హనుమాన్ జంక్షన్, జూలై 30: కొంతమంది రాజకీయ నాయకుల పదవుల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, తెలుగుజాతి ప్రజలను బలిపశువుల్ని చేయవద్దని అఖిలపక్ష నాయకులు, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా హనుమాన్‌జంక్షన్‌లో అఖిలపక్ష నాయకులు, విద్యార్థులు మంగళవారం జాతీయ రహదారిపై రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. స్థానిక అప్పనవీడు జిల్లా పరిషత్ హైస్కూల్, జె.ఎం.జె కళాశాల విద్యార్థినీలు ప్రదర్శన చేస్తూ జంక్షన్ కూడలికి చేరుకున్నారు. అనంతరం మానవహారం నిర్మించి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయవద్దని నినాదాలు చేశారు. కొంతమంది అవకాశవాద రాజకీయాల కారణంగా తెరపైకి వచ్చిన ప్రత్యేక వాదం వలన భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని హెచ్చరించారు. కాగా టిడిపి, విద్యార్థి సంఘాల నాయకులు కూడా జంక్షన్‌లో రాత్రి ఆందోళన నిర్వహించారు. నూజివీడు డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.
214 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
కూచిపూడి, జూలై 30: పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మొవ్వ మండల ఎన్నికల ప్రత్యేకాధికారి గౌసియా బేగం తెలిపారు. మంగళవారం మొవ్వ జెడ్‌పి హైస్కూలలో ఎన్నికల అధికారులు, సహాయ అధికారులకు ఎన్నికల సామగ్రి సరఫరా కార్యక్రమానికి వచ్చిన ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ బుధవారం ఉదయం 7నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఎన్నికల నిర్వహణకు 23 మంది ఎన్నికల అధికారులు, 420 మంది సహాయ, ఉప సహాయ అధికారులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలో 17 సర్పంచ్ పదవులకు, 214 వార్డులలో 37,284 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం 214 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మండలంలో ఎన్నికల పర్యవేక్షణకు ముగ్గురు జోనల్ అధికారులు, ఆరుగురు రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. 214 బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని అందించినట్లు తెలిపారు. 8 మంది మైక్రో అబ్జర్వర్లు, 10 మంది వీడియోగ్రాఫర్లు, మూడు బెటాలియన్ల పోలీసు సిబ్బంది, డిఎస్పీ, సిఐ, ఐదుగురు ఎస్‌ఐలు, ఇద్దరు ఎఎస్‌ఐలు, ఆరుగురు హెచ్‌సిలు, 12 మంది పిసి, 95 మంది వెస్ట్ జోన్ పోలీసులు, 80 మంది హోంగార్డులు నియమితులయ్యారన్నారు. ఎన్నికల పర్యవేక్షకులుగా తహశీల్దార్ జి భద్రు, ఎండివో వై పిచ్చిరెడ్డి, ఎంఇఓ పరసా సోమేశ్వరరావు ప్రత్యేక వాహనంలో పర్యవేక్షిస్తారన్నారు. మధ్యాహ్నం 2గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుందని వివరంచారు.