గుంటూరు, జూలై 31: యుపిఎ ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర కోరుతూ విద్యార్థి జెఎసి, సమైక్యాంధ్ర జెఎసి, వివిధ రాజకీయ పక్షాలు బుధవారం తలపెట్టిన బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. బంద్‌లో విద్యార్థి, సమైక్యాంధ్ర జెఎసి నాయకులతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, పలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. నగరంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు, వాణిజ్య, వ్యాపారరంగ సముదాయాలు, బ్యాంకులు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు పూర్తి మద్దతు తెలిపి, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ముక్తకంఠంతో గర్హించారు. నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించి యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు, పాలాభిషేకాలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. కాగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి సమైక్యాంధ్ర బంద్‌కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తన మద్దతుదారులతో కలిసి నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించి రాష్ట్ర విభజన పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేత క్రోసూరి వెంకట్ తదితరుల ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన నిర్వహించి, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. లక్ష్మీపురంలోని మదర్‌థెరిస్సా విగ్రహం సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి సమైక్యానికి మద్దతు తెలిపారు. కాగా గురువారం కూడా సమైక్యాంధ్రను కోరుతూ బంద్‌ను కొనసాగించనున్నట్లు ఆయా పార్టీల నాయకులు ప్రకటించారు.
రాష్ట్ర విచ్ఛిన్నానికి బాబు, జగన్‌లే కారణం: ఎమ్మెల్యే మస్తాన్‌వలి
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్‌ఆర్ సిపి అధినేత జగన్‌లు అనుసరించిన ద్వంద విధానాల వల్లే రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు షేక్ మస్తాన్‌వలి ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో నిర్వహించిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్ సెంటర్, కొత్తపేట, నాజ్‌సెంటర్, వెంకటేశ్వరా విజ్ఞాన మందిరం మీదుగా, హిందూ కాలేజ్ సెంటర్‌కు చేరుకుని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మస్తాన్‌వలి మాట్లాడుతూ ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి టిడిపి లేఖలు ఇవ్వడం, తెలంగాణాలో ఓట్ల కోసం జిమ్మిక్కులకు పాల్పడి రాష్ట్ర విభజనకు కారకులయ్యారన్నారు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్ తెలుగు ప్రజల ఐక్యతకు కృషిచేస్తే చంద్రబాబు నాయుడు తెలుగుజాతి విచ్ఛిన్నానికి కారకుడయ్యారని దుయ్యబట్టారు. స్వార్ధపూరిత రాజకీయాలు, దమననీతి, కుట్రపూరిత ఆలోచనలతోనే ప్రతిపక్షాలు రాష్ట్ర విభజనకు కారణమయ్యాయని దుయ్యబట్టారు. ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, మాదా రాధాకృష్ణమూర్తి, బిట్రగుంట మల్లిక తదితరులు ఎమ్మెల్యే వెంట బంద్‌లో పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ సిపి ఆధ్వర్యంలో...
వైఎస్‌ఆర్ సిపి నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర విభజనకు నిరసనగా నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించిన అనంతరం శంకర్‌విలాస్, హిందూ కాలేజీ సెంటర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వద్ద గల గాంధీజీ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు తిరిగి హిందూ కళాశాల సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అక్కడి నుంచి లాడ్జిసెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సిపి నాయకులు షేక్ షౌకత్, నసీర్ అహమ్మద్, ఆతుకూరి ఆంజనేయులు, గులామ్ రసూల్, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ పోరులో టిడిపి హోరు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జూలై 31: దాదాపు ఏడేళ్ల అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన వైభవాన్ని చాటుకుంది. ఈనెల 23వ తేదీ నుండి జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ పోరులో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ప్రథమ స్థానంలో నిలవగా, వైఎస్‌ఆర్ కాంగ్రె స్, కాంగ్రెస్ పార్టీలు తదుపరి స్థానాల్లో నిలిచాయి. జిల్లా వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీని తట్టుకుని నిలబడలేక చతికిలపడటంతో ఆ పార్టీ తీవ్ర భంగపాటుకు గురికావాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పరాజయం పాలై నైరాశ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, పార్టీ నాయకత్వానికి పంచాయతీ ఎన్నికల్లో లభించిన ఘన విజయం పార్టీ నూతనోత్సాహానికి బాట వేసింది. ఈనెల 23న తెనాలి డివిజన్‌లోని 286 పంచాయతీలకు జరిగిన తొలివిడత ఎన్నికల్లో ఏకగ్రీవమైన పంచాయతీలతో కలిపి 115 స్థానాల్లో తెలుగు తమ్ముళ్లు పాగా వేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 72 స్థానాల్లోనూ, అధికార కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు కేవలం 33 స్థానాలకు పరిమితమయ్యారు. గుంటూరు డివిజన్ పరిధిలోని 260 పంచాయతీలకు జరిగిన రెండవ విడత ఎన్నికల్లోనూ దాదాపు 110 పంచాయతీలను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. తాజాగా బుధవారం నరసరావుపేట డివిజన్‌లో జరిగిన తుది విడత ఎన్నికల్లోనూ టిడిపి విజయభేరి మోగించింది. మొత్తం 293 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కడపటి సమాచారం అందేసరికి 151 స్థానాలను తెలుగుదేశం, 106 స్థానాలను వైఎస్‌ఆర్ సిపి, 55 స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మొత్తం మీద పంచాయతీ పవనాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వీచడంతో పార్టీకి పునర్వైభవం లభించే అవకాశాలున్నాయని కేడర్ భావిస్తోంది.
పెదరెడ్డిపాలెంలో దుండగుల బీభత్సం
నరసరావుపేట, జూలై 31: నరసరావుపేట డివిజన్‌లో బుధవారం పంచాయితీ ఎన్నికలు సజావుగా ముగుస్తున్న తరుణంలో నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెంలో ఐదు బ్యా లెట్ బాక్స్‌లను ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పోలింగ్ కేంద్రాల నుండి తీసుకువెళ్ళి సమీపంలో ఉన్న బావిలో పడేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా గ్రామంలో తిరిగి పోలింగ్ నిర్వ హిస్తామని కలెక్టర్ సురేష్‌కుమార్ ప్రకటించారు. పెదరెడ్డిపాలెం గ్రామం లో సర్పంచ్ అభ్యర్థిగా ఎస్టీకి రిజర్వ్ కాగా, తోకల జగన్నాధం, కుంభా వెంకటేశ్వర్లు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిరువురికి గ్రామంలోని బలమైన సామాజికవర్గాలు మద్దతు ప్రకటించాయి. సుమారు 12గంటల సమయంలో కొందరు దుండగులు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి రెండో అంతస్తులో ఉన్న పోలింగ్ కేంద్రంలోని రెండుబ్యాలెట్ బాక్స్‌లను, కింద అంతస్తులో ఉన్న మరో మూడు బ్యాలెట్‌బాక్స్‌లను తీసుకువెళ్ళి బావి లో పడేశారు. అయితే పది పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 945ఓట్లు పోలవ్వాల్సి ఉండగా, సుమారు 75శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. సంఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఎం శ్రీనివాసరావు, ఓఎస్‌డి సూర్యప్రకాశ్, తహశీల్దార్ పార్థసారధి, డిఎస్పీ పివి సుబ్బారెడ్డి తదితరులు సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. రెండుపార్టీలకు చెందిన ఇరువర్గాల వారు ఇరువైపుల మోహరించి ఒకరిపైనొకరు దుర్బాషలాడుకున్నారు. బ్యాలెట్ బాక్స్‌లను ఎత్తుకుపోయి బావిలోపడేసిన తీరును అధికారులు పరిశీలించారు. ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు ఆర్డీవోను కలిసి తమగోడును వెళ్ళబోసుకున్నారు. వెంటనే ఎన్నికలను నిర్వహించాలని ఒకవర్గం వారు ఎన్నికల అధికారి, ఆర్డీవోను నిలదీయగా, మరోవర్గం వారు తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. పోలింగ్‌కేంద్రం నుండి కొంతదూరం వచ్చిన తర్వాత అదేగ్రామానికి చెందిన ఒకవర్గంవారు ఆర్డీవో వాహనానికి అడ్డుకుని తమకు న్యాయం చేసి, వెంటనే పోలింగ్‌ను జరపాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న పరిణామాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళానని, ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చి పరిశీలిస్తారని, అనంతరం వెంటనే నిర్ణయం తీసుకుంటారని ఆవర్గానికి నచ్చచెప్పారు. అయినప్పటికీ, వారు ఆర్డీవో చెప్పిన మాటను పెడచెవిన పెట్టి పోలీసులకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ, రోడ్డుపై బైఠాయించి, ఆర్డీవో వాహనాన్ని వెళ్ళనీవ్వకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్ హుటాహుటిన పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చేరుకుని జరిగిన సంఘటనను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామానికి చెందిన ఒక వర్గం వారు రోడ్డుపై బైఠాయించి కలెక్టర్ వాహనాన్ని సైతం అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో కలెక్టర్‌కు, గ్రామానికిచెందిన వ్యక్తుల మధ్య కొద్దిపాటి వాగ్వివాదం చోటుచేసుకుంది. జరిగిన పరిస్థితులను తనకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని కలెక్టర్ స్పష్టంచేశారు. ఇదే సమయంలో పోటీలో ఉన్న ఎస్టీ సర్పంచ్ అభ్యర్థులు కలెక్టర్‌తో మాట్లాడుతూ తమకు ఏమీ తెలియదని, ఒకవర్గంపై మరోకవర్గం వారు ఆరోపణలు చేసుకున్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పోలింగ్ అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదికనుబట్టి తాను నిర్ణయం తీసుకుంటానని హామీఇచ్చి గ్రామం నుండి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా, పెద్దరెడ్డిపాలెం నుండి నరసరావుపేట వస్తున్న కలెక్టర్‌ను మార్గమధ్యలోని ములకలూరుగ్రామంవద్ద పెద్దరెడ్డిపాలెం గ్రామస్తులు మళ్ళీ అడ్డుకుని రాస్తారోకోను నిర్వహించేందుకు పూనుకున్నారు. దీంతో ఓఎస్‌డి సూర్యప్రకాశ్‌రావు రాస్తారోకోను నిర్వహించేవారిని అరెస్ట్‌చేసి, లాఠీచార్జీ చేశారు. రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు చెల్లాచెదురు కావడంతో అధికారుల వాహనాలు ఎట్టకేలకు నరసరావుపేటకు చేరుకున్నాయి. మండలంలోని ములకలూరు గ్రామంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి వార్డులోని ఆరోనంబర్ పోలింగ్‌కేంద్రంలో ఏజంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, వారిని వారించి, ఎన్నికల ప్రక్రియను కొనసాగేవిధంగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా పమిడిపాడులో ఏజంటు, ఓటరు మధ్య స్వల్ప ఘర్షణ జరగడంతో ఎన్నికల అధికారులు వారిని వారించి ఎన్నికల పోలింగ్‌ను సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ డివిజన్‌లోని 299 గ్రామాల్లో 3286 పోలింగ్‌కేంద్రాల్లో 88.3శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు. పెదరెడ్డిపాలెంలో కొందరు బయటి వ్యక్తులు బ్యాలెట్‌బాక్స్‌లను తీసుకువెళ్ళి బావిలో పడేసిన దృష్ట్యా గ్రామంలో రీపోలింగ్‌ను నిర్వహిస్తామని స్పష్టంచేశారు. పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. మహిళలు కలెక్టర్‌కు అడ్డుపడి, మమ్మల్నీ ఇళ్ళల్లో ఉండనివ్వరని, మీరు రక్షణ కల్పించాలని కోరగా, దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, మీరు ప్రశాంతంగా ఉండాలని, తప్పనిసరిగా రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ సురేష్‌కుమార్ వెంట ఆర్డీవో ఎం శ్రీనివాసరావు, ఓఎస్‌డి సూర్యప్రకాశ్‌రావు, డిఎస్పీ పివి సుబ్బారెడ్డి, తహశీల్దార్ పార్థసారధి తదితరులు ఉన్నారు.
నృసింహుని బంగారు గరుడోత్సవం
మంగళగిరి, జూలై 31: స్థానిక శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆర్జిత సేవల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారికి బంగారు గరుడోత్సవ సేవ నిర్వహించారు. దాసరి రామకృష్ణ, వెంకటలక్ష్మిరత్నం దంపతులు కైంకర్యపరులుగా వ్యవహరించారు. పలువురు భక్తులు పాల్గొని స్వామివారిని నేత్ర పర్వంగా దర్శించుకున్నారు. భక్తులు వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొని లక్ష్మీ నృసింహ స్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఆలయ ఇఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి కోరారు.
‘నాగార్జున’లో నిరసన జ్వాలలు
నాగార్జున యూనివర్సిటీ, జూలై 31: ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేయాలని కేంద్రంలోని యుపిఎ తీసుకున్న నిర్ణయంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆగ్రహం పెల్లుబికింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించాలని, సమైక్య రాష్ట్రానికే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వర్సిటీలో సోనియాగాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. వర్సిటీ హాస్టల్స్ నుండి ప్రదర్శనగా బయలుదేరిన విద్యార్థులు వర్సిటీ ప్రధానద్వారం వద్దకు చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వర్సిటీ ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై గుంటూరు, విజయవాడ రహదారులను దిగ్భంధించారు. సుమారు 20 నిమిషాల సేపు విద్యార్థులు రాస్తారోకో నిర్వహించటంతో జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచి పోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను చెదరగొట్టడంతో రాస్తారోకో విరమించిన విద్యార్థులు వర్సిటీ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్సిటీ సమైక్యాంధ్ర జెఎసి నాయకులు బి వెంటేశ్వర్లు మాట్లాడుతూ కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసుకున్న విభజన నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీమాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ వరుసగా మూడు రోజులు పాటు బంద్‌ను పాటిస్తున్నామని తెలిపారు. వర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పైడి రాజకుమార్ మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయడానికి నిర్ణయం తీసుకోవటం తెలుగు ప్రజలను తీవ్రమనస్తాపానికి గురి చేసిందన్నారు. విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించకోకపోతే సీమాంధ్ర ప్రజలు చేతిలో చావుదెబ్బ తినాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. వర్సిటీ విద్యార్థి నాయకుడు పి శ్యాంసన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వకుండా చూడాల్సిన భాద్యత విద్యార్థులపైన ఉందన్నారు. అనంతరం విద్యార్థులు, జెఎసి నేతలు వీసీ వియన్నారావును కలిసి సమైక్యాంధ్ర ఉద్యమానికి సహకరించాలని, మూడురోజులపాటు వర్సిటీలో బంద్ పాటిస్తున్న సందర్భంగా వర్సిటీలో గురువారం నుండి ఏర్పాటు చేయనున్న అకడమిక్ ఎగ్జిబిషన్‌ను వాయిదా వేయాలని కోరారు. మంగళగిరి సిఐ మురళీకృష్ణ, పెదకాకాని సిఐ శ్రీనివాసరావులు వర్సిటీలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఐఎన్‌టియుసి నాయకులు పిల్లి నాగేశ్వరరావు, కనకరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తైక్వాండో జిల్లా స్కూల్‌గేమ్స్ జట్టు
గుంటూరు (స్పోర్ట్స్), జూలై 31: విద్యానగర్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో బుధవారం జరిగిన అండర్-19 స్కూల్‌గేమ్స్ బాల బాలికల తైక్వాండో పోటీల్లో ఎంపికైన జిల్లా జట్టును కార్యదర్శి జి మునేశ్వరరావు ప్రకటించారు. జట్టులో బాలుర విభాగంలో టి శ్రీహరి, షేక్ అమీర్, వి సూరజ్‌కుమార్, ఎండి జిలాని (గుంటూరు), డి పృధ్వీరాజ్, పి తమీజ్‌ఖాన్ (తెనాలి), పి భార్గవ్, ఎన్ గోపిరాజు (రేపల్లె) బాలికల్లో డి రుధిర రాగరచన, జె సాహితి (గుంటూరు) ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు కర్నూలులో జరగనున్న రాష్టస్థ్రాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఎంపికలను ఆర్‌ఐఒ రూపస్‌కుమార్, వ్యాయామ అధ్యాపకులు ఉదయభాస్కర్, సంజీవరెడ్డి, టిటికె ప్రసాద్, వెంకటేశ్వరరావు, తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి జగన్మోహనరావు నిర్వహించారు.
సెంట్రల్ జోన్ మహిళా జట్టు
గుంటూరు (స్పోర్ట్స్), జూలై 31: గత కొద్ది రోజులుగా స్థానిక జెకెసి కళాశాల ఆవరణలో జరుగుతున్న ఎసిఎ సెంట్రల్ జోన్ మహిళా క్రికెట్ పోటీల్లో ప్రతిభను కనబర్చిన క్రీడాకారిణులను బుధవారం సెంట్రల్‌జోన్ జట్టుకు ఎంపిక చేశారు. జట్టుకు కృష్ణాజిల్లాకు చెందిన ఎస్ మేఘన కెప్టెన్‌గా, ఎస్ రమాదేవి (వెస్ట్ గోదావరి), పివి సుధారాణి (ప్రకాశం), ఆర్ కల్పన (కృష్ణా), ఎన్‌ఎస్‌పి రామలక్ష్మి (పశ్చిమ గోదావరి), సిహెచ్ ఝాన్సీలక్ష్మి (గుంటూరు), జి ధనలక్ష్మి, పి నాగమణి, పి వినీల, జి స్నేహ, మన్వీన్‌కౌర్ (కృష్ణా), డి దుర్గ్భావాని, ఎ ప్రియాంక (పశ్చిమ గోదావరి), డి మల్లిక, పి కల్పన (ప్రకాశం) జట్టుకు ఎంపికయ్యారు. స్టాండ్‌బైలుగా ఎ సత్యవాణి (పశ్చిమ గోదావరి), హెక్సిబా, డివై సంజన, ఆర్ సుకన్య (గుంటూరు), ఎన్ భావన (కృష్ణా), వై రమాదేవి (ప్రకాశం) ఎంపికయ్యారు.
పొన్నూరులో సమైక్యవాదుల ధర్నా, రాస్తారోకో
పొన్నూరు, జూలై 31: రాష్ట్ర విభజన యోచనను విరమించుకుని సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పొన్నూరు పట్టణంలో విద్యాసంస్థలు బుధవారం బంద్ జరిపాయి. కేంద్రప్రభుత్వ చర్యను గర్హిస్తూ రాజకీయ పక్షాల కార్యకర్తలు, సమైక్యవాదులు, విద్యార్థులు పట్టణంలో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా జరిపారు. చింతలపూడి గ్రామంలో గ్రామ సర్పంచ్ గంటా ప్రసాద్ నాయకత్వంలో టిడిపి కార్యకర్తలు గంటసేపు రాస్తారోకో జరిపారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పొన్నూరు పట్టణ కూడలి ప్రాంతంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే నరేంద్రకుమార్ నాయకత్వంలో పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తరలివచ్చిన టిడిపి కార్యకర్తలు ఎన్‌టిఆర్ విగ్రహం ఎదుట జిబిసి రోడ్డుపై రాస్తారోకో జరిపారు. ఈ సందర్భంగా నరేంద్రకుమార్ మాట్లాడుతూ రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విభజనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు యత్నిస్తున్న కాంగ్రెస్ గడ్డిబొమ్మను టిడిపి నాయకులు దగ్ధం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు కూడా తెలంగాణ వాదం గడ్డిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు బొద్దులూరి రంగారావు, గురుబాలు, పి వెంకటస్వామి, మారం వెంకటేశ్వరరావు, గేరా సంజీవ్, ఎస్‌కె షంషుద్దీన్, డి రాజారావు, దాసరి మోహనరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల సాంబశివరావు, శ్రీనివాసరావు, కుర్రా వీరయ్యచౌదరి, ఎద్దు సోంబాబు, రబ్బానీబాషా, పఠాన్ అహమ్మద్‌ఖాన్, చినగఫారీ, తమనం రవి, ఫైరజ్, పిన్నమనేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వివాదాలు, ఘర్షణలతో పలుచోట్ల ఉద్రిక్తత
నరసరావుపేట, జూలై 31: మండల కేంద్రమైన నకరికల్లులో పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలబడిన ఓటర్లు ఒకరిపైనొకరు ఘర్షణపడి వాగ్వివాదానికి దిగారు. ఈనేపథ్యంలో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు ఒకరిపైఒకరు రాళ్ళురువ్వుకుని భయభ్రాంతులకు గురిచేశారు. వెంటనే డిఎస్పీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో ఇరువర్గాలపై లాఠీలను ఝుళిపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మాచవరం మండలం మల్లవోలులో
మాచవరంమండలం మల్లవోలులోని ఓటర్ల జాబితాలో ఎస్సీలకు చెందిన 300ఓట్లను తొలిగించడంపై ఎస్సీలు ఒక్కసారిగా అధికారులపై తిరగబడ్డారు. దీనిపై అధికారులు బెంబేలెత్తిపోయారు. పోలింగ్ అధికారి, సిబ్బంది, తహశీల్దార్‌ను తీవ్రంగా నిరసించారు. అనంతరం తమ ఓట్లను తొలిగించినందుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అదేవిధంగా ఒక పోలింగ్ అధికారి కారు అద్దాన్ని ధ్వంసం చేశారు. అనంతరం పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తున్నారని గ్రామానికి చెందిన ఓ వర్గం వారు ఎస్సీలతో గొడవకు దిగారు. దీనిపై గ్రామానికి చెందిన ఇరువర్గాల వారు రాళ్ళు వర్షం కురిపించారు. కౌంటింగ్‌ను మల్లవోలులో నిర్వహించకుండా బ్యాలెట్‌బాక్స్‌లను మాచవరం ఎంపిడివో కార్యాలయానికి తరలించారు. అక్కడినుండి జిల్లాపరిషత్ హైస్కూల్‌కు బ్యాలెట్ బాక్స్‌లను తరలించి కౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
రొంపిచర్ల మండలం తుంగపాడులో
రొంపిచర్లమండలం తుంగపాడులో రెండోవార్డు పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణ వల్ల సుమారు రెండుగంటలపాటు పోలింగ్‌ను ఎన్నికల అధికారులు నిలిపివేశారు. గ్రామంలో లేనివారి ఓట్లు వేస్తున్నారంటూ వచ్చిన అభ్యంతరాలు ఘర్షణకు దారితీశాయి. గొట్టిపాటి శ్రీనివాసరావు, ఏనుగంటి వెంకట రామారావుల మధ్య జరిగిన ఈఘర్షణలో వెంకట రామారావుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్ధారు.
నాదెండ్ల మండలం గణపవరంలో
మండలంలోని గణపవరంగ్రామ పోలింగ్‌కేంద్రం అధికారులు స్లిప్‌ల మడతను సక్రమంగా వేయడంలేదంటూ గ్రామస్తులు బుధవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. దీనిపై సమాచారం అందుకున్న కలెక్టర్ సురేష్‌కుమార్ గణపవరం గ్రామానికి చేరుకుని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. 2, 7, 10, 17 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 600ఓట్లకు సంబంధించిన స్లిప్‌లను ఎన్నికల అధికారులు సక్రమంగా మడవలేదని కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. దీనిపై కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ యాంటిక్లాక్‌వైజ్ డైరెక్షన్‌లో ఎన్నికలగుర్తు ఉంటుందని, దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కలెక్టర్ తెలిపారు. హైకోర్టు న్యాయవాది వలేటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దీనివల్ల వార్డుసభ్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారని కలెక్టర్ దృష్టికి తేగా, ఆందోళన చెందాల్సిన పనిలేదని కలెక్టర్ మరోసారి సమాధానం ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్ వెంట తహశీల్దార్ చిన్నం సుధారాణి, ఆర్‌వోలు ఉన్నారు. బుధవారం సాయంత్రం ఎన్నికల అజ్వర్వర్ ఉదయలక్ష్మీ కౌంటింగ్ జరిగే స్థలాన్ని పరిశీలించారు. ఉదయలక్ష్మీ వెంట మేడికొండూరు ఎంపిడివో వై బ్రహ్మయ్య తదితరులున్నారు.
కారంపూడి మండలంలో సత్తా చాటిన టిడిపి
కారంపూడి, జూలై 31: మండలంలో తెలుగుదేశం పార్టీ తమ సత్తాను చాటుకుంది. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో గతంలోనే రెండు తెలుగుదేశం, మరో రెండు వైఎస్‌ఆర్ సిపి పార్టీలకు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 11 గ్రామ పంచాయతీలకు బుధవారం ఎన్నికలు జరగ్గా 8 పంచాయతీలను తెలుగుదేశం పార్టీ, మూడు పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కారంపూడి మండలం వైభవాన్ని చాటింది. కారంపూడి పంచాయతీకి టిడిపి తరపున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి కాల్వ రత్తయ్య 937 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. పేటసనె్నగండ్లలో మాచర్ల సాంబయ్య 550 ఓట్ల మెజార్టీతో, చింతపల్లిలో ఉన్నం రమణ 1861తో, గాదెవారిపల్లెలో దోర్నాల బ్రహ్మారెడ్డి 116తో, ఒప్పిచర్లలో పాలకీర్తి శ్రీను 1365తో, పెద్దకుదమగుండ్లలో బొల్లేపల్లి అంజమ్మ 158తో, నరమాలపాడులో ప్రత్తిపాటి సెబాష్టియన్ 11తో, ఇనుపరాజుపల్లెలో చల్లా ఈశ్వరమ్మ 35 ఓట్లతో టిడిపి తరఫున సర్పంచ్‌లుగా విజయం సాధించారు. వేపకంపల్లి, చినగార్లపాడు గ్రామాలు గతంలోనే టిడిపికి ఏకగ్రీవమయ్యాయి. చిన్నకుదమగుండ్ల గ్రామంలో గుర్రం సీతారావమ్మ 126 ఓట్ల మెజార్టీతో, బట్టువారిపల్లెలో చింతకాయల ఆదినారాయణ 33తో, కాచవరంలో సయ్యద్ కరిమున్ 300 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. లక్ష్మీపురం, మిరియాల గ్రామాలు గతంలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. కారంపూడి మేజర్ పంచాయతీలోని 16 వార్డులలో తెలుగుదేశం పార్టీకి 8 వార్డులు, వైఎస్‌ఆర్ సిపి 7 వార్డులు లభించగా, స్వతంత్య్ర అభ్యర్థి ఒకరు గతంలోనే ఏకగ్రీవమయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. గురజాల డిఎస్‌పి ఐ పూజ, సిఐ వెంకటేశ్వర్లు, స్పెషల్ ఆఫీసర్ మోహనరావు, తహశీల్దార్ దత్తాత్రేయశర్మ, ఎంపిడిఒ రాజగోపాల్ ఎన్నికలను పర్యవేక్షించారు.
మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారుల హవా
మాచర్ల, జూలై 31: మాచర్ల నియోజకవర్గ పరిధిలో బధవారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు స్పష్టమైన మెజార్టీని కనబరిచారు. నియోజకవర్గ పరిధిలోని మొత్తం 71 పంచాయతీలకు గాను 11పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో వెల్దుర్తి మండల పరిధిలోని కండ్లకుంట, శిరిగిరిపాడు పంచాయతీలను శాంతిభద్రతల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎన్నికలను వాయిదా వేశారు. ప్రస్తుతం 58 పంచాయతీలకు ఎన్నికలు జరిగగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు 30, వైయస్సార్‌సీపీ మద్దతుదారులు 21, కాంగ్రెస్ మద్దతుదారులు 6 పంచాయతీలను కైవశం చేసుకున్నారు. రెంటచింతల పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. మాచర్ల మండల పరిధిలోని కంభంపాడు పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరచిన అభ్యర్థి దేవరకొండ నాంచరయ్య తన సమీప వైయస్సార్ సీపీ బలపరచిన అభ్యర్థి దేవరాయి సూరయ్యపై 425 ఓట్లతో విజయం సాధించారు. రాయవరం పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరచిన అభ్యర్థి తన సమీప వైయస్సారీ సీపీ బలపరచిన అభ్యర్థి పీ వెంకటప్పయ్యపై 500 ఓట్లతో విజయం సాధించారు. గన్నవరం పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ బలపరచిన అభ్యర్థి ముక్కా తిరుపతమ్మపై టీడీపీ బలపరచిన అభ్యర్థి వేముల అక్కమ్మపై 90 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జమ్మలమడక పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరచిన అభ్యర్థి ముక్కా కోటేశ్వరరావుపై వైయస్సార్ సీపీ బలపరచిన అభ్యర్థిపై 197 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
శావల్యాపురంమండలంలో కాంగ్రెస్ అభ్యర్థుల హవా
శావల్యాపురం, జూలై 31: మండలంలో 11 గ్రామ పంచాయతీలకు బుధవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం ఆరుగంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు బారులుతీరారు. 11గ్రామ పంచాయతీల్లో ఆరు గ్రామ పంచాతీలను కాంగ్రెస్‌పార్టీ, నాలుగు పంచాయతీలను తెలుగుదేశం మద్దతుదారులు గెలుచుకోగా, వేల్పూరు పంచాయతీని ఇండిపెండెంట్ అభ్యర్థి బొల్లా ఆదిలక్ష్మి 2,100 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన బొందిలిపాలెం పంచాయతీలో బత్తుల వెంకటేశ్వర్లు 70ఓట్ల మెజార్టీ, వయ్యకల్లు గ్రామపంచాయతీలో వి ముసలయ్య 40 ఓట్లతోనూ, గుంటిపాలెం పంచాయతీలో పచ్చా కోటేశ్వరమ్మ 70 ఓట్లు, పిచ్చుకలపాలెం గ్రామపంచాయతీలో తిరువీధుల సూర్యనారాయణ 65 ఓట్లతోనూ, శావల్యాపురం ముట్లూరు యెహేలమ్మ 332 ఓట్లతోనూ, కొత్తలూరు గ్రామపంచాయతీలో చవల కోటేశ్వరమ్మ 328 ఓట్లతో విజయం సాధించారు. తెలుగుదేశంపార్టీ బలపరిచిన ముండ్రువారిపాలెం పంచాయతీలో మర్రి వెంకటేశ్వర్లు 66 ఓట్లతోను, కారుమంచి పంచాయతీని మల్లాపరపు నాగమ్మ 183 ఓట్లతోనూ, మతుకుమల్లి పంచాయతీ నుండి కాలువ మరియబాబు 60 ఓట్లతోను, కనమర్లపూడి పంచాయతీలో బోడేపూడి అంజలి 103 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
రెండోరోజుకు చేరిన న్యాయవాదుల నిరసన
తెనాలి, జూలై 31: తెలంగాణ విభజనకు యుపిఎ పాలకులు ఆమోదం తెలపడం వారి రాజకీయ ప్రయోజనాల కోసమేనని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడిబోయిన శ్రీనివాసరావు యుపిఎ విధానాన్ని దుయ్యబట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక కోర్టుహాల్ ప్రధాన ద్వారం ఎదుట న్యాయవాదులు తమ ఆందోళనలో భాగంగా విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికైనా యుపిఎ తన విధానం వెనక్కి తీసుకుని సమైక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిరసన ప్రదర్శనలో న్యాయవాదులు దంతాల కిరణ్‌కుమార్, కనక రాంబాబు, గుమ్మడి రవిరాజ్, కంచర్ల చంద్రశేఖర్, కామినేని చిన్నా, ఆర్.సుబ్బారావు, కె.కుమార స్వామి, కె.ప్రకాష్ తదితరులున్నారు.