట్టి పిలిచి ‘లిజన్’ అని బెటర్ హాఫ్ అంటుంటే ఆ లిజన్‌ని ఆర్డర్‌గా పరిగణించి పక్కనే చేరి వినటానికి రెడీ అయిపోవటం అదర్ హాఫ్ విజన్ అయిపోతోంది.
విన్నా వినకపోయినా ఆ తరంలో ఎడబాటు ఉండేది కాదు. పొరపాట్లు ఉన్నా వాటిని తడబాట్లుగానే కొట్టిపారేసేవారు. ఏదీ యూనివర్సల్ ప్రాబ్లమ్ అనిపించేది కాదు.
ఇప్పుడు కూడా ఎడబాట్లు లేవు.. తడబాట్లు లేవు. పొరపాట్లు లేవు.. అన్నట్టుగానే ఉంటోంది. ఏ క్షణాన చూసినా అన్యోన్య దాంపత్యమే అనిపిస్తోంది.. కనిపిస్తోంది. అయినా ఆలుమగల మధ్య లేని దూరం ఆ మనసులలో పెరిగిపోతోంది. చిరు విముఖతా శాశ్వత సమస్య అయిపోతోంది. మూడు ముళ్ల బంధంలో మూడడుగులు వేసిన పురాణ పురుషుడు దర్శనమిస్తున్నాడు.
‘వినదగు నెవ్వరు చెప్పిన’ అని అనిపిస్తున్నా ‘వినదగు నెవర్ చెప్పిన’ అన్న భావం బలమై కూర్చుంటోంది.
అసలు మనం ‘ఎవర్’ అనీ ‘నెవర్’ అనీ విరుద్ధ ఆలోచనలను పెంచుకుంటున్నామా? లేక పంచుకుంటున్నామా అన్నది ప్రశ్న.
* * *
ఈ మధ్య - ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన స్నేహితురాల్ని కలవటానికి వెళ్లి మాట్లాడుకుంటూ అన్ని వార్డులను కలియ తిరుగుతుండగా మూడు పదుల డాక్టర్ స్టెతస్కోప్‌తో తలవంచుకుని వడివడిగా ఔట్ పేషెంట్ వార్డు వైపు వెళ్తుంటే-
‘బాబూ! ఒక్క మాట’ అంటూ ఆపి ఆ డాక్టర్‌ని పరిచయం చేసింది మిత్రురాలు. ఇంతకీ ఆ డాక్టర్ ఆ స్నేహితురాలి పుత్రరత్నమే. పరిచయాలయిన తర్వాత ‘అయినా, తెలీక అడుగుతాను.. ఈ డాక్టర్లు అంతమంది పేషెంట్లు ఎదురుచూస్తూ, కళ్లప్పగించి చూస్తుంటే అలా తలవంచుకు వెళ్లిపోతారేమిటి?’ అన్నాను.
‘తలవంచుకోకపోతే - అందరూ తెలిసిన పేషెంట్లే అయి ఉంటారు - ఎందరినని విష్ చేయాలి? ఎందరికని ప్రిఫరెన్స్ ఇవ్వాలి?’ అంది.
డాక్టర్లు చూసీచూడనట్టు - ప్రొఫెషనలిజమ్‌లో ఎవరూ నా వారు కాదన్నట్టు - రయ్‌మని దూసుకుపోవటంలోని సైకాలజీ ఇదన్నమాట!
ఈ ఆలోచనతో కృష్ణుడు, అర్జునుడు, గీతోపదేశ ఘట్టం కళ్ల ముందు మెదిలింది. దాదాపుగా అర్జునుడి పరిస్థితీ ఈ డాక్టర్ వంటిదే అనిపించింది.
* * *
బాణాన్ని ఎక్కుపెట్టటమే తరువాయి అనుకుని మురిసిపోతున్న కృష్ణుల వారు ఇంకా అర్జునుడు బాణాన్ని సంధించక పోతుండటంతో సందేహిస్తూ వెనుతిరిగి చూస్తే బిక్కమొహంతో పార్థుడు-
అదిలించాల్సింది రథాశ్వాలను కాదు - కదిలించాల్సింది అర్జునుడి భావోద్వేగాలను అని ఇట్టే తెలిసిపోయింది ఆ పురుషోత్తముడికి. ‘వినదగు ఎవ్వరు చెప్పిన’ అన్న రీతిలో చెబితే ఫల్గుణుడు ‘నెవర్’ అంటాడేమోనన్న శంకతో ‘నీ’ ‘నా’ తత్వసారాన్ని వీనుల విందయ్యేటట్లు, మనసును వశీకరణం చేసుకునేటట్లు చెప్పాడు. ఆ బోధతో విజయుడికి విశ్వదర్శనమైంది. ఆ ఉపదేశమే ‘శ్రీ మద్భగవద్గీత’గా నిత్యం పఠనీయమైంది తరతరాలకు.
మొత్తానికి సకల ధర్మాల సారంగా గీత మిగిలిపోయింది. అయినా తలకెక్కించుకుని మన గీతల్ని మనం చెరిపేసుకోలేక పోతున్నాం. గీతలో ఒక ఫిలాసఫీ ఉంది.. ఒక సైకాలజీ ఉంది.. ఒక ఆంత్రపాలజీ ఉంది. మన తత్వాలను, వ్యక్తిత్వాలను, మనస్తత్వాలను, మానవ పరిణామాన్ని, చరిత్ర గతిని మార్చగల రహస్యాలున్నాయి.. జీవ సూత్రాలున్నాయి.. జీవన ధర్మాలున్నాయి.
* * *
అంతెందుకు మన వేమనా ఇటువంటి పనే చేశాడు - ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్న రీతిలోనే - ‘విశ్వదాభిరామ వినుర వేమా’ అంటూ - భక్తి, రక్తి, ముక్తి, యుక్తులుగా సాగే జీవన చట్రాన్ని మన ముందుంచాడు. ‘ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు’ అంటూ అలతి అలతి పదాలతో సోషియాలజీని, సైకాలజీని కలగలిపాడు. రక్తి- అనురక్తులలో, భవ-్ధన బంధాలలో ఫిలాసఫీని, థియోసఫీని రంగరించాడు. అందుకే వేమన ఒక సామాజిక శాస్తజ్ఞ్రునిలా, ఒక మనో విశే్లషకుడిలా, ఒక కౌన్సిలర్లా అనిపిస్తాడు. పైగా ధర్మాన్ని అల్లంత దూరాన ఉంచక మానవ తత్వానికి ఆభరణం చేశాడు.
* * *
There is a flavor in blood and a sweetness in tears అని ఖలీల్ జిబ్రాన్ అంటాడు. ‘ఫ్లేవర్ ఇన్ బ్లడ్’ అన్న పదం విన్నపుడల్లా చదువు సంధ్యల మధ్య మరుగున పడిపోయిన ‘సీజన్ ఆఫ్ బ్లడ్’ అన్న పదబంధం మనసు పొరల నుండి పలకరిస్తూనే ఉంది. జీవితం రక్తరుతువుతో జీవకళను సంతరించుకుంటున్నట్లనిపిస్తుంటుంది. మనకు తెలిసిన ఆరు రుతువులకు ఈ రక్త రుతువును కలుపుకుంటే ఏడు రుతువులయి జీవితం ఇంద్రచాపమే అవుతుంది.
ఇంతకీ అశ్రువులలో అమృత తత్వాన్ని, అరుణిమలో పసిమిని చూడగల నేర్పరితనం ఈ జీవితానికి ఉందా? నేర్వనితనం జీవితానిదయితే బ్లడ్‌లోని ఫ్లేవర్‌ను, టియర్స్‌లోని స్వీట్‌నెస్‌ను తెలుసుకోవటం ఈ జన్మకు సాధ్యం కాదు కాక కాదు. జీవితాన్ని బంగారు పళ్లెంలో అందిస్తున్నా స్వీకరించగల సత్తా మనకుండాలి కదా! అతిథిలా ఈ పుడమిపైకి వచ్చినప్పటికీ నేల తల్లి ఆతిథ్యాన్ని అందుకోగల సంసిద్ధత మనకుండాలి కదా!
ఉప్పూ కర్పూరమూ ఒక్కలానే ఉంటాయి అన్నట్టుగా దుఃఖాశ్రువులయినా, ఆనందాశ్రువులయినా ఒక్కలానే ఉంటాయి. రెండూ కన్నీళ్లే! కాని అవి కనుకొలకుల నిలవటానికి కారణాలైన భావోద్వేగాలు వేరువేరు.. జలజలమని రాలిన తర్వాత మనిషికి మిగిల్చే స్థితి వేరువేరు. జీవితాన్ని దొర్లించేస్తూంటే ఉప్పగానే ఉంటుంది. జీవితాన్ని కదిలించగలిగితే కర్పూరమే అవుతుంది. ఉప్పులేని కూర రుచికరం కాదు - అందుకే వంటలో ఉప్పు కరుగుతుంది. కర్పూరం మంటలా ఎగస్తుంది - జీవితమూ కర్పూరంలా రగలాలి.
కేవలం మనిషిగా బ్రతికి తనువును చాలిస్తే సరిపోదు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగి వ్యక్తిత్వాన్ని వ్యక్తిమత్వం చేసుకుంటేనే మన అస్తిత్వం ఆదర్శం అయ్యేది.
ఇంతకీ తెల్లగా కనిపించిన కర్పూర కళిక ఎర్రని మంటలా కావటంలో ఫ్లేవర్ ఇన్ బ్లడ్ కనిపించటం లేదూ..! స్వీట్‌నెస్ ఇన్ టియర్స్ తెలియటం లేదూ! కరిగిపోయే జీవితంలో కరగని తత్వం ఒకటుంది - దానిది వ్యక్తిత్వం మనస్తత్వం కలగలిసిన నేపథ్యం. *
వినదగు
english title:
vinadagu
Date:
Sunday, July 21, 2013