ఖమ్మం, జూలై 31: గ్రామ పంచాయతీ ఎన్నికల తుది విడతలో జిల్లాలో శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని 29మండలాల పరిధిలో 381పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 19పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 2 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. రెండు గ్రామాల్లో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. మిగిలిన 358గ్రామ పంచాయతీల్లో బుధవారం ఎన్నికలు జరిగాయి. మొత్తం మూడు డివిజన్ల పరిధిలోని 4,086 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 445 ఏకగ్రీవం కాగా, 35చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 3,606వార్డులకు ఎన్నికలు జరిగాయి. కొత్తగూడెం డివిజన్‌లో 85.44శాతం, పాల్వంచ డివిజన్‌లో 84.83శాతం, భద్రాచలం డివిజన్‌లో 79.71శాతం పోలింగ్ నమోదైంది. కామేపల్లి మండలంలో అత్యధికంగా 93.75శాతం నమోదు కాగా, కూనవరం మండలంలో అత్యల్పంగా 70.02శాతం నమోదైంది.
ఇదిలా ఉండగా పలుచోట్ల ఆయా రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనేక చోట్ల పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని ఎన్నికల అనంతరం వదిలిపెట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చర్ల మండలం పెద్ద మిడిసిలేరులో సిరా లేక పోలింగ్ కొద్ది సేపు నిలిచిపోయింది. జూలూరుపాడు మండలం గుండెపుడిలో స్కూల్‌పై కప్పు కురుస్తుండటంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో టిడిపి నాయకుడు మేడా మోహన్‌రావు ఏజెంట్‌గా ఉంటూనే ప్రచారం చేస్తుండటంతో అధికారులు ఆయనను బయటకు పంపారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మణుగూరు మండలం రామానుజవరంలో సిపిఐ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా, పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అత్యంత సమస్యాత్మక గ్రామమైన పండితాపురంలో పోలింగ్ ప్రశాంతంగా జరగటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగినప్పటికీ డబ్బు, మద్యంప్రభావం తీవ్రంగా కన్పించింది. ఎన్నిక జరిగే సమయంలో కూడా ఈ పంపకాల జరుగుతున్నా పోలీస్ అధికారులు అనేక చోట్ల పట్టించుకోలేదు. వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలోని పలు చోట్ల ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు పోలింగ్ కేంద్రం సమీపంలోనే ఆయా పార్టీల నేతలు బహుమతులను పంపిణీ చేయటం గమనార్హం. కాగా అనేక చోట్ల పోలీసులు, ఎన్నికల సిబ్బంది అధికార పార్టీ నేతలకు మద్దతు పలుకుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం, వామపక్షపార్టీ నేతలు ఈ విషయంపై అనేక చోట్ల పోలీసులతో వాగ్వివాదానికి కూడా దిగారు. అనేక గ్రామాల్లో ఓట్లు లేని వారు గ్రామంలో ఉండవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేయటంతో వాదోపవాదాలు జరిగాయి. చివరకు పోలీసులు వారిని పోలీస్ స్టేషన్లకు తరలించి వారిని విడిచిపెట్టారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
టిడిపిదే ఆధిక్యత
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జూలై 31: ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిడిపి స్పష్టమైన ఆధిక్యతను కనబర్చింది. ఈ నెల 27న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో ఆధిక్యత కనబర్చిన తెలుగుదేశం తుది విడత ఎన్నికల్లో సైతం ఆధిక్యతను కొనసాగించింది. బుధవారం కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో ఎన్నికలు జరగ్గా, మూడు డివిజన్లలోనూ తెలుగుదేశం మద్దతుదార్లు స్పష్టమైన ఆధిక్యతను కనబర్చారు. మొత్తం మూడు డివిజన్లలో కలిపి 381 స్థానాలుండగా, రెండు చోట్ల ప్రజలు ఎన్నికలను బహిష్కరించగా, మరో రెండు చోట్ల నామినేషన్లు పడలేదు. మిగిలిన 377 స్థానాలకు గాను ఏకగ్రీవమైన వాటితో కలిపి కడపటి వార్తలు అందే సరికి 367స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ 62స్థానాలను, తెలుగుదేశం 120స్థానాలను, వైఎస్‌ఆర్‌సిపి 93 స్థానాల్లోనూ, సిపిఎం 33 స్థానాలు, సిపిఐ 21 స్థానాలు, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ 24 స్థానాలు, బిజెపి 1 స్థానం, టిఆర్‌ఎస్ 1 స్థానం, ఇతరులు 12 స్థానాల్లోనూ విజయం సాధించారు. కొత్తగూడెం డివిజన్‌లో కాంగ్రెస్ 38, టిడిపి 50, వైఎస్‌ఆర్‌సిపి 25, సిపిఎం 4, సిపిఐ 5, సిపిఐ(ఎంఎల్) 19, ఇతరులు 2స్థానాల్లో విజయం సాధించారు. భద్రాచలం డివిజన్‌లో కాంగ్రెస్ 8, తెలుగుదేశం 30, వైఎస్‌ఆర్‌సిపి 29, సిపిఎం 27, సిపిఐ 11, సిపిఐ(ఎంఎల్) 1, బిజెపి 1, టిఆర్‌ఎస్ 6, ఇతరులు 6 స్థానాల్లో, పాల్వంచ డివిజన్‌లో కాంగ్రెస్ 16, టిడిపి 40, వైఎస్‌ఆర్‌సిపి 39, సిపిఎం 2, సిపిఐ 5, సిపిఐ(ఎంఎల్) 4, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.
త్రిముఖపోటీలో పోటాపోటీ ఫలితాలు
* వైకాపా, టిఆర్‌ఎస్‌కు భంగపాటు
కొత్తగూడెం, జూలై 31: కొత్తగూడెం మండలంలో కడపటి వార్తలు అందేసరికి మొత్తం 21పంచాయతీల్లో 18పంచాయతీల ఫలితాలు వెల్లడికాగా కాంగ్రెస్ 7, తెలుగుదేశం 6, సిపిఐ 5, టిడిపి రెబల్ అభ్యర్థి 1, సుజాతనగర్ మేజర్ పంచాయతీని సిపిఎం కైవసం చేసుకున్నాయి. 3ఇంక్లైన్‌లో తెలుగుదేశం రెబల్ అభ్యర్థి బోడా శారద విజయం సాధించగా, మండలంలోని మేజర్ పంచాయతీల్లో ఒకటైన సుజాతనగర్‌లో సిపిఎం అభ్యర్థి కాసాని లక్ష్మి ఉత్కంఠపోరులో విజయం సాధించారు. వరుసగా ఏడవసారి ఈపంచాయతీలో సిపిఎం విజయం సాధించడం గమనార్హం. పెనుబల్లి పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి హాలావత్ రుక్మిణి, వెంకటేష్‌ఖనిలో కాంగ్రెస్ అభ్యర్థి కొర్సు సమ్మక్క, రాఘవాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి గరికె వెంకటసాంబయ్య, రేగళ్ళలో కాంగ్రెస్ అభ్యర్థి బాదావత్ రాంకోటి, రుద్రంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ బిక్నా, సర్వారంలో కాంగ్రెస్ అభ్యర్థి బాదావత్ శారదలు విజయం సాధించారు. అదేవిధంగా అనిశెట్టిపల్లిలో తెలుగుదేశం అభ్యర్థి ఈసం రామారావు, చాతకొండ టిడిపి అభ్యర్థి పడిగ వెంకటేశ్వర్లు, నర్సింహాసాగర్ టిడిపి అభ్యర్థి బానోత్ రామనాధం, పెనగడప టిడిపి అభ్యర్థి మాలోత్ కళావతి, సింగభూపాలెం టిడిపి అభ్యర్థి భూక్య జ్యోతిలు విజయం సాధించారు. బంగారుచెలక సిపిఐ అభ్యర్థి కోరం సత్తెమ్మ, గరీబ్‌పేట సిపిఐ అభ్యర్థి బోడ దమ, సీతంపేట సిపిఐ అభ్యర్థి లావూడ్య మంగమ్మ, సీతారాంపురం సిపిఐ అభ్యర్థి బోడా రాములు, మైలారం సిపిఐ అభ్యర్థి కుర్సం బొజ్జయ్యలు గెలిచారు. లక్ష్మిందేవిపల్లి కాంగ్రెస్ అభ్యర్థి భానోతు వశ్యానాయక్, కాలుకొండ రామవరం టిడిపి అభ్యర్థి భారతి గెలుపొందారు. చుంచుపల్లి పంచాయతీలో సిపిఐ అభ్యర్థి బానోతు లక్ష్మి గెలుపుబాటలో ఉన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో
అంటువ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి
* కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశం
వి.ఆర్.పురం, జూలై 31: వర్షాల కారణంగా గోదావరి వరద ప్రభావిత ప్రాంతంలో నివసించే ప్రజలకు అంటువ్యాధులు, మలేరియా ప్రబలకుండా గ్రామ స్థాయిలో పని చేసే వారిని అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని తుమ్మిలేరు గ్రామశివారు పోచవరం స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అంటువ్యాధులున్న వారి గృహాలకు వెళ్లి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రభలకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రజలను ఆదుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో పని చేసే విఆర్‌ఓ, సెక్రటరీ, ఎఎన్‌ఎం, ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలను అప్రమత్తం చేసి జ్వర పీడితులకు సకాలంలో వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత, సుదూర ప్రాంతంలో నివసించే గిరిజనులు జ్వరపీడితులు కాకుండా అవగాహనతోపాటు తరుచుగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. కాగా తుమ్మిలేరు నుంచి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు లాంచీల ద్వారా వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. 451 ఓట్లలో 11 గంటల వరకే 90 శాతం ఓట్లు పోలయ్యాయని పోలింగ్ బూత్ అధికారి జిల్లా కలెక్టర్ శ్రీనరేష్‌కు వివరించారు. అనంతరం ఆయన గ్రామంలోని కమ్యూనిటీ టీవి కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామస్థులంతా ఒక చోట చేరి టీవీ కార్యక్రమాలను వీక్షిస్తామని తెలిపారు. మొత్తం 52 కమ్యూనిటీ టీవిలను సరఫరా చేసామని పిఓ జి వీరపాండియన్ కలెక్టర్‌కు వివరించారు. సోలార్ పద్ధతిలో విద్యుత్ సరఫరా కోసం మొత్తం 20 గ్రామాలకు అందించనున్నామన్నారు. నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆర్థికంగా ఎదిగేందుకు రూ.70 లక్షలు విడుదల చేసి లాంచీలను కొండరెడ్ల యువతకు అందించామని పిఓ చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి వంటగది పరిశీలించి విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలు, అభ్యాసికలు, యూనిఫాం గురించి పిఓతో పాటు జిల్లా కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏసి లాంచీని పరిశీలించి సీటింగ్ ఏర్పాట్లు సరిగా చేయాలని సూచించారు. అక్కడి నుంచి నేరుగా వి.ఆర్.పురం ఎండీఓ కార్యాలయంలో మండలంలో ఎన్నికల ఏర్పాట్లు, ఓటింగ్ శాతం, ఓటింగ్ తీరును అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు ఏపిఓ టిపిజి మల్లీశ్వరి, ఏడిఎంఅండ్‌హెచ్‌ఓ డా.పుల్లయ్య, డిఎంఓ రాంబాబు ఉన్నారు.
ముమ్మరంగా పోలింగ్
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జూలై 31: జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ముమ్మరంగా సాగింది. 29మండలాల పరిధిలో సాగిన ఈ ఎన్నికల్లో కామేపల్లి మండలంలో అధికంగా 93.75శాతం పోలింగ్ నమోదు కాగా, కూనవరం మండలంలో అత్యల్పంగా 70.02శాతం నమోదైంది. పాల్వంచ, భద్రాచలం డివిజన్లలో రాత్రి నుంచే వర్షం కురుస్తుండటంతో ఉదయం పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది.
పాల్వంచ మండలంలో ఎన్నికలు ప్రశాంతం
* 87.88 శాతం పోలింగ్‌నమోదు
పాల్వంచ, జూలై 31: పాల్వంచ మండల పరిధిలోని 11పంచాయతీలకు గాను బుధవారం జరిగిన ఎన్నికల్లో స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ అన్ని పంచాయతీల్లో ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల నియమావళి ప్రకారం భారీ వర్షం అయినప్పటికి పోలింగ్ మండల పరిధిలోని 120పోలింగ్ స్టేషన్లలో ఉదయం 7గంటలకే ప్రారంభమైంది. వర్షం కారణంగా మొదట పోలింగ్ మందకొడిగా సాగినప్పటికి 9గంటల అనంతరం పోలింగ్ సరళి ఉపందుకుంది. బూత్‌ల వద్ద ఓటర్లు బారులుతీరి నిలబడడం కనిపించింది. 11గంటల సమయానికి పోలింగ్ కొన్ని పంచాయతీల్లో 65శాతానికి చేరుకుంది. మండలంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. నక్సల్స్ ప్రభావిత పంచాయతీలైన చంద్రాలగూడెం, ఉల్వనూరు పంచాయతీల్లోని పోలింగ్‌స్టేషన్ల వద్ద అటవీశాఖకు చెందిన అధికారులకు డ్యూటీలు వేయడంతో వారు భయాందోళనల మధ్య విధులు నిర్వహించారు. సూరారం గ్రామంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఇంటిలో టిఫిన్ చేస్తున్న టిఆర్‌ఎస్ నాయకుల పక్కన మద్యం సీసాలు ఉండడంతో అటుగా వెళ్ళిన పోలీసులకు వారు కనిపించడంతో మందు తాగుతున్నారన్న కారణంతో టిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తాము మద్యం తాగలేదని చెబుతున్నప్పటికి పోలీసులు అరెస్ట్ చేయడం తప్ప మిగతా పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా వచ్చి ఓటుహక్కునువినియోగించుకున్నారు. వర్షాలకు చిత్తడిగా మారిన బురదలో కూడా ప్రజలు ఓటుహక్కును వినియోగించుకోవడం కనిపించింది.
ఉమ్మడి రాజధానిపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి
ఖమ్మం రూరల్, జూలై 31: ఉమ్మడి రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ఖమ్మం రూరల్ ఉద్యోగుల జెఏసి చైర్మన్ బాలాజీనాయక్, కన్వీనర్ శ్రీనివాస్‌కుమార్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ క్రాస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు కన్న కల నేడు సాకారం కాబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా చేపడుతున్న ఉద్యమాలకు ప్రభుత్వం తలొగ్గి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం హర్షణీయమన్నారు. జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఆపార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్న ఈనిర్ణయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నామన్నారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన హైదరాబాద్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం వల్ల లక్షలాది ఎకరాల భూమి సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇనే్నళ్లు పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంత జిల్లాలన్నీ అభివృద్ధి చెందే అవకాశం కలుగుతుందన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి ఆస్తుల రక్షణకు భరోసా ఉంటుందని వారు స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో ఎవిరావు, బత్తుల పద్మాచారి, వెంపటి సురేందర్, చెరుకుపల్లి భాస్కర్, మహ్మద్ రజబ్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
వి.ఆర్.పురం మండలంలో ఎన్నికలు ప్రశాంతం
వి.ఆర్.పురం, జూలై 31: మండలంలోని 11 పంచాయతీలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. మొత్తం మండలంలో 14,897 మంది ఓటర్లు ఉండగా 88.37 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో సిపిఎం తరఫున శ్రీరామగిరి సర్పంచ్‌గా సోడె చినబూబమ్మ, పెద్దమట్టపల్లి తుర్రం బాబురావు, రామవరం కుంజా నాగిరెడ్డి, కుందులూరు తెల్లం కన్నమ్మ గెలుపొందారు. వైఎస్సార్ సిపి తరఫున పోటీ చేసిన రేఖపల్లి మడకం జోగమ్మ, జీడిగుప్ప కథల వెంకటలక్ష్మి సర్పంచ్‌గా గెలుపొందారు. ఇక కాంగ్రెస్ తరఫున రాజుపేట సర్పంచ్‌గా కుంజా రమేష్, ములకనపల్లి రవ్వా సుజాత విజయం సాధించారు. అలాగే టిడిపి తరపున తుమ్మిలేరు పంచాయతీ సర్పంచ్‌గా వాళ్ల కోటేశ్వరరావు గెలుపొందారు. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా చినమట్టపల్లికి పోటీ చేసిన కారం శివరాజు గెలుపొందారు.
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
కొత్తగూడెం, జూలై 31: మున్సిపాలిటీ పరిధిలోని 19వవార్డు మధురబస్తీ ఏరియాలో బుధవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 400మొక్కలను నాటారు. ఈసందర్భంగా మున్సిపల్ కమిషనర్ గుర్రం రవి మాట్లాడుతూ పట్టణంలోని ప్రధానకూడళ్ళు, వివిధ వార్డుల్లో రోడ్లవెంట రెండువేల మొక్కలు నాటామన్నారు. మొక్కల రక్షణ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని మాజీకౌన్సిలర్ దుంపల అనురాధ 400మొక్కలకు ట్రీగార్డ్స్ ఉచితంగా అందజేశారని తెలిపారు. ట్రీగార్డ్స్‌ను ఎవరైనా వితరణగా అందజేస్తే వారి పేర్లతో అమరుస్తామని కనుక స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తలు, బ్యాంకులు ముందుకు రావాలని కోరారు. అనంతరం రైటర్‌బస్తీలోని కినె్నరసాని నీటిసరఫరా జోన్ నెంబర్-3 వాటర్ ట్యాంక్‌ను పరిశీలించారు. మున్సిపల్ రాజీవ్‌పార్క్‌ను సందర్శించి పార్క్‌లో పెరుగుతున్న కలుపుమొక్కలు, పిచ్చిమొక్కలను వెంటనే తొలగించాలని ఎఇ ఎ సుధాకర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ కెవి లక్ష్మణ్‌రావు, కె ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కినె్నరసాని గేట్లు మూడు ఎత్తివేత
పాల్వంచ, జూలై 31: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండల పరిధిలోని కినె్నరసాని రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో 408అడుగుల సామర్థ్యం గల కినె్నరసాని రిజర్వాయర్ నీటిమట్టం బుధవారం 403అడుగులకు చేరుకుంది. ఈకారణంగా కెటిపిఎస్ అధికారులు రిజర్వాయర్‌కు ఉన్న 12క్లస్టర్ గేట్లలో మూడుగేట్లను నాలుగు అడుగుల మేరకు ఎత్తి 12వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 2వేల క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గేట్ల ఎత్తివేత కార్యక్రమాన్ని కెటిపిఎస్ అధికారులు రవీంద్రకుమార్, కోటేశ్వరరావు, రామకృష్ణలు పర్యవేక్షిస్తున్నారు. గేట్లు ఎత్తివేతకు ముందు కినె్నరసాని పరీవాహక ప్రాంతాల ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు జారీచేశారు.
కొత్తగూడెం మండలంలో పోలింగ్ ప్రశాంతం
కొత్తగూడెం, జూలై 31: కొత్తగూడెం మండలంలోని 21పంచాయతీల్లో బుధవారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మండలం మొత్తం 77.89పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 69వేల 270ఓట్లకు గాను 53వేల 952ఓట్లు పోలయ్యాయి. దీనిలో 26వేల 911మంది పురుష ఓటర్లు, 27వేల 41మహిళా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఉపఎన్నికల అధికారి అమయ్‌కుమార్, తహశీల్దార్ కెపి నర్సింహులు, కొత్తగూడెం ఎఎస్పీ భాస్కర్‌భూషణ్ పోలింగ్‌ను పర్యవేక్షించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చుంచుపల్లి పంచాయతీలో, మాజీమంత్రి కోనేరు నాగేశ్వరరావు లక్ష్మిదేవిపల్లి పంచాయతీలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. వర్షాన్ని లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులను ఎత్తుకునివచ్చి మరీ ఓట్లు వేయించారు.
చర్లలో అనూహ్య ఫలితాలు
చర్ల, జూలై 31: చర్ల మండలంలో బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికలు అనూహ్య ఫలితాలిచ్చాయి. మండలంలో 14 పంచాయతీలు ఉండగా పూసుగుప్ప పంచాయతీ టిఆర్‌ఎస్ పార్టీకి ఏకగ్రీవం కాగా మిగిలిన 13 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో టిడిపికి 2, కాంగ్రెస్ 2, సిపిఐ 3, సిపిఎం 2, వైఎస్సార్ సిపి 3 సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నాయి. పలుచోట్ల చెదురుమొదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓ వైపున జోరున వర్షం కురుస్తున్నా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీలుతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో మొత్తం 26,322 మంది ఓటర్లు ఉండగా 19,293 మంది ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున సుబ్బంపేట పంచాయతీ సర్పంచ్‌గా కాక నర్సిరత్నం, కుదునూరు సర్పంచ్‌గా కుంజా నాగమణిలు విజయం సాధించారు. ఇక టిడిపి తరపున తేగడ పంచాయతీ సర్పంచ్‌గా కుప్ప సావిత్రి, గొమ్ముగూడెం సర్పంచ్‌గా కొడెం మురళీలు గెలుపొందారు. సిపిఐ పార్టీ తరపున పెద్దమిడిసిలేరు పాల్వంచ రామారావు, పెద్దిపల్లి పంచాయతీ మల్లా నాగేశ్వరరావు, కుర్నపల్లి పంచాయతీ సర్పంచ్‌గా ఇర్పా సుశీలలు విజయం దుదుంభి మోగించారు. అటు సిపిఎం తరపున మొగళ్లపల్లి పంచాయతీలో ఎల్లబోయిన రాజేశ్వరి, సత్యనారాయణపురం సర్పంచ్‌గా పర్సిక ఏడుకొండలు గెలుపొందారు. అలాగే వైఎస్సార్ సిపి తరపున ఆర్.కొత్తగూడెంలో తుర్రం రవి, దేవరపల్లిలో తెల్లం జ్యోతి, ఉప్పరిగూడెం పంచాయతీలో ఎలకం నరేంద్రలు గెలుపొందారు. ఇదిలా ఉండగా పెద్దమిడిసిలేరు పోలింగ్ కేంద్రంలో ఇంక్ అయిపోవడంతో గంటపాటు ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో సుదూర ప్రాంత గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనంతరం ఎన్నికల అధికారికి ఫోను సమాచారం అందించడంతో ఇంక్ (సిర)ను ఏర్పాటు చేయడంతో ఓటింగ్‌ను కొనసాగించారు.
డ్రాతో విజయం సాధించిన వార్డుమెంబర్
కాగా చర్ల పంచాయతీలో 6వ వార్డులో మడకం కృష్ణార్జునరావు, కోరం నాగేంద్ర (టిడిపి)లకు చేరోక 107 ఓట్లు పోలయ్యాయి. అనంతరం డ్రా తీయడంతో కోరం నాగేంద్రను విజయం వరించింది. చర్ల పంచాయతీలో 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, మిగతా వార్డులను మిగతా పార్టీలు దక్కించుకున్నాయి.
చండ్రుగొండలో సత్తాచాటిన టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్
చండ్రుగొండ, జూలై 31: మండలంలో 16పంచాయతీలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు పోటాపోటీగా గెలుపొందారు. 16పంచాయతీల్లో ఆరుస్థానాల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులు అబ్బుగూడెం, జంపులరంగ, మద్దుకూరు కాకలక్ష్మి, సీతాయిగూడెం పాయింట్ల అంజన్‌రావు, పెంట్లం బుగ్గ సీతామహాలక్ష్మి, బుర్రాయిగూడెం కుంజా సావిత్రి, ఎర్రగుంట పద్దం సరోజిని విజయం సాధించారు. అదేవిధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు తిప్పనపల్లి దారావత్ పార్వతి, రాజాపురం మారుతి జానకి, పోకలగూడెం గుగులోత్ రాములు, అన్నపురెడ్డిపల్లి బానోత్ కృష్ణకుమారి, చండ్రుగొండ ఇస్లావత్ రుక్మిణి, గానుగపాడు వాసం శ్రీనుతో సహా ఆరుగురు అభ్యర్థులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. అదేవిధంగా రావికంపాడు, గుంపెన గ్రామాల సర్పంచ్‌లుగా కాంగ్రెస్ బలపర్చిన మాలోత్ హనుమ, దారాబోయిన లక్ష్మి విజయం సాధించారు. తుంగారం గ్రామసర్పంచ్‌గా సిపిఎం బలపర్చిన బానోత్ పార్వతి విజయం సాధించగా మర్రిగూడెం సర్పంచ్‌గా న్యూడెమోక్రసీ పార్టీ బలపర్చిన పద్దం శ్రీనులు ఎన్నికయ్యారు.
సీనియర్ నాయకులకు ఎదురుదెబ్బ
మండలంలో ప్రతిష్ఠాత్మకంగ్యా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీనియర్ నాయకులకు ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి వెంకటేశ్వరరావు స్వగ్రామమైన తిప్పనపల్లి గ్రామంలో టిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందారు. అదేవిధంగా 25సంవత్సరాలకు పైగా పోకలగూడెం పంచాయతీలో సర్పంచ్ పదవిని తన కుటుంబసభ్యుల ఆధీనంలో ఉంచుకుంటున్న మాజీ ఎంపిపి గుగులోత్ బాబు భార్య మాజీ ఎంపిపి మీన సర్పంచ్ అభ్యర్థిగా ఓటమి చెందడంతో బాబు కంగుతిన్నారు. అదేవిధంగా చండ్రుగొండ గ్రామ ప్రెసిడెంట్‌గా, మండల జెడ్పీటిసిగా పనిచేసిన సీనియర్ నాయకురాలు బానోత్ కమలమ్మ చండ్రుగొండ సర్పంచ్‌గా పోటీచేసి ఓటమి చెందారు. మద్దుకూరు గ్రామంలో కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్లమోతు రమణ బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందారు. దీంతో మండలంలో గత 20సంవత్సరాలుగా గ్రామాల్లో అధిపత్యం చలాయిస్తున్న నాయకులకు ఎదురుదెబ్బ తగలడం గమనార్హం.