సెలవుల్ని ఎంత సరదాగా గడపాలో నేటి యువతకు ఎవరూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విందులు-వినోదాలతో, పర్యాటక స్థలాల్ని సందర్శించడంతో కాలక్షేపం చేయాలని కుర్రకారు ఆలోచించడం సర్వ సాధారణం. స్నేహితులతో ఆటపాటల్లో గడపడం, ‘ఫేస్‌బుక్’లోనో.. ‘ట్విటర్’లోనే నిత్యం మునిగి తేలడం నేటి యువతకు ప్రధాన వ్యాపకమైంది. అయితే, ఇందుకు భిన్నంగా అనాథ పిల్లల సేవలో సెలవుల్ని గడిపి- ఆమె ‘వార్తల్లో వ్యక్తి’గా నిలిచింది. స్వలాభం కోసం తప్ప, ఇతరుల గురించి ఆలోచించే తీరిక నేటి యువతకు లేదన్న మాటలను ఆమె తిప్పికొట్టింది. ముంబైకి చెందిన రేనా శ్రీవాత్సవ (16) టెక్సాస్ (అమెరికా)లోని ఫ్రిస్కో హైస్కూల్‌లో చదువుతోంది. ఇటీవల పాఠశాలకు వేసవి సెలవులిచ్చినపుడు ఆమె ముంబై వచ్చి అనాథ బాలలకు సేవలందించి అందరి ప్రశంసలను అందుకుంది. థానేలో అనాథ బాలికల కోసం నిర్వహిస్తున్న ‘దివ్యప్రభ హోం’కు వెళ్లి స్వచ్ఛందంగా సేవలందించింది. అనాథ బాలలకు సేవ చేయాలన్న తలంపు గత ఏడాది ముంబై వచ్చినపుడే తనలో కలిగిందని, ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని వారి కోసం పని చేయడం తనకు ఎంతో సంతృప్తిని మిగిల్చిందని ఆమె వివరించింది.
సంపన్న కుటుంబంలో పుట్టడంతో తనకు ఎలాంటి బాధలు లేవని, అయితే అనాథ బాలలు ఎన్నో రకాల సమస్యలతో సతమవుతున్నారని తెలిసి తాను స్వచ్ఛంద సేవకు ముందుకు వచ్చానని రేనా తెలిపింది. తన తల్లిదండ్రులు రాహుల్, వైశాలి మొదట విముఖత వ్యక్తం చేసినప్పటికీ, సమాజ సేవ చేసేందుకు చివరికి తనకు అనుమతి ఇచ్చారని ఆమె వివరించింది. పని చేయగలిగే శక్తి సామర్థ్యాలున్నపుడే ఇతరులకు సేవలందించాలని తండ్రి చెప్పిన మాటలు తనలో ఎంతో ధైర్యం నింపాయని రేనా తెలిపింది.
ఇంగ్లీష్‌లో మాట్లాడడం, పర్యావరణ పరిరక్షణ, విజ్ఞానం కోసం ఇంటర్నెట్‌ను వినియోగించడం వంటి విషయాలపై అనాథ బాలికలకు తర్ఫీదు ఇచ్చానని ఆమె తెలిపింది. తొమ్మిది నుంచి పదహారేళ్ల లోపు వయసు కలిగిన బాలికలకు గురువులా పాఠాలు బోధించడం తనకు వింత అనుభూతి కలిగించిందని, విజ్ఞానాన్ని తెలుసుకోవాలన్న ఆకాంక్ష వారిలో ఎంతో బలంగా ఉందని రేనా తన అనుభవాలను వివరిస్తోంది. నాలుగు వారాల పాటు అనాథ శరణాలయంలోనే ఉంటూ బాలికల చేత మొక్కలు నాటించానని, భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేలా అనేక అంశాలను వారికి తెలియజేయడం తనకెంతో ఆత్మసంతృప్తి ఇచ్చిందని అంటోంది. రేనా లాంటి వారు మరింతగా సేవలందిస్తే అనాథ బాలలు ధైర్యంగా జీవించగలుగుతారని ‘దివ్యప్రభ’ నిర్వాహకులు చెబుతున్నారు. విద్య ప్రాముఖ్యత తెలుసుకుంటే అనాథ బాలలైనా అద్భుతాలు సాధిస్తారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనాథ శరణాలయంలో మరుగుదొడ్లకు మరమ్మతులు చేయిస్తానని, బాలికలకు పుస్తకాలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు అందజేసేందుకు అమెరికాలో తాను నిధులు సేకరిస్తానని రేనా చెబుతోంది. ఈసారి సెలవులకు వచ్చేలోగా తాను అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తానని ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
సెలవుల్ని ఎంత సరదాగా గడపాలో నేటి యువతకు ఎవరూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
english title:
s
Date:
Tuesday, July 23, 2013