టంగుటూరు, జూలై 23: మండలంలో మంగళవారం 15 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అన్ని గ్రామాల్లో ఎలాంటి అవాంఛీనయ సంఘటనలు జరుగకుండా సిఐ అశోక్‌వర్థన్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు దూర ప్రాంతాల నుండి వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, వికలాంగులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి సుబ్రమణ్యం, తహశీల్దార్ వందనం పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. మండలంలో జరిగిన 15 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలలో కడపటి సమాచారం మేరకు 8 పంచాయతీలు తెలుగుదేశం పార్టీ, మూడు కాంగ్రెస్, రెండు వైఎస్‌ఆర్‌సిపి దక్కించుకున్నాయి. టంగుటూరు సర్పంచ్‌గా బెల్లం జయంతిబాబు, పొందూరు చిట్టినేని రంగారావు, కాకుటూరివారిపాలెం తెలుగుదేశం పార్టీకి చెందిన లింగాలు, వల్లూరు కాంగ్రెస్ పార్టీకి చెందిన చుండి సుబ్బమ్మ, జయవరం చుండి బంగారు( కాంగ్రెస్), అనంతవరం కసుకుర్తి సుందరరావు వైయస్‌ఆర్‌సిపి, వెలగపూడి డోలా చెన్నకేశవులు టిడిపి, వాసేపల్లిపాడు లింగంగుంట రవి టిడిపి, మల్లవరప్పాడు రాచగర్ల శ్రీలక్ష్మిలు గెలుపొందారు. ఈ ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు డిఎస్‌పి జాషువా, పిటిసి డిఎస్‌పి మురళీధర్, సిఐ అశోక్‌వర్థన్, టంగుటూరు ఎస్‌ఐ వైవి రమణయ్య, జరుగుమల్లి ఎస్‌ఐ షేక్‌షావలి, శింగరాయకొండ ఎస్‌ఐ పాండురంగారావు తదితరులు బందోబస్తు నిర్వహించారు.
కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి
* మాజీఎమ్మెల్యే కెపి కొండారెడ్డి
కొనకనమిట్ల, జూలై 23: మండల కేంద్రమైన కొనకనమిట్ల పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసిన కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారు కళ్లం సుబ్బమ్మ గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మార్కాపురం మాజీఎమ్మెల్యే కెపి కొండారెడ్డి కోరారు. మంగళవారం కొనకనమిట్ల ఎస్సీకాలనీలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద నిధులు మంజూరు చేసి రోడ్ల అభివృద్ధి చేస్తానని, తాగునీటి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. బుట్ట గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజారిటీతో సుబ్బమ్మను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈకార్యక్రమంలో మాజీమున్సిపల్ చైర్మన్ డి నాగూర్‌వలి, నాయకులు పి కొండారెడ్డి, ఎస్ పెద్దవెంకటరెడ్డి, బైరెడ్డి వెంకటరెడ్డి, కె దిబ్బారెడ్డి, ఏసోబు, ఏసు తదితరులు పాల్గొన్నారు.
రిసెప్షెన్ కేంద్రాలను జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయండి
* ఎంపిడిఓను ఆదేశించిన డిప్యూటీ కలెక్టర్ గ్లోరియా
కొమరోలు, జూలై 23: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు మండలపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సరంజామ పంపిణీ కేంద్రాన్ని సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బదిలీ చేయాలని వెలుగొండ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్, గిద్దలూరు నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేక అధికారి పి గ్లోరియా ఎంపిడిఓ విజయకుమార్‌ను ఆదేశించారు. ఆమె కొమరోలుకు మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వాహణకు ప్రభుత్వహైస్కూల్, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న 15పోలింగ్ కేంద్రాలను పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. మండలపరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ విజయకుమార్, తహశీల్దార్ మధుసూదనరావులతో సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో మంగళవారం జరిగిన తొలివిడత పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొన్న జిల్లాకలెక్టర్ విజయకుమార్ కొమరోలు మండలపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సరంజామ పంపిణీ కేంద్రంతోపాటు, ఎన్నికల అనంతరం సిబ్బంది నుంచి తీసుకోవాల్సిన బాక్స్‌లకు ఏర్పాటు చేసే రిసెప్షెన్ కేంద్రాన్ని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తనను ఆదేశించినట్లు తెలిపారు. కేంద్రాల మార్పుకు అవసరమైన ఏర్పాట్లను చేయాల్సిందిగా ఎంపిడిఓ, తహశీల్దార్లను ఆదేశించారు. తాను మండలంలోని పలుపాఠశాలలను సందర్శించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించానని గ్లోరియా తెలిపారు.
కొండపి నియోజకవర్గంలో
60 పంచాయతీల్లో వైఎస్‌ఆర్‌సిపి గెలుపు తథ్యం
ఎంఎల్‌సి జూపూడి ధీమా
మర్రిపూడి, జూలై 23: కొండపి నియోజకవర్గంలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో 60 గ్రామ పంచాయతీల్లో వైఎస్‌ఆర్‌సిపి గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ, కొండపి నియోజకవర్గం వైసిపి ఇన్‌చార్జి జూపూడి ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని చిమట, అయ్యపురాజుపాలెం, జగ్గరాజుపాలెం, మర్రిపూడి, గుండ్లసముద్రం గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బలహీన వర్గాల ప్రజలందరూ జగన్‌కు అండగా నిలుస్తున్నారన్నారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు రాజకీయాలు చేసినా గెలుపు వైయస్‌ఆర్‌సిపిదేనని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల వైసిపి కన్వీనర్ బి రమణారెడ్డి, వైయస్‌ఆర్‌సిపి నాయకులు మాచేపల్లి నాగయ్య, ఆయా గ్రామాల వైసిపి అభ్యర్థులు తదితరులు ఉన్నారు.