అనంతపురం, జూలై 31: రాష్ట్ర విభజనతో అనంతలో సమైక్యవాదులు రెచ్చిపోయారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆందోళనలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. నగరంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసం సృష్టించారు. ఉద్యమకారులు విజృంభించడంతో పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. సమైక్య ఉద్యమంలో ప్రజలు, యువత, విద్యార్థులు స్వచ్ఛందంగా పాలు పంచుకున్నారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. జిల్లా కేంద్రంలో రోడ్లపై టైర్లకు నిప్పుపెట్టారు. సప్తగిరి సర్కిల్ నుంచి క్లాక్ టవర్ వరకూ ఉన్న రోడ్డు డివైడర్లను ధ్వంసం చేశారు. సప్తగిరి సర్కిల్‌ని రాజీవ్‌గాంధీ విగ్రహం, టవర్‌క్లాక్ సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహాలను తగులబెట్టారు. అనంతరం వాటిని ధ్వంసం చేశారు. టవర్‌క్లాక్‌పైకి రాళ్లు రువ్వడంతో గడియారులు ధ్వంసమయ్యాయి. ఆర్ట్స్ కళాశాలలోకి ప్రవేశించిన ఉద్యమకారులు, విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఒకదశలో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. రఘువీరా టవర్స్, ఎడిసిసి బ్యాంకు కేంద్ర కార్యాలయం పై రాళ్లు రువ్వారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎస్పీ ఎస్.శ్యామ్‌సుందర్ నగరానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించినా సాయంత్రం వరకూ కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడం గమనార్హం. పరిస్థితి తీవ్రతను గమనించిన ఎస్పీ మూడవ విడత పోలింగ్‌లో ఉన్న బలగాలను జిల్లా కేంద్రానికి తరలించే ప్రయత్నం చేశారు. జిల్లాలో అన్ని ఆర్టీసీ సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. సమైక్యాంధ్ర జెఎసి నాయకులను పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. సమైక్యాంధ్ర జెఎసి ఇచ్చిన మూడు రోజుల బంద్ పిలుపులో మొదటి రోజు బంద్‌ను యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం గమనార్హం. కళ్యాణదుర్గంలో రెవెన్యూమంత్రి రఘువీరారెడ్డి ఇంటిని ముట్టడించిన సమైక్య ఉద్యమకారులు ఆయన ఇంటిపై రాళ్లదాడి చేశారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రిలో ఇదే రకమైన పరిస్థితి ఉంది. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఇందిర, రాజీవ్‌గాంధీ విగ్రహాలను సమైక్యాంధ్ర ఉద్యమకారులు ధ్వంసం చేశారు. ఎక్కడికక్కడ రహదారుల దిగ్బంధం, రాస్తారోకోలు, ధర్నాలు, రైలురోకోలు నిర్వహించారు.
అదనపు బలగాల మోహరింపు
జిల్లా కేంద్రంలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు అదనపు బలగాలను దించాలన్న యోచనలో ఉన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో రెండు కంపెనీల సిఆర్‌పిఎఫ్, ఒక కంపెనీ ఐటిబిపి, ఒక కంపెనీ కర్ణాటక పోలీసు బలగాలు ఉన్నాయి. మొదటి రోజు నిరసనను దృష్టిలో ఉంచుకుని మరోమూడు కంపెనీల బలగాలను జిల్లాకు తరలించే యత్నంలో పోలీసు శాఖ ఉంది. ఇప్పటికే ఐదుగురు అడిషనల్ డిజిలను భద్రత పర్యవేక్షణ కోసం నియమించారు. రాయలసీమ ఐజి ప్రత్యేకంగా అనంతపురం లో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
పల్లె పోరులో సైకిల్ జోరు
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, జూలై 31 : జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన సం‘గ్రామం’లో టిడిపి జోరు కొనసాగించింది. మూడు విడతల్లోనూ తనదైన శైలిలో ఓట్లు సాధించి క్షేత్రస్థాయిలో ఎదురులేదని నిరూపించుకుంది. మూడు విడతల్లో అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఎన్ని పార్టీ లు వచ్చినా క్షేత్రస్థాయిలో తన ఓటు బ్యాంకుకు వచ్చిన ఢోకా ఏమీ లేదని మరోమారు టిడిపి నిరూపించుకుంది. జిల్లాలో మొత్తం 1003 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో రాయదుర్గం మండలం బిఎన్ హళ్లి ఎస్టీలకు రిజర్వు అయ్యింది. అయితే ఇక్కడ ఎవ్వరూ పోటీ చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. 1002 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. అందులో టిడిపి 433 స్థానాలతో మొదటి స్థానంలో నిలిచింది. 261 స్థానాలను కైవసం చేసుకుని వైకాపా రెండవస్థానంలో ఉండగా అధికార పార్టీ 251 స్థానాలతో ఆఖరు స్థానంలో నిలిచింది. సిపిఐ, సిపిఎం చెరో స్థానంలో విజయం సాధించగా వామపక్షాలతో కలిపి స్వతంత్రులు మొత్తం 61 స్థానాలను కైవసం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిడిపి తన ఓటు బ్యాంకును కాపాడుకోవడంతోపాటు మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.
మూడవ విడతలోనూ టిడిపిదే హవా
మూడవ విడత ఎన్నికల్లో టిడిపి తన హవా నిరూపించుకుంది. మొదటి, రెండవ విడతల్లోనూ సాధించిన మాదిరిగానే మూడవ విడతలోనూ అత్యధిక స్థానాలు సాధించి మొదటి స్థానంలోనిలిచింది. మూడవ విడతలో 388 గ్రామ పంచాయతీలకు గాను 43 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 345 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా 88.53 శాతం పోలింగ్ నమోదైంది. టిడిపి 127 గ్రామ పంచాయతీల్లో, వైకాపా 120 స్థానాల్లో, అధికార కాంగ్రెస్ పార్టీ 115 స్థానాల్లో, వామపక్షాలు ఒకటి, స్వతంత్రులు 25 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించారు. అనంతపురం రూరల్‌లోని నారాయణపురం పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడవ విడతలో ఆత్మకూరు, కూడేరు, రాప్తాడు, విడపనకల్, అనంతపురం రూరల్‌లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరువలేదు. శింగనమల నియోజకవర్గంలో కూడా అధికార పార్టీ పరిస్థితి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా అతి తక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం గమనార్హం.
88.53 శాతం పోలింగ్
అనంతపురం సిటీ : అనంతపురం డివిజన్ పరిధిలోని 20 మండలాల్లో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 88.53 శాతం ఓట్లు ప్లోయ్యాయి. అత్యధికంగా శింగనమలలో 92.36 శాతం, అత్యల్పంగా ఉరవకొండలో 78.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుండి ఓటర్లు బారులు తీరి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మండలాల వారిగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అనంతపురం రూరల్‌లో 81, ఆత్మకూరు 90.72, బికె.సముద్రం 88, గార్లదినె్న 90.06, గుత్తి 89, గుంతకల్లు 92, కూడేరు 89.69, నార్పల 91.86, పామిడి 92, పెద్దపప్పూరు 91.25, పెద్దవడుగూరు 90, పుట్లూరు 91.5, రాప్తాడు 90.61, శింగనమల 92.36, తాడిపత్రి 85.32, ఉరవకొండ 78.15, వజ్రకరూరు 86, విడపనకల్లు 89, యాడికి 80.08, యల్లనూరులో 92.18 శాతం ఓట్లు పోలయ్యాయి. 345 సర్పంచ్‌స్థానాలు, 3,845 వార్డులకు బుధవారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ డియస్. లోకేశ్‌కుమార్ తెలిపారు. జెడ్పి సిఇఓ విజయేందిర, ట్రైనీ కలెక్టర్ నాగలక్ష్మి, ఎన్నికల పరిశీలకులు అన్ని మండలాలు విస్తృతంగా పర్యటించి ఎన్నికలను పర్యవేక్షించారు.
ఆగ్రహ జ్వాలలు
అనంతపురం టౌన్, జూలై 31: రాష్ట్ర విభజన సెగలు నగరంలో విధ్వంసానికి దారితీశాయి. యువత ఆగ్రహ జ్వాలకు నగరంలోని రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలు నేలకూలాయి. విధ్వంసానికి అడ్డుతగులుతున్న పోలీసులపైకి రాళ్ళు రువ్వారు. శ్రీకంఠం సర్కిల్‌లో ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఎతె్తైన భవనంపైకి వెళ్ళి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా సన్నిహితులు అడ్డుకుని కిందకు తీసుకువచ్చారు. నలువైపుల నుంచి యువకులు పోలీసులను చుట్టుముట్టి రాళ్ళు రువ్వటంతో వారిని తరిమేందుకు నానాపాట్లు పడ్డారు. ఒక దశలో వారిని నివారించటానికి 13 రౌండ్ల బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆందోళనకారులు రాళ్ళు రువ్వటంతో పలువురు పోలీసులు, పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు గాయపడ్డారు. ఎస్.పి శ్యామ్‌సుందర్‌పై సైతం ఆందోళనాకారులు రాళ్ళు రువ్వారు. అంతటితో ఆగక సప్తగిరి సర్కిల్ నుంచి కూల్చివేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని టవర్‌క్లాక్ వద్దనున్న ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు ఈడ్చుకుంటూ వెళ్ళి టవర్‌క్లాక్ చుట్టూ తిప్పి నిప్పుపెట్టారు. విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోవటానికి యత్నించిన పోలీస్ యంత్రాంగం యువకులు ధాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. ఒక దశలో ఆందోళనకారులను నియంత్రించటం పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారింది. దీనితో చేసేదేమి లేక రాజీవ్‌గాంధీ విగ్రహ విధ్వంసకాండను ప్రేక్షకుల్లా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని కూల్చివేయటంతో ఆగని వారు డివైడర్లను కూల్చివేసింది. అలాగే ట్రాఫిక్ ఐలాండ్లలోని మొక్కలను పీకిపారేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పగులగొట్టింది. అమరవీరుల స్థూపాన్ని సైతం కూల్చివేశారు. పాతవూరులోని మరువవంక పక్కన ఉన్న బిజెపి కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కాంగ్రెస్ భవన్ అద్దాలను పగులగొట్టారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఐదు ఆర్‌టిసి అద్దె వాహనాలను ధ్వంసం చేశారు. టవర్‌క్లాక్ వద్దనున్న లేపాక్షి ఎంపోరియమ్, సిండికేట్ బ్యాంక్ ముందు భాగంలోనున్న నిర్మాణాలను ధ్వంసం చేశారు. అలాగే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని కూరగాయల మార్కెట్, హెడ్ పోస్ట్ఫాస్, బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసులపై దాడికి పాల్పడ్డారు. తహశీల్దార్ కార్యాలయంలోకి దూసుకెళ్ళి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. కుండీలలోని మొక్కలను ధ్వంసం చేశారు. కార్యాలయంలోని ప్రైవేటు వ్యక్తుల బైకులను ధ్వంసం చేశారు. దీంతో వాహన యజమానులు బావురుమన్నారు. ఐదంతస్తుల రఘువీరా టవర్స్‌పై రాళ్ళు రువ్వి అద్దాలను పగులగొట్టారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని డిగ్రీ కాలేజీ అద్దాలను ధ్వంసం చేశారు. కొఠారీ ఫ్యాన్సీ షాపుపైకి రాళ్ళు రువ్వారు. పార్టీలతో ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా యువకులు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయటంతో వారిని నియంత్రించటం ఎవరి తరం కాలేదు. ఉదయం నుంచి సమైక్యాంధ్ర బంద్ పిలుపుకు స్పందించి స్వచ్ఛందంగా షాపులు, టీకొట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేసి మద్దతు ప్రకటించారు. పూలు, పండ్ల దుకాణాలు కూడా మూతబడ్డాయి. ఆటోలు సైతం నడపకపోవటంతో నగరం రోడ్డుల బోసిపోయినట్లైంది. ఆర్‌టిసి బస్సులు, ప్రైవేటు బస్సులు సైతం డిపోల నుంచి బయటకు రాకపోవటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రయాణికులు, రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సర్వీసులైన మెడికల్‌షాపులు సైతం మూసివేయటం విశేషం. ఇరుకు సందులలో సైతం షాపులు, టీకొట్టులు మూసివేశారు. అంతకుముందు ఉదయానే్న కాంగ్రెస్ నేతలు కొందరు సమైక్యాంధ్ర బ్యానర్ పట్టుకుని నగరంలోని సుభాష్ రోడ్డు, రాజూ రోడ్డులో తిరిగారు. శ్రీకంఠం సర్కిల్‌లో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసే ప్రయత్నంలో నాగరాజుకు కాలు విరిగింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో టైర్లను కాల్చివేయటంతో నల్లటి దట్టమైన పొగలు వ్యాపించాయి. డివైడర్లను పగులగొట్టి రోడ్డుకు అడ్డంగా వేసి రాకపోకలకు అవరోధం కలిగింది. ఆందోళనకారులను తరిమికొట్టేందుకు పోలీసులు వాహనాలలో వెంటపడి తరిమారు. అయితే ఆందోళనాకారులు కమలానగర్, గుల్జార్‌పేట సందుల్లోకి పరుగెడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి పంచాయతీ ఎన్నికలు ముగించుకుని పెద్ద ఎత్తున పోలీసు బలగాలు తరలిరావటంతో ఆందోళనకారుల హడావిడి తగ్గింది. ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ విద్యార్థులు సైతం కాలేజీలోకి, బ్రిడ్జిపైకి పరుగులు తీయటంతో వారిని పోలీసులు వెంటపడి తరిమారు. నగరంలో ఆందోళనకారుల ఆగ్రహానికి గురై ప్రధాన వీధులన్నీ రాళ్ళు, రప్పలు, మొక్కలు, విరిగిన అద్దాలు, డివైడర్లు, కడ్డీలతో రణరంగాన్ని తలపింపచేశాయి.
నేడు జిల్లాలో పాఠశాలలకు సెలవు
అనంతపురం సిటీ: సమైక్యాంధ్ర ఉద్యమమంలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ డియస్.లోకేశ్‌కుమార్ సెలవు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం జిల్లా విద్యాధికారి డి.మధుసూదన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు గమనించాలని తెలిపారు.
ఆర్ట్స్ కళాశాలకు వారం రోజులు సెలవులు
సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేటి నుండి ఆర్ట్స్ కళాశాలకు వారం రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రంగస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ట్స్ కళాశాల, హాస్టల్స్‌లో వున్న అందరు విద్యార్థులు ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లాలన్నారు. కళాశాలను, హాస్టల్స్‌ను తిరిగి ఈ నెల 7వ తేదీన తెరవనున్నట్లు ఆయన తెలిపారు. గురువారంఉదయం నుండి ఆర్ట్స్ కళాశాల హాస్టల్‌ను మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ప్రకటన
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణను ప్రకటించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ఆరోపించారు. బుధవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించే ముందు అన్ని ప్రాంతాలను పరిగణలోకి తీసుకోలేదని కేవలం హైదరాబాదుతో కూడిన ప్రజల ఆంకాంక్ష మేరకు తెలంగాణను ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నారాయణస్వామి, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎస్కేయూలో ఆమరణ నిరాహార దీక్షలు
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శ్రీకృష్ణదేవరాయుల విశ్వవిద్యాలయంలో ఉద్యోగ, విద్యార్థి నాయకులు ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. బుధవారం ఉదయం 6 గంటలకే జాతీయ రహదారిపై అడ్డంగా రాళ్లు వేసి ఎటువంటి వాహనాలు తిరిగకుండా బంద్ చేశారు. అంతకుముందు యూనివర్సిటీలో అన్ని విభాగాలు స్వచ్ఛందంగా బంద్ చేసి జాతీయ రహదారిపైకి వచ్చారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ప్రకటనను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్తులో జరగబోవు ఉద్యమాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం జెఎసి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేయూ అధ్యాపక, ఉద్యోగ, విద్యార్థి జెఎసి ప్రొఫెసర్లు సదాశివరెడ్డి, రాజేశ్వరరావు, ప్రతాప్‌రెడ్డి, నాగయ్య, కేశవరెడ్డి, రామకృష్ణ, వెంకటరాముడు, సూర్యనారాయణ, రాము, విద్యార్థి నాయకులు పరుశురాంనాయ