అమలాపురం, జూలై 31: పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. తుది విడత ఎన్నికలు జరిగిన అమలాపురం డివిజన్‌లోని 249 గ్రామ పంచాయతీలకు బుధవారం జరిగిన ఎన్నికలు స్వల్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. డివిజన్‌లో 81.91 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తొలి రెండు విడతల కంటే ఎక్కువ స్థానాలు అమలాపురం డివిజన్‌లో నమోదుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 100కి పైగా సానుభూతిపరులు విజయం సాధించారు. టిడిపి ఈసారి కూడా రెండవ స్థానానికి పరిమితమైంది. వైఎస్సార్‌సిపి పరిస్థితి మరింత దారుణంగా దిగజారింది. అమలాపురం డివిజన్‌పై గంపెడాశలు పెట్టుకున్న వైఎస్సార్‌సిపి కేవలం మూడు పదులు కూడా పొందలేక చతికిల పడింది. స్వయంగా జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి నాయకత్వం వహిస్తున్న అమలాపురం డివిజన్‌లో ఆ పార్టీకి లభించిన స్థానాలు పార్టీ పరిస్థితిని తేటతెల్లం చేసాయి. స్వతంత్రులు సాధించిన స్థానాల్ని కూడా ఆ పార్టీ సాధించలేక పోయింది. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం నియోజకవర్గంలో ఆశించిన ఫలితాలు పొందలేకపోయారు. మొత్తం 60 పంచాయతీలకు గాను ఆయన వర్గీయులు 24 చోట్లే విజయం సాధించారు. మిగిలిన చోట్ల టిడిపి తన సత్తా చాటింది. ఈదరపల్లి పంచాయతీలో మంత్రి అనుచరుడు నక్కా సంపత్‌కుమార్ తీవ్రమైన పోటీలో ప్రత్యర్థుల్ని ఎదుర్కొని విజయం సాధించారు. గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి స్వగ్రామం వేగివారిపాలెంలో టిడిపి విజయం సాధించింది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వగ్రామం చింతలమోరిలో టిడిపి అభ్యర్థి కారుపల్లి విజయమోహన్ ఘనవిజయం సాధించారు. టిడిపికి చెందిన వివిఎస్ గోపాలరావు శంకరగుప్తం సర్పంచ్‌గా ఎన్నిక కాగా, ఆయన కుమార్తె నాగలక్ష్మి పడమటిపాలెం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రతిష్టాత్మకమైన కాట్రేనికోన పంచాయతీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి నాగిడి నాగేశ్వరరావుపై కాంగ్రెస్ బలపరిచిన శ్రీ రాజా కాకర్లపూడి లక్ష్మీకాంతరాజు( రాంబాబు) 1300 ఓట్లతో ఘనవిజయం సాధించారు. ఇలా రికార్డుస్థాయి విజయాలు ఎన్నో నమోదయ్యాయి. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమలాపురం డిఎస్పీ కె రఘు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
పంచాయతీల వారీగా విజేతల వివరాలు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జూలై 31: తుది విడత అమలాపురం రెవెన్యూ డివిజన్‌లో మొత్తం 272 పంచాయితీలకు గాను 249 పంచాయతీల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 97 స్థానాలు దక్కించుకుని తన పట్టును నిరూపించుకుంది. తెలుగుదేశం పార్టీకి 73, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30, ఇతరులకు 43 స్థానాలు అమలాపురం మండలంలో 22 పంచాయతీలుండగా కాంగ్రెస్‌కు 11 పంచాయతీలు దక్కగా, తెలుగుదేశం పార్టీకి 10, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 1 స్థానాలు దక్కాయి. ముమ్మిడివరం మండలంలో 16 పంచాయతీల్లో కాంగ్రెస్ 6, తెలుగుదేశం 4, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 2, ఇతరులు 4పంచాయతీల్లో విజయం సాధించారు. ఐ పోలవరం మండలంలో 14 పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీకి 8, టిడిపికి 3 దక్కాయి. కాట్రేనికోన మండలంలో 16 పంచాయితీల్లో కాంగ్రెస్ 3, టిడిపికి 3, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 1, ఇతరులు 9 పంచాయతీల్లో విజయం సాధించారు. ఉప్పలగుప్తం మండలంలో 17 పంచాయతీలకు కాంగ్రెస్‌కు 5, తెలుగుదేశం 11, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. అలాగే అయినవిల్లి మండలంలో 21 పంచాయతీలకు కాంగ్రెస్ 9, తెలుగుదేశం 6, వైఎస్సార్ కాంగ్రెస్ 5, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. అల్లవరం మండలంలో 21 పంచాతీయతీలకు గాను కాంగ్రెస్‌కు 8. టిడిపికి 6, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 2, ఇతరులకు 5 పంచాయతీలు దక్కాయి. అంబాజీపేట మండలంలో కాంగ్రెస్‌కు 5, తెలుగుదేశం పార్టీకి 6, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 2, ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు. డి గన్నవరం మండలంలో 20 పంచాయతీలకు కాంగ్రెస్‌కు 10, టిడిపికి 4, ఇతరులు 4 పంచాయతీలో విజయం సాధించారు. కొత్తపేట మండలంలో 10 పంచాయతీలకు గాను కాంగ్రెస్‌కు 5. టిడిపి 1, వైఎస్సార్ కాంగ్రెస్ 2, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. రావులపాలెం మండలంలో 12 పంచాయతీలకుగాను కాంగ్రెస్‌కు 3, టిడిపికి 2, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 3, ఇతరులు ఒక పంచాయతీలో విజయం సాధించారు. ఆత్రేయపురం మండలంలో 17 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్‌కు 12, టిడిపికి 1, వైఎస్సార్ కాంగ్రెస్ 4కు 4 స్థానాలు దక్కాయి. రాజోలు మండలంలో 16 పంచాయతీలకుగాను కాంగ్రెస్‌కు 4, టిడిపికి 6, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 1, ఇతరులు 5 పంచాయతీల్లో గెలుపొందారు. మలికిపురం మండలంలో 20 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 8, టిడిపికి 7, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 3, ఇతరులు రెండు పంచాయతీల్లొ విజయం సాధించారు. సఖినేటిపల్లి మండలంలో 16 పంచాయతీలకు కాంగ్రెస్‌కు 7, టిడిపికి 4, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మామిడికుదురు మండలంలో 18 పంచాయతీలకు గాను కాంగ్రెస్‌కు 6, టిడిపికి 3, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 1, ఇతరులు 8 పంచాయతీల్లో విజయం సాధించారు.
బంద్ సంపూర్ణం
*ఉద్యోగ, విద్యార్థి వర్గాల ఆందోళన *ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్
పత్తా లేని తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జూలై 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉద్యోగ, విద్యార్థి జెఎసి పిలుపుమేరకు జిల్లాలో బుధవారం బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు రాజకీయ పార్టీల నుండి నామమాత్రపు స్పందన కానరాగా, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రథాన కూడళ్ళలో మానవ హారాలు, రాస్తారోకోలతో ఉద్యోగ, విద్యార్ధి సంఘాలు నిరసన నిర్వహించాయి. ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. అధికార కాంగ్రెస్, ప్రథాన ప్రతిపక్షం తెలుగుదేశం సహా ఇతర రాజకీయ పార్టీల నేతల పాత్ర ఈ బంద్‌లో నామమాత్రంగా కనిపించినప్పటికీ, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున (మిగతా 6వ పేజీలో)
ఆందోళన నిర్వహించాయి. జై సమైక్యాంధ్ర పేరుతో జిల్లా కేంద్రంలో సోనియాగాంధీ, కె చంద్రశేఖరరావు తదితరుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సినిమా హాళ్ళలో నాలుగు ఆటలనూ రద్దు చేసినట్టు బోర్డులు వ్రేలాడదీశారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. అయితే బస్సులు మధ్యాహ్నం నుండి యధావిధిగా తిరిగాయి. కాగా బంద్ పట్ల అధికార కాంగ్రెస్ నేతలు కాస్త ఆలస్యంగానే స్పందించారు. కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పంతం నానాజీ, కాకినాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కంపర రమేష్, పిసిసి కార్యదర్శులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, విలియం హ్యారీ తదితరుల ఆధ్వర్యంలో భానుగుడి జంక్షన్‌లో ప్రదర్శన నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు బంద్ నేపథ్యంలో పత్తా లేకుండా పోయారు. గతేడాది సమైక్యాంధ్ర ఉద్యమానికై రాజకీయ పార్టీలతో ఉమ్మడివేదికపై నిలచి ఆందోళన చేపట్టిన టిడిపి నేతలు తీరా ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ప్రకటన వచ్చేసరికి మొహాలు చాటేయడం విశేషం! వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి సమైక్యాంధ్రకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఇంతకు ముందే సమైక్యాంధ్రకు మద్దతుగా తమ పార్టీ సీమాంధ్ర శాసన సభ్యులు రాజీనామాలు సమర్పించారని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం ఆందోళన నేపథ్యంలో పత్తా లేకుండా పోయారు. జిల్లాలోని ప్రజాప్రతినిధుల స్పందన కూడా బంద్ నేపథ్యంలో అంతంతమాత్రంగా కనిపించింది. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ తాళం వేసి తన నిరసన తెలియజేశారు. హస్తకళల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు పంతం నానాజీ, కాకినాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కంపర రమేష్, పిసిసి కార్యదర్శులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, విలియం హ్యారీ, మాజీ కార్పొరేటర్ బసవా చంద్రవౌళి నేతృత్వంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నా నిర్వహించి, బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. బంద్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భారీ పోలీసు పహారా నిర్వహించారు. ప్రత్యేక సాయుధ దళాలు, కేంద్ర బలగాల గస్తీని ముమ్మరం చేశారు.
తెలంగాణ ప్రకటనతో యువకుడు ఆత్మహాత్యాయత్నం
సామర్లకోట, జూలై 31: ప్రత్యేక తెలంగాణ ప్రకటించడాన్ని తట్టుకోలేక సామర్లకోట భాస్కర్‌నగర్ కాలనీకి చెందిన యువకుడు బోయిన బాబి (23) బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సేపేని సురేష్ ఇచ్చిన సమాచారం ప్రకారం బుధవారం ఉదయం సమైక్యాంద్రాకు మద్దతుగా నిర్వహించిన తమ పార్టీ ఆందోళనలో పాల్గొన్న బాబీ మద్యాహ్నం ఇంటికి వెళ్లి పురుగులమందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు హుటాహుటిన అతడిని తొలుత పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తదుపరి మెరుగైన వైద్య చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయమై స్థానిక పోలీసులను వివరణ కోరగా, పూర్తి వివరాలు తెలియదని, అయితే తమకు ప్రాథమిక సమాచారం ఉందని చెప్పారు.
హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవికి పంతం రాజీనామా
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జూలై 31: ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నేత పంతం నానాజీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. సమైక్యాంధ్రగానే రాష్ట్రాన్ని కొనసాగించాలన్న డిమాండ్‌తో తన పదవికి రాజీనామా చేసినట్టు ఆయన బుధవారం రాత్రి ఆంధ్రభూమి ప్రతినిధికి ఫోన్ ద్వారా తెలియజేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేసేందుకు హుటాహుటీన నానాజీ హైదరాబాద్ వెళ్ళారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పించేందుకు ప్రయత్నించిన తనను సిఎం వారించినట్టు ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర కోసం తన దారిలోనే జిల్లాకు చెందిన నేతలు పయనిస్తారన్న విశ్వాసం ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో గురువారం భవిష్యత్ కార్యాచరణపై సీమాంధ్ర మంత్రుల సమావేశం జరుగనున్న నేపథ్యంలో వారు తీసుకోనున్న నిర్ణయంపైనే కార్యాచరణ ఆధారపడి ఉంటుందన్నారు. ఆ తర్వాత రాజీనామాలు చేసేవారి సంఖ్య పెరగవచ్చని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో సమైక్యవాదులు రాష్ట్రాన్ని విభజించేందుకు అంగీకరించరని పంతం అన్నారు. కాగా పంతం హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు గడవకముందే రాజీనామా చేయడం గమనార్హం! ఈనెల మొదటి వారంలో ఆయన హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే!
జిల్లా కాంగ్రెస్‌కు రాజీనామాల ఒత్తిడి
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న నాయకులు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జూలై 31: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అన్ని స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తల నుండి రాజీనామాల ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమే కీలకంకావటంతో, ఆ పాపాన్ని తాము మోయలేమంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. టిటిడి పాలకవర్గ సభ్యుడు, మాజీ ఎంపి చిట్టూరి రవీంద్ర తన అనుచరులతో కలిసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, టిటిడి బోర్డు పాలకవర్గ సభ్యత్వ పదవికి రాజీనామాచేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. పైపెచ్చు రాజానగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఉన్న కాంగ్రెస్ జెండాను తానే స్వయంగా తొలగించి, రాష్ట్ర విభజన పట్ల తనకున్న తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేసారు. పార్టీలో ఉంటూ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాల్లో భాగస్వాములయ్యే కన్నా, పార్టీ నుండి బయటకొచ్చి సమైక్యాంధ్రను కాపాడుకునేందుకు పోరాటం చేయటమే మంచిదన్న అభిప్రాయానికి వీరంతా వచ్చారు. ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ తన శాసనసభ్యత్వ పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానిక రాజీనామాచేసినట్టు ప్రకటించిన సంగతి విదితమే. రాజమండ్రిలోని హితకారిణి సమాజం చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడ్డిగ శ్రీనివాస్ రాజీనామా చేసారు. అయితే పార్టీ సభ్యుడిగా కొనసాగుతానని ఆయన ప్రకటించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కూడా తమ పార్టీ పదవులకు, నియోజకవర్గ స్థాయిలోని నామినేటెడ్ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. దాంతో జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా తయారయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు నచ్చచెప్పుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్‌లోనే ఉండి, పరిణామాలను సమీక్షించుకుంటున్నారు. జిల్లాకు వచ్చి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక కొంత మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే మకాం చేసారు. జిల్లాకు చెందిన మంత్రులు తోట నరసింహం, పినిపె విశ్వరూప్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని మంత్రి తోట నరసింహం చెప్పారు. పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ధైర్యంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో బహిరంగంగా పాల్గొంటుంటే, పార్టీలోనే కొనసాగుతున్న నాయకులు మాత్రం అంతర్మథనంతో లోలోపల తీవ్ర వేదనకు గురవుతున్నారు.
3దేశం2 పరిస్థితీ అంతే!
తెలుగుదేశం పార్టీలోని నాయకులు, కార్యకర్తల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. అయితే పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించి పార్టీ నుండి బయటకు రావటమా? లేక పార్టీలోనే ఉంటూ సమైక్యాంధ్ర కోసం ఉద్యమించటమా? అనే అంశంలో స్పష్టమైన నిర్ణయానికి రాలేక 3దేశం2 నాయకులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. విలేఖర్ల సమావేశాలు ఏర్పాటుచేసి, తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తంచేసే పనిలో దేశం నాయకులు ఉన్నారు.
జెండా పీకేశారు!
*రాజానగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ
*మూకుమ్మడి రాజీనామాలు చేసిన నేతలు, కార్యకర్తలు
కోరుకొండ, జూలై 31: రాజానగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలంతా బుధవారం మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు, మాజీ ఎంపి, టిటిడి ట్రస్టు బోర్డు సభ్యుడు చిట్టూరి రవీంద్ర టిటిడి పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలోని పార్టీ జండాను రవీంద్ర స్వయంగా పీకేశారు. అంతకుముందు మండల కేంద్రమైన కోరుకొండలో, రాజానగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం రాజానగరం నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం కాంగ్రెస్ పార్టీ, టిటిడి బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాజకీయ కోణంలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణాను విడగొట్టిందని విమర్శించారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు చెప్పిన విషయాలను పక్కన పెట్టి సోనియాగాంధీ తెలంగాణా ఇచ్చారని, పార్టీలో ఉంటే అవును అనాలని, పార్టీలో లేకుంటే అది తప్పు అని చెప్పవచ్చని, అందుకే రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. పార్టీలు, పదవుల కంటే రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు ముఖ్యమన్నారు. అదే విధంగా శాంతియుత పోరాటాల ద్వారా ఉద్యమాలు చేసి సోనియా దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. ఆయనతో పాటు మొత్తం నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్-1 అధ్యక్షులు, కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించడంతో రాజానగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింది.
విధులకు 5వరకు న్యాయవాదులు గైర్హాజరు
-- న్యాయవాదుల జెఎసి ఆవిర్భావం--
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జూలై 31: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆగస్టు 5వరకు న్యాయవాదులు విధులకు గైర్హాజరవ్వాలని జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ల అధ్యక్షులతో జరిగిన సమావేశం తీర్మానించింది. బుధవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ హాలులో జరిగిన సమావేశానికి రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిఎల్‌ఎన్ ప్రసాద్ అధ్యక్షతవహించారు. రాష్ట్ర విభజనకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ పదవులకు రాజీనామాచేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులకు సమావేశం అభినందించింది. మిగిలిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా అదే బాటలో నడవాలని కోరుతూ సమావేశం తీర్మానించింది. సీమాంధ్రలో మొహరించిన పారా మిలటరీ దళాలను ఉపసంహరించాలని, వెంటనే వివిధ అధికారిక పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని కోరుతూ సమావేశం తీర్మానించింది. సమావేశంలో బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, గోకుల్ కృష్ణ, కె మల్లపరాజు, పి భానుమూర్తి, జవహర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల జెఏసి ఆవిర్భావం
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించేందుకు న్యాయవాదుల జాయింట్ ఏక్షన్ కమిటీని సమావేశం ఎన్నుకుంది. జెఏసికి బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, కాకినాడకు చెందిన గోకుల్ కృష్ణ కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. సభ్యులుగా జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వ్యవహరిస్తారు.
హితకారిణి సమాజం చైర్మన్ పదవికి బుడ్డిగ రాజీనామా
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హితకారిణి సమాజం చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బుడ్డిగ శ్రీనివాస్ బుధవారం ప్రకటించారు. తాను పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనను అడ్డుకునే విషయంలో విఫలమయిన నేపథ్యంలో, కనీసం ఇప్పుడయినా అన్ని పార్టీల నాయకులు రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, ఏకతాటిపైకి రావాలని బుడ్డిగ పిలుపునిచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజనను ఎలాగూ అడ్డుకోలేమని, అయితే మెరుగైన ప్యాకేజిని సాధించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కలిసి ఉద్యమించాలన్నారు. రాష్ట్ర విభజన జరగటం వల్ల హైదరాబాద్‌లోని ఐఐటి, వరంగల్‌లోని ఎన్‌ఐటిల్లో ఆంధ్ర ప్రాంత విద్యార్ధులు స్థానికేతరులవుతారని, ఇలాంటి అనేక సమస్యలను ఆంధ్ర ప్రాంత విద్యార్ధులు ఎదుర్కొంటారని బుడ్డిగ ఆందోళన వ్యక్తంచేసారు. కేంద్రప్రభుత్వం ఒత్తిడి తీసుకురావటం ద్వారా మన విద్యార్ధులకు మెరుగైన విద్యాసౌకర్యాలను అందించాల్సిన బాధ్యత అన్ని పార్టీల నాయకులపైనా ఉందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాల పేరుతో సీమాంధ్ర ప్రాంత విద్యార్ధులను రోడ్లపైకి తీసుకురావటం, చదువులకు నష్టం కలిగించటం వంటి చర్యలకు దిగకుండా, రాజకీయపార్టీలే పూర్తి బాధ్యతను తీసుకోవాలని, రాష్ట్ర విభజన ద్వారా ఇప్పటికే నష్టపోతున్న విద్యార్ధులకు ఇక నష్టం కలుగకుండా విద్యాసంస్థలు కొనసాగనివ్వాలని సూచించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఇక పన్నులు చెల్లించకూడదని చైర్మన్ బుడ్డిగ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే చెందేలా పన్నులు చెల్లించాలన్నారు. విభజన ప్రక్రియ పూర్తికాక ముందు పన్నులు చెల్లిస్తే, ఆ పన్నులు ఉమ్మడి రాష్ట్రానికి చెందుతాయన్నారు. మన రాష్ట్రానికి అవరమైన వౌలిక సౌకర్యాలను కల్పించుకునేందుకు మనం చెల్లించే పన్నులు ఉపయోగపడాలన్నారు.
బాహాబాహీకి సిద్ధమైన నాయకులు
రాజమండ్రి: రాష్ట్ర విభజన ప్రధాన పార్టీల నాయకుల మధ్య తీవ్రస్థాయిలో చిచ్చుపెట్టింది. రాష్ట్ర విభజనకు కారణమంటూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు టిడిపి కార్యాలయం వద్ద, వైఎస్సార్‌సిపి కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక పోలీసులు, ఎపిఎస్పీ బలగాలు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. లేనిపక్షంలో ఆయా పార్టీల నాయకుల మధ్య బాహాబాహీ జరిగేది. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి గురువారం మధ్యాహ్నం విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఎన్‌ఎస్‌యుఐ నాయకుడు ఎస్‌ఏకె అర్షద్ ఆధ్వర్యంలో యువకులు మోటార్‌సైకిళ్లపై ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకుని పెద్దగా హారన్లు మోగిస్తూ టిడిపి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిడిపి నాయకులు పాలిక శ్రీను, తలారి భాస్కర్ వారిని హెచ్చరించి పంపించి వేశారు. విలేఖర్ల సమావేశానంతరం మళ్లీ వచ్చిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ హారన్లు మోగిస్తూ నినాదాలు చేయడంతో గోరంట్ల, నగర టిడిపి అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు తదితరులు వారి వద్దకు వచ్చి కాంగ్రెస్ ఎంపి, సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వాలని, ఎంపి ఇంటికి వెళ్లి ధర్నా చేయాలని ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. దీంతో కార్యకర్తలు, నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. గోరంట్ల, వాసిరెడ్డి తదితరులు ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలతో వాగ్వివాదం చేయడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఇరువర్గాలు బాహాబాహీకి సిద్ధమయ్యాయి. స్వయంగా గోరంట్ల ఆగ్రహంతో ముందుకు కదలడంతో మిగిలిన నాయకులు కూడా ఆయన వెంట యువజన కాంగ్రెస్ కార్యకర్తలతో బాహాబాహీకి సిద్ధమయ్యారు. గోరంట్ల యువజన కాంగ్రెస్ నాయకులతో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఈదశలో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను విడదీసేందుకు ప్రయత్నించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. టిడిపి నాయకులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలను కొద్దిదూరం వరకు తోసుకుంటూ వెళ్లారు. కొద్దిసేపటి తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. డిఎస్పీ ఎన్ బాబ్జి, సిఐలు పరిస్థితిని చక్కదిద్దారు. ఈసమాచారం అందుకున్న పలువురు టిడిపి మాజీ కార్పొరేటర్లు, వారి అనుచరులు అక్కడికి చేరుకుని అర్షద్, కాంగ్రెస్ కార్యాలయంపై దాడికి సిద్ధమయ్యారు. ఈవిషయం తెలుసుకున్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్ గోరంట్లకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పడంతో టిడిపి నాయకులు కొంత శాంతించారు. ఆతరువాత గోకవరం బస్టాండ్ వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మను టిడిపి నాయకులు తగులబెట్టి, ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, వైఎస్సార్‌సిపి నాయకులు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు, జక్కంపూడి రాజా తదితరులు తమ ర్యాలీలో భాగంగా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయానికి చేరుకుని సోనియాగాంధీకి, ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక ఆకతాయి పక్కనే ఉన్న కాంగ్రెస్‌నాయకులతో కూడిన భారీ ఫ్లెక్సీని చింపివేశాడు. దీంతో అప్పటి వరకు కార్యాలయంలో ఉండి గమనిస్తున్న కాంగ్రెస్ నాయకులు నక్కా శ్రీనగేష్, ప్రసాదుల హరినాధ్, అల్లు బాబి కె హారిక తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హారిక ఆకతాయిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను విడదీశారు. అనంతరం వైఎస్సార్‌సిపి నాయకులు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. కొద్దిసేపటి తరువాత వారు తిరిగి వెళుతున్న సమయంలో ఒక యువకుడు ఉండవల్లిని వ్యక్తిగతంగా దూషించడంతో కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హారిక, నక్కా, ప్రసాదుల తదితరులు పరుగున వెళ్లి వైఎస్సార్‌సిపి నాయకులతో వాగ్యుద్ధానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య బాహాబాహీ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నాయకులు ఒక కార్యకర్తను కొట్టినంత పనిచేశారు. దీంతో మరోసారి పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను విడదీశారు. వైఎస్సార్‌సిపి నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు.
అమలాపురం: కాంగ్రెస్ పార్టీ తెలంగాణాకు అనుకూలంగా చేసిన ప్రకటన పట్ల సీమాంధ్రలో నిరసన జ్వాలలు రగులుతున్నాయి. తెలంగాణా ప్రకటన పట్ల నిరసనగా సీమాంధ్ర అంతటా నిరవధిక బంద్ జరుగుతుండగా బుధవారం కోనసీమలో నిరసనకారులు పలుచోట్ల నిప్పు పెట్టారు. కాంగ్రెస్ వైఖరి పట్ల తీవ్ర ఆవేదన చెందిన వారు పత్రికల్లో రాయలేని భాషలో దూషిస్తూ మోటారు సైకిళ్లపై తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. షాపులు తెరిచిన చోట్ల వ్యాపారస్తులతో తీవ్ర వాగ్వివాదాలు జరిగాయి. స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో టైర్లను గుట్టలుగా పోసి నిప్పు పెట్టారు. సిఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి కేంద్ర బలగాలతో మోహరించి టైర్లకు నిప్పు పెట్టకుండా అడ్డుకున్నప్పటికీ ఆందోళనకారులు శాంతించలేదు. జెఎసి ఛైర్మన్ విఎస్ దివాకర్, సిఐ శ్రీనివాసరెడ్డిలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదాలు జరిగాయి. హద్దుమీరితే అరెస్టులు చేస్తామని సిఐ హెచ్చరించగా, అరెస్టులేమిటి సమైకాంధ్ర కోసం మా ప్రాణాలే ఇస్తామంటూ ఆందోళనకారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ఆందోళనకారులు మోటారు సైకిళ్లపై తిరుగుతూ నానా హంగామా సృష్టించారు. కాంగ్రెస్‌ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. పట్టణంలో ఎక్కడ చూసినా టైర్లను అంటించటంతో మంటలు పెద్ద ఎత్తున రేగాయి. రావణ కాష్టాన్ని తలపించిన ఈ దృశ్యాలు చూసి మా రాష్ట్రాన్ని విడదీస్తారా అంటూ నిరసనకారులు గుండెలు బాదుకుంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పలువురు కార్యకర్తలు ఎత్తయిన భవనాలు, టవర్లు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించటంతో వారిని కిందికి దించటానికి పోలీసులు, జెఎసి నాయకులు, కార్యకర్తలు నానా తంటాలు పడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర బలగాల్ని భారీ సంఖ్యలో మోహరించి లాఠీఛార్జి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆందోళన కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు, జెఎసి ఛైర్మన్ విఎస్ దివాకర్, మాజీ ఛైర్మన్ జంగా బాబూరావు, వి రామలింగరాజు, ఎయు పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బండారు రామ్మోహనరావు, ఎం వేణుగోపాల్, ఎం గోపాలకృష్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, వర్రే శేషు, అల్లాడ శరత్‌బాబు, నల్లా చిట్టిబాబు, బెజవాడ సత్తిబాబు, నల్లా విష్ణుమూర్తి తదితరులు నాయకత్వం వహించారు.
చివరి దశ ఎన్నికల్లో వెబ్‌కాస్టింగ్ విజయవంతం
325 కెమేరాల ద్వారా పర్యవేక్షణ
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జూలై 31: అమలాపురం రెవెన్యూ డివిజన్‌లోని పంచాయతీలు, రంపచోడవరం డివిజన్ పరిధిలోని 7 గ్రామ పంచాయతీలకు బుధవారం నిర్వహించిన చివరి దశ ఎన్నికలను పర్యవేక్షించేందుకై ఏర్పాటుచేసిన వెబ్‌కాస్టింగ్ ప్రక్రియ విజయవంతమైంది. ఆయా డివిజన్ల పరిధిలో మొత్తం 325 వెబ్ కెమేరాల ద్వారా పోలింగ్ ప్రక్రియను అధికార్లు నిశితంగా గమనించారు. జిల్లాలో రాజమండ్రి, రంపచోడవరం డివిజన్లలో నిర్వహించిన తొలి దశ ఎన్నికల్లో సుమారు 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ప్రక్రియకు విఘాతం ఏర్పడిన విషయం తెలిసిందే! భారీ వర్షాలు, వరదల తాకిడికి వెబ్‌కాస్టింగ్ వ్యవస్థ దెబ్బ తినడంతో ఎన్నికల యంత్రాంగం మలి దశ ఎన్నికల్లో అప్రమత్తమైంది. తాజాగా నిర్వహించిన మూడో దశ ఎన్నికల్లో వెబ్ కెమేరాలు నూరు శాతం పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. అమలాపురం, రంపచోడవరం డివిజన్లలోని అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 నుండి పోలింగ్ ప్రారంభమైంది. 7.30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వెబ్ కెమేరాల కను సన్నల్లో పోలింగ్ జరిగింది. వెబ్ కాస్టింగ్ నిర్వహణకు బ్రాడ్‌బ్యాండ్, వైర్‌లెస్ లోకల్ లూప్, జనరేషన్ కనెక్టివిటీ విధానాల్లో కనెక్టివిటీని ఏర్పాటుచేశారు. ఉదయం 7.30 గంటలకే 215 వెబ్‌కాస్టింగ్ కెమేరాలు ఆన్‌లైన్ కాగా మిగిలినవి అర్ధగంట వ్యవధిలో ఆన్‌లైన్ కాబడి ఆయా పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ విజయతంతమైంది. జరుగుతున్న పోలింగ్ సరళి మొత్తాన్ని జిల్లా ఎన్నికల అధికార్లు కలెక్టరేట్ నుండి వీక్షించారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యాలయానికి వెబ్‌కాస్టింగ్ వ్యవస్థను అనుసంధానించారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ జరుగుతున్న తీరును హైదరాబాద్‌లో ఎన్నికల కమీషన్ అధికార్లు వీక్షించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు.
ఆకట్టుకున్న సైకత శిల్పం
కాకినాడ రూరల్, జూలై 31: కాకినాడ సాగరతీరం సైకత శిల్పాలకు కేరాఫ్ అడ్రసుగా మారింది. బుధవారం సాగర తీరంలో ఉప్పాడకు చెందిన ఉమ్మడి గోవింద్ భరతమాత విగ్రహాన్ని రూపొందించాడు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడిపోవడాన్ని ఆయన సైకత శిల్పంలో చూపించి నిరసన వ్యక్తం చేశాడు. దేశ చిత్రపటంలో భరతమాతకు ఉన్న ప్రాచుర్యాన్ని వివరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.