విజయవాడ , జూలై 30: రాష్ట్ర విభజనపై బెజవాడ బార్ అసోసియేషన్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరిచింది. సమైక్యాంధ్రను కోరుకుంటున్న బార్ న్యాయవాదులు తెలంగాణా ప్రకటనపై నిరసన వ్యక్తం చేశారు. ఈమేరకు బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టా జయకర్ పిలుపు మేరకు మంగళవారం విధులు బహిష్కరించారు. ఎన్నో ఏళ్ళుగా రాష్ట్ర ప్రజలు కలిసి జీవిస్తున్న క్రమంలో తెలుగుజాతిని విడదీస్తూ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడం గర్హనీయమన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విధులు బహిష్కరించడమే కాకుండా నిరసనను మరో మూడు రోజుల పాటు కొనసాగించాలని బార్ తీర్మానించింది. బార్ ఆధ్వర్యాన మంగళవారం బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు, మెజార్టీ సభ్యుల తీర్మానం మేరకు మూడు రోజుల పాటు విధులు బహిష్కరించిన నిరసన వ్యక్తం చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో బార్ అధ్యక్షుడు మట్టా జయకర్, ఉపాధ్యక్షుడు చీదెళ్ళ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి లాం ఇజ్రాయేలు, సీనియర్ న్యాయవాదులు ఏవి రమణ, నరహరశెట్టి శ్రీహరి, గోగుశెట్టి వెంకటేశ్వరరావు సీనియర్, జూనియర్, మహిళాన్యాయవాదులు పాల్గొన్నారు.
3న ఆంధ్రా జెఎసి సమావేశం
పటమట, జూలై 30: యపిఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండు రాష్టల్ర విభజనకు ఏకగ్రీవం తీర్మానం చేయడం పట్ల ఆంధ్రా జాయింట్ యాక్షన్ కమిటీ హార్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు నగరంలో మంగళవారం సాయంత్రం ఆంధ్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర జెఏసి అధ్యక్షులు సుంకర కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆగస్టు 3న ఆంధ్రా జెఎసి అధ్వర్యంలో విజయవాడలో ఆంధ్ర ప్రాంతానికి రావలిసిన వాటాలు విధి విధానాలపై ఆంధ్రా ప్రాంత మేధావులతో నీటి పారుదల నిపుణులతో, రైతాంగ నాయకులతో, టెక్నీషియన్స్,రాజకీయపార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి జాతీయ హోదా కల్పించడంపై కాంగ్రెస్ పార్టీకి, కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 48 సంవత్సరాల నుండి ఆంధ్రా ప్రాంతం నుండి పన్నుల రూపంలో హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందన్నారు. అందువలన జానాభా నిష్పత్తిలో 48 సంవత్సరాలు హైదరాబాద్ మీద వచ్చే ఆదాయం ఆంధ్రా ప్రాంతానికి పంచే విధంగా కేంద్రప్రభుత్వానికి తెలియజేయటం జరిగిందన్నారు.